భారతదేశ పేదరికం

ABN , First Publish Date - 2022-05-06T08:53:58+05:30 IST

గరీబ్ కా దోస్త్‌గా గౌరవమన్ననలు అందుకున్న ఐసీఎస్ అధికారి రమేష్ చంద్ర దత్ (1848–1909). 1899లో కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించిన దత్ సాహితీవేత్త, ఆర్థిక చరిత్రకారుడు...

భారతదేశ పేదరికం

గరీబ్ కా దోస్త్‌గా గౌరవమన్ననలు అందుకున్న ఐసీఎస్ అధికారి రమేష్ చంద్ర దత్ (1848–1909). 1899లో కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించిన దత్ సాహితీవేత్త, ఆర్థిక చరిత్రకారుడు. వలసపాలకులు దేశాన్ని దోపిడీ చేస్తున్న తీరును సామాన్యులకూ అర్థమయ్యేలా దత్ ఇలా వివరించారు: ‘ఒక భారతీయ కవి భావన ప్రకారం రాజు వసూలు చేసే పన్నులు సూర్యుడు భూమి నుంచి తీసుకొనే తేమ వంటివి. సూర్యుడు ఆ తేమను వర్ష రూపంలో తిరిగి భూమికి ఇచ్చేసి, దానిని సారవంతం చేస్తాడు. కాని విశేషమేమంటే భారత భూమి నుంచి ఎత్తుకొనిపోయే తేమ, ఇప్పుడు భారత భూమిపై గాక, ఇతర దేశాల నేలలపై వర్షించి వాటిని సారవంతం చేస్తోంది’. మాంఛెస్టర్ జౌళి మిల్లుల ఉత్పత్తుల నుంచి ఎదురయిన పోటీని తట్టుకోలేక భారతీయ చేనేత రంగం చితికి పోవడం గురించి దత్ కథనాలను చదివి తాను రోదించానని, నేత కార్మికుల విషాదం గురించి ఆలోచించినప్పుడల్లా నా హృదయం అల్లకల్లోమవుతుందని’ మహాత్ముడు తన ‘హింద్ స్వరాజ్’లో రాశారు. 1901లో ప్రచురితమైన దత్ పుస్తకం ‘ది ఎకానమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండర్ ఎర్లీ బ్రిటిష్ రూల్’ పీఠిక నుంచి కొన్ని భాగాలు:


భారత్‌లో బ్రిటిష్ వారి సైనిక కార్యకలాపాలు, రాజకీయ వ్యవహారాల గురించి ప్రముఖ చరిత్రకారులు ప్రశస్త పుస్తకాలు రాశారు. అయితే భారత ప్రజల వ్యాపార వర్తకాలు, పరిశ్రమలు, వ్యవసాయం, బ్రిటిష్ వారి పాలనలో వారి స్థితిగతుల చరిత్ర గురించిన పుస్తకం ఒక్కటీ ఇంతవరకు లేదు. ఇటీవలి కరువుకాటకాలతో పలువురు ఈ అంశాలపై శ్రద్ధ చూపడం ప్రారంభమయింది. భారత ప్రజల సిరిసంపదల ఆధారాలు, వారి ప్రస్తుత పేదరికానికి కారణాలను అర్థం చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. బ్రిటిష్ ఇండియా ఆర్థిక చరిత్రపై ఒక సంక్షిప్త గ్రంథం ఇప్పుడు ఎంతైనా అవసరం.

భారత ప్రజల ప్రస్తుత పేదరికం ఏ నాగరీక దేశమూ ఎన్నడూ చవిచూడనిది. పందొమ్మిదవ శతాబ్ది చివరిపాదంలో సంభవించిన కరువు కాటకాలు చాలా తీవ్రమైనవి. ప్రాచీన, నవీన యుగాలలో ఎక్కడా అటువంటి వైపరీత్యాలు నెలకొనలేదు. 1877–1900 సంవత్సరాల మధ్య సంభవించిన కరువుకాటకాలు మొత్తం కోటిన్నర మంది భారతీయులను బలిగొన్నాయి. గత పాతికేళ్లలో ఒక యూరోపియన్ దేశ జనాభాతో సమానమైన భారత జనాభా ఆకలి మరణాల వెల్లువలో కొట్టుకుపోయింది.

భారత్‌లో ఇంత కటిక పేదరికానికి, కరువు కాటకాలు పదే పదే సంభవించడానికి కారణాలు ఏమిటి? జనాభా పెరుగుదలే కారణమని, ఈ పరిణామం అనివార్యంగా కరువు కాటకాలకు దారితీస్తుందని అంటున్నారు. అయితే జనాభా పెరుగుదల రేటు ఇంగ్లాండ్‌లో ఉన్నంతగా భారత్‌లో లేదని, వాస్తవానికి భారత్‌లో గత పదేళ్లుగా జనాభా పెరుగుదల చోటుచేసుకోలేని ఒక విచారణలో వెల్లడయింది. భారతీయ రైతులు భవిష్యత్తు గురించి జాగ్రత్త పడరని ఆక్షేపిస్తున్నారు. పంటలు బాగా పండినప్పుడు ముందు దినాల కోసం ఆదా చేసుకోరని, తత్కారణంగా పంటలు దెబ్బ తిన్నప్పుడు వారు అన్ని విధాల నష్టపోతున్నారని అంటున్నారు. అయితే ఈ రైతుల మధ్య గడిపిన వారికి ఈ ప్రపంచంలో భారతీయ రైతులు అంత కష్ట జీవులు, పొదుపరులు మరే దేశ వ్యవసాయదారులలోనూ లేరన్న విషయం బాగా తెలుసు. వడ్డీవ్యాపారస్తులు భారతీయ రైతులను మోసపూరితంగా నిత్య రుణగ్రస్తులుగా ఉంచుతున్నారనేది మరో ఆరోపణ. అయితే ఇటీవలి ప్రభుత్వ రెవిన్యూ డిమాండ్ వల్లే రైతులు రుణగ్రస్తులుగా మిగిలిపోతున్నారని ఫ్యామిన్ కమిషన్ విచారణలో వెల్లడయింది.

 

బ్రిటిష్ వారి పాలనలో భారతదేశ సంపద పలు విధాల కుంచించుకు పోయిందన్నది ఎవరూ విస్మరించలేని సత్యం. పద్దెనిమిదో శతాబ్దిలో భారత దేశం గొప్ప వ్యవసాయక దేశమే కాకుండా గొప్ప వస్తు తయారీ కేంద్రం కూడా. భారతదేశ వ్యవసాయక, పారిశ్రామిక ఉత్పత్తులు ఆసియా, ఐరోపా మార్కెట్లలో వెల్లువెత్తేవి. అయితే ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ పార్లమెంటు వంద సంవత్సరాల క్రితం అనుసరించిన స్వార్థపూరిత వాణిజ్య విధా నాలతో భారత్ ఆర్థికంగా సర్వనాశనమయింది.

Read more