‘ఆటో మ్యుటేషన్’తో అంతా అయిపోదు!
ABN , First Publish Date - 2022-05-03T09:29:03+05:30 IST
భూములకు సంబంధించిన ఏ చిన్న సంగతైనా లక్షలాది రైతు కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంటుంది. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కాని భూమి, రైతు ఎప్పటికీ నిలిచే ఉంటారు...
భూములకు సంబంధించిన ఏ చిన్న సంగతైనా లక్షలాది రైతు కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంటుంది. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కాని భూమి, రైతు ఎప్పటికీ నిలిచే ఉంటారు. లోతైన పరిశీలన, చర్చ, భాగస్వామ్యంతో మాత్రమే భూ సంబంధాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవాలి. పరిస్థితి అలా లేదు. ఆదరాబాదరాగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే రెవిన్యు భూ పాలన వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసాయి. ఇటీవల వ్యవసాయ భూముల విషయమై వచ్చిన రెండు వార్తలను పురస్కరించుకునే ఈ ప్రస్తావన అంతా. ఈ రెండు వార్తలలో ఒకటి రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడిన సంగతులు కాగా రెండవది అమరావతి నుంచి రిపోర్టయిన రాష్ట్రస్థాయి రెవిన్యూ అధికారులు సమీక్ష. ఈ సమీక్షకు తక్షణ నేపథ్యం– ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తన భూమి రికార్డు మార్చడం లేదని మనస్తాపం చెంది, గుంటూరు (రూరల్) జిల్లాలో జరిగిన ఒక రైతు ఆత్మహత్య. దీనికి ప్రతిస్పందనగా రెవిన్యూ అధికారులు కొన్ని ప్రకటనలు చేసారు, అందులో కీలకమైనది భూముల యజమానుల పేర్ల మార్పుకు ‘ఆటో మ్యుటేషన్’ అనే ఒక కొత్త ప్రక్రియకు ఏర్పాట్లు. తొలుత ‘మ్యుటేషన్’, ఆనక ‘ఆటో మ్యుటేషన్’ అంటే ఏమిటో చూద్దాం.
‘మ్యుటేషన్’ అంటే మార్పు. భూమి హక్కుల రికార్డులో చేసే మార్పులను ఇప్పుడు ‘మ్యుటేషన్’ అనే మాటతో పిలుస్తున్నారు. వెంకటరావు అనే ఆసామి సుబ్బారావు అనే మరో ఆసామి నుంచి రెండు ఎకరాల భూమి కొన్నాడు. నగదు చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ గ్రామ రికార్డులో ఉన్న సుబ్బారావు పేరు తీసేసి వెంకటరావు పేరు పెట్టాలి. ఇది జరగాలంటే వెంకటరావు తన క్రియ దస్తావేజు పట్టుకొని స్థానిక తాశీల్డారుకు మార్పు / మ్యుటేషన్ కోరుతూ ధరఖాస్తు చేయాలి. ఈ మార్పులు చేయడానికి భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, దాని నియమాలలో నిర్దేశించిన పద్ధతిలో, ఆ పరిమితులకు లోబడి తాశీల్దార్ వ్యవహరించవలసి ఉంటుంది. దీనినే ‘మార్పు’ లేక ‘మ్యుటేషన్’ అంటున్నారు. ఇప్పుడు ‘ఆటో మ్యుటేషన్’ అంటే ఏమిటో చూద్దాం. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవ్వగానే, ఆన్‌లైన్ ఫోన్ పేమెంట్‌లో అవతలి వాడి ఖాతాలోకి నగదు బదిలీ అయినట్లుగా సుబ్బారావు పేరున ఉన్న భూమి వెంకటరావు పేరున తనంతతానే మారిపోతుందన్నమాట. ఇదంతా ఎందుకంటే భూమి కొనుగోలు చేసిన వ్యక్తి తన పత్రాలతో తాశీల్దార్ వద్దకు వెళ్తే అక్కడ లంచం ఇవ్వనిదే మార్పు చేయడం లేదని, కాలయాపన జరుగుతుందని దానిని నివారించడానికన్నది జవాబు. ఆటో మ్యుటేషన్ అనే సాంకేతిక ఉపకరణం ద్వారా రెవిన్యూ అధికారుల పరిధిని, జోక్యాన్ని తగ్గించేస్తే అవినీతి ఆగిపోయి లేదా తగ్గిపోయి పట్టా మార్పులు, బదిలీలు నిరాటంకంగా జరిగిపోతాయా?
