తిరుమల శాసనాల సంశోధకుడు
ABN, First Publish Date - 2022-12-15T00:56:30+05:30
ఆదిమధ్యాంత రహితుడు, అనంత విశ్వాత్మకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుని గొప్పతనాన్ని కీర్తించే శాసనాలు, తాళపత్రాలలోని విషయాలు...
ఆదిమధ్యాంత రహితుడు, అనంత విశ్వాత్మకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుని గొప్పతనాన్ని కీర్తించే శాసనాలు, తాళపత్రాలలోని విషయాలు, స్వామివారి వైభవాన్ని, స్వామి ఆగమనాన్ని అందించే పురాణ విశేషాలు, స్వామిని భక్తితో సేవించుకున్న రారాజుల చారిత్రక విషయాలు, స్వామికి సమర్పించిన దానాలు, ఆలయంలో పాటించే నియమ నిబంధనలు అందించే శాసనాలను గుర్తించి, వాటి లిపిని పరిష్కరించిన గొప్ప తొలితరం ఆలయ పేష్కార్, ఆర్కియాలజిస్ట్ సాధు సుబ్రమణ్యశాస్త్రి.
శ్రీ వేంకటేశ్వరుని అంగాంగ దివ్య సౌందర్య రూపాన్ని పద్మపురాణంలో (అధ్యా. 4, శ్లో. 38–61) భవిష్యోత్తర పురాణం (అధ్యా. 1, శ్లో. 104–125)లో అద్భుతంగా వర్ణించారని, అలాగే ఆదిత్యపురాణం (అధ్యా. 1, శ్లో. 42)లో ఆనందనిలయ విశిష్టత చెప్పబడిందని, భవిష్యోత్తర పురాణంలో (అధ్యా. 13, శ్లో. 81)లో స్వామిని నిత్యం మట్టిపూలతో పూజించిన కుమ్మరి భీమునికి లక్ష్మీ సహితంగా స్వామి ప్రత్యక్షమైన విషయాలు అందించారు శాస్త్రి. అంతేకాకుండా సాక్షాత్తూ బ్రహ్మదేవుడే శ్రీనివాసుని పరబ్రహ్మమని తలచి బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నాడని భవిష్యోత్తర పురాణం (అధ్యా. 14, శ్లో 24–33)లలో వివరించినట్లు తెలిపారు.
12 మంది ఆళ్వార్లలో 10 మంది ఆళ్వార్లు శ్రీ వేంకటేశ్వరుని తమ పాశురాలలో వివరించారని, శ్రీ వేంకటాచలాన్ని వేంగడత్ మీయన్గా పోయిగై ఆళ్వారు 99వ పాశురంలో చెప్పారని తెలియజేశారు. పూదత్తాళ్వార్ 63వ పాశురంలో తిరుమల వాసుడు హరిహరాత్ముకుడని కీర్తించినట్లు తెలిపారు. నమ్మాళ్వార్ 35 పాశురాలు తిరువేంగడంపై గానం చేసారని తెలియజేశారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్తమాల్యద గ్రంథాన్ని శ్రీనివాసునికి అంకితం చేశారని, ఏడుసార్లు స్వామిని దర్శించుకున్నారని, స్వామికి ఆలయ గోపురాలు, మండపాలు నిర్మించారని, ఎన్నో అమూల్య రత్నాలు, ఆభరణాలు సమర్పించారంటూ అనేక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు.
తొలి శాసనాలు అనే ఒకటవ సంపుటంలో పల్లవ యువరాణి సామవై క్రీ.శ. 614లో భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించి, దీనికోసం నిత్య ధూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేసినట్లు, అలాగే 5వ అంశం పశ్చిమగంగ రాజకుమారుడు గంగాన్ స్వామికిచ్చిన బంగారంపై వచ్చే వడ్డీతో నిత్యనైవేద్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. 16వ అంశంలో ఒకటవ రాజరాజచోళుని సహచర రాణి ఉలగమాదేవి 29 గోవులను స్వామివారి దీపారాధనకు ఇచ్చినట్లు, అలాగే 20వ అంశంలో రాయన్– రాజేంద్ర చోళన్ శ్రీ కపిలేశ్వరునికి తిరుపతిలో ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది. చోళుల కాలంలో దీపారాధనకు నైవేద్యం నిమిత్తం ఇవ్వబడిన భూదానాలు, సువర్ణ నిక్షేపాలను అందించినట్లు తిరుచానూరులో లిఖించబడినాయి. అలాగే అనేకమంది రాజులు, చక్రవర్తులు, సామాన్యులు తరతరాల నుంచి స్వామికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాల నిమిత్తం ధన సంపద, పశు సంపద, భూ సంపద, ధాన్య సంపదలు ఎన్నో అందించినట్లు శాసనంలో ఉన్నట్లు తెలియపరిచినవారు సాధు సుబ్రమణ్యశాస్త్రి. అంతేగాకుండా ముస్లిం రాజులు, బ్రిటిష్ వారు, ఈస్టిండియా కంపెనీ వారు స్వామికి చేసిన దానాలు, ధర్మాలు నిర్వహించిన పాలనా పద్ధతులు మెుదలైన విషయాలు పై శాసనాలలో, పుస్తకాలలో కనిపిస్తాయని శాస్త్రి తెలిపారు.
అన్నమయ్యచే రచించబడి దాచబడిన తాళపత్రాలు బయటకు తీసి అమూల్యమైన పదసాహిత్య సంపద నేటికీ పరిఢవిల్లడానికి కారకులు శాస్త్రి. ఆంధ్రదేశంలోని కవులు తిరుమల వేంకటేశ్వరునిపై రచించిన సాహిత్యాలు, చారిత్రక విశేషాలను తిరుపతి వేంకటేశ్వర అనే గ్రంథం ద్వారా తెలియజేశారు. తిరుమల వేంకటేశ్వరునికి సాధు సుబ్రమణ్యశాస్త్రి చేసిన సేవ అజరామరం, అమోఘం, శ్లాఘనీయం.
పి.వి. బాలాజీ దీక్షితులు
(డిసెంబర్ 17: సాధు సుబ్రమణ్యశాస్త్రి జయంతి)
Updated Date - 2022-12-15T00:56:34+05:30 IST