భూములకు సంబధించిన హక్కుల బదిలీ, మార్పులు, చేర్పుల వ్యవహారాలూ ప్రస్తావిత వెంకట్రావు – సుబ్బారావుల చిత్రం అంత సరళంగా వుండవు. చాల హక్కులు, వ్యక్తులకే కాదు ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉండే అవకాశం వుంది. అందుచేతా ముందు వెనుక చూసుకొని, సాధ్యమైనంత వరకు అందరికీ సమాచారం, అవకాశం ఇచ్చి మార్పుల ప్రక్రియను చేపట్టవలసి ఉంటుంది. అలాగాకపొతే హక్కుల వివాదాలు తగ్గకపోగా పెరిగిపోయే అవకాశాలే ఎక్కువ. భూ పరిపాలనలో భూములకు సంబంధించి వివిధ రకాల సమాచారాలను ఇచ్చే రికార్డులు వున్నాయి. గతంలో ఒక రెవిన్యూ గ్రామానికి 34వరకు భూమి రికార్డులు ఉండేవి. వాటికి ‘జమాబంది’ పేరున ప్రతి ఏడాది ఆడిట్ ఉండేది. జమాబంది పూర్తయితేనే ఆ ఫసలి (వ్యవసాయక సంవత్సరం) భూమి రికార్డుల మార్పులు చేర్పులు ముగిసినట్లుగా భావించేవారు. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక గ్రామానికి భూమి రికార్డులు 34 నుంచి 11కు చేరాయి. భూమి రికార్డులను రెండు రకాలుగా చూడాలి 1. సెటిల్మెంట్ భూమి రికార్డులు 2. రెవిన్యూ భూమి రికార్డులు. రెవిన్యూ భూమి రికార్డులు ప్రతి ఫసలికి తాజా పర్చబడితే, భూ పాలనకు పునాదైన సెటిల్మెంట్ భూమి రికార్డులను ప్రతి 30 ఏళ్లకు ఒకసారి కొత్తగా తయారుచేసుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తాలకు చెందిన మన సెటిల్మెంట్ భూమి రికార్డులు 60 నుండి 100 ఏళ్ల పాతవి. సెటిల్మెంట్ భూమి రికార్డులకు – రెవిన్యూ భూమి రికార్డుల సమాచారానికి అంతరం ఎంతగా పెరిగిపోయిందంటే, సెటిల్మెంట్ భూమి రికార్డులో ఉన్న మొదటి యజమాని నుంచి ఇప్పటి యజమానికి భూమి ఎలా సంక్రమించిందని అడిగితే చెప్పలేని స్థితి వచ్చేసింది. భూ యజమానుల హక్కుల నమోదు, మార్పులకొరకు 1971లోనే భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం చేసారు. 1980, 1989లలో చట్టానికి సవరణలు వచ్చాయి. అయితే ఈ చట్టానికి మూడవ సవరణ 2016లో జరిగింది.
హక్కుల రికార్డు మార్పిడికి పట్టాదారు పాసు పుస్తకాల చట్టంలో ఉన్న ఏర్పాటు ఏమిటి? వెంకటరావు ధరఖాస్తుపై గ్రామ రెవిన్యూ అధికారి, రెవిన్యు ఇన్‌స్పెక్టర్ ప్రాథమిక విచారణ చేయాలి. ఆ భూమికి సంబంధం ఉన్నవారికి, అప్పటికే రికార్డులో నమోదై ఉన్నవారికి లిఖిత నోటీసు (సమాచారం) ఇవ్వాలి. ఇదిగాక ఆ గ్రామ ప్రజలకు తెలిసే విధంగా తాము ప్రతిపాదిస్తున్న మార్పులకు ముందు రికార్డు ఎలా ఉంది, ఇప్పుడు మారిస్తే ఎలా ఉండబోతున్నది చూపిస్తూ ఒక ముసాయిదా హక్కుల రికార్డును ప్రజలముందు ఉంచాలి. సమస్య ఏమిటంటే, ఈ పారదర్శకమైన ప్రక్రియను పాటించడం వలన సమస్యలు రావు, వాటిని పాటించకపోవడం వలనే వివాదాలు వస్తున్నాయి. భూమి రికార్డు మార్పులో పైన చెప్పిన ప్రక్రియ (ప్రాసెస్)ను చేపట్టకుండ ఉండేందుకు లేదా దానిని ‘బైపాస్’ చేసి మండల రెవిన్యూ కార్యాలయంలోనే రికార్డును నేరుగా మార్చేయడానికి అధికారులు భారీగా లంచాలు గుంజుతున్నారని, ‘లంచం’ రేటు తేలేవరకూ ‘ప్రక్రియ’ పేరుతో సాగదీస్తున్నారని ఆరోపణ. ఇది అక్షరాల నిజం. అయితే తానుగా పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నాయకత్వానికి అధికారుల అవినీతిని అరికట్టగలిగే రాజకీయ సంకల్పం, నైతిక శక్తి ఎలా వుంటుంది? అధికారులు వ్యక్తులుగా పాల్పడే అవినీతి మీద వచ్చిన ఫోకస్ వేరే రూపాలలో జరిగే అవినీతిపై ఉండదు. సచివాలయంలోని ఐఏఎస్ అధికారులకు ఈ వాస్తవం తెలీదా?! మహాబాగా తెలుసు. రాజకీయ నాయకులకూ తెలుసు. ఇది ఒక విషవలయం. అంతే. అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వానికి చిరాకు తెచ్చే సమస్యలకు సీనియర్ అధికారులు పరిష్కారం చూపాలి. అదే సమయంలో మౌలిక అంశాలలోకి వెళ్లకూడదు. ఒక గ్రామం టీస్టాల్‌లో దళితులకు వేరే గ్లాసులతో టీ ఇస్తున్నారని ఫిర్యాదు వస్తే దాని విచారణకు వెళ్ళిన ఐఏఎస్ వారు ఆ గ్రామ టీ దుకాణాలలో ఇక నుంచి డిస్పోజబుల్ గ్లాసులు వాడాలని ఆర్డరు వేసారు. అది చమత్కారంతో కూడిన పరిష్కారం. భూ రికార్డుల మార్పిడికి వీఆర్వో నుంచి తాశీల్దార్ వరకు తినేస్తున్నారు గనుక వారిని బైపాస్ చేసే సాఫ్ట్‌వేర్ పరిష్కారమే ఈ ‘ఆటో మ్యుటేషన్’ సుమా!
మండల రెవిన్యు కార్యాలయంలో అవినీతి ఉంది గనుక ఇవాళ ఆటో మ్యుటేషన్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఉంది గనుక రేపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. గత ప్రభుత్వంలో దీనికి కూడా రంగం సిద్ధం చేసారు. ఈ లోగా ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఆర్డీఓ కార్యాలయంలోని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే (DIOS) తనిఖీ / ధ్రువీకరణ అధికారాన్ని తాము మండల సర్వేయరుకు ఇస్తున్నామని, భూమి రిజిస్ట్రేషన్‌కు ముందే భూమి సర్వే, సబ్ డివిజన్ జరిగేలా చేయండంద్వారా ఇక వివాదాలు రాకుండా ‘ఆటో మ్యుటేషన్’కు మార్గం సుగమనం చేస్తున్నామని రాష్ట్ర రెవిన్యూ అధికార పెద్దలు చెపుతున్నారు. ఇది కేవలం భూమి విస్తీర్ణం, హద్దుల సమస్య మాత్రమేకాదు హక్కుల సమస్య. ఒక పారదర్శక ప్రక్రియగా హక్కుల నిర్ధారణకు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం నియమాలు చెప్పిన ప్రక్రియను ‘ఆటో మ్యుటేషన్’ ద్వారా ‘బైపాస్’ చేస్తే అది ‘కొరివితో తల గోక్కోవడం’ అవుతుందేమో గమనించుకోవాలి. మరైతే ఎం చెయ్యాలి? సమస్య ఉంది, దానికి మీ పరిష్కారం ఏమిటి? అనే ప్రశ్న రాకమానదు. భూముల సమగ్ర రీ సర్వే చేసి సర్వే భూమి రికార్డును మరల తయారు చేసుకోవడం తప్పనిసరి. వాటి ప్రాతిపదిక మీద రెవిన్యూ భూమి రికార్డును నిర్మించుకొని రావాలి. ఈలోగా, కార్యాలయం చేతి రికార్డుతో కంప్యూటర్ 1బి (హక్కుల) రికార్డును సరిచూసి ధ్రువీకరించాలి. పట్టాదారు పాసు పుస్తకాల చట్టంకు 2016లో తెచ్చిన సవరణను రద్దుచేయాలి. నిలిపివేసిన భూమి రికార్డుల ఆడిట్ / జమాబందిని పునరుద్ధరించాలి. గ్రామ భూమి రికార్డును గ్రామంలో నిర్వహించాలి. కంప్యూటర్‌లో వున్న భూమి రికార్డు సమాచారం కేవలం తెలుసుకునే సమాచార సాధనంగా మాత్రమే వాడుకోవాలి. వాటికి ఇచ్చిన చట్టబద్ధతను రద్దు చేయాలి. సమగ్ర భూ సర్వే సెటిల్మెంట్ లేకుండా సంతృప్తికరమైన భూమి రికార్డు ఉండదని గుర్తించాలి. రెవిన్యూ భూ పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని తొలగించాలి.
పియస్ అజయ్ కుమార్
జాతీయ కార్యదర్శి
అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం

