పదవులు వరించిన ప్రాజ్ఞుడు

ABN , First Publish Date - 2022-05-07T06:20:49+05:30 IST

రాజకీయాలలో వర్గబలం, ధన బలమే గానీ సౌశీల్య సంపదలు పని చేస్తాయా? అయినా దామోదరం సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు, మరీ ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు అయ్యారు. ..

పదవులు వరించిన ప్రాజ్ఞుడు

రాజకీయాలలో వర్గబలం, ధన బలమే గానీ సౌశీల్య సంపదలు పని చేస్తాయా? అయినా దామోదరం సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు, మరీ ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు అయ్యారు. ఈ కీలక పదవులను నిర్వహిస్తూ కూడా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకు ఆయన తావివ్వలేదు. దామోదరం సంజీవయ్య చాలా అరుదైన రాజకీయ నాయకుడు.


దళితుడు అయిన దామోదరం సంజీవయ్య రాష్ట్రంలో అత్యున్నత స్థానాన్ని పొందడం అగ్రవర్ణ రాజకీయవాదులకు కంటగింపు అయింది. 1962 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపించినప్పటికీ అనంతర కాలంలో సంజీవయ్య తన ముఖ్యమంత్రిత్వాన్ని నిలుపుకోలేకపోయారు. ఆయన తన ముఖ్యమంత్రి పీఠాన్ని నీలం సంజీవరెడ్డికి ధారాదత్తం చేయవలసి వచ్చింది. సంజీవరెడ్డి మంత్రి మండలిలో చేరేందుకు సంజీవయ్య నిరాకరించారు. తన మిత్రుడైన అల్లూరి సత్యనారాయణరాజును సంజీవరెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకోకపోవడమే అందుకు కారణం. ఇది సంజీవయ్యలోని స్నేహతత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఎంతమంది రాజకీయవాదులు స్నేహం కోసం తమ రాజకీయ ప్రయోజనాల్ని త్యాగం చేయగలరో చెప్పండి.


సంజీవయ్య అధికార పీఠం నుండి వైదొలగిన ప్రతి సందర్భంలోనూ విధి తన వంతు పాత్రను నిర్వహించింది. ఒకవేళ ఆయన కనుక సంజీవరెడ్డి మంత్రి మండలిలో చేరి ఉంటే జాతీయ స్థాయిలో అంత త్వరితగతిన వెలుగులోకి వచ్చే అవకాశం లభించి ఉండేది కాదు. సంజీవయ్య ఆనాడు సంజీవరెడ్డి మంత్రి మండలిలో చేరకపోవడంతో ఆయన ప్రత్యర్ధులు పరమానంద భరితులయ్యారు. ఇక ఇంతటితో సంజీవయ్య రాజకీయ జీవితం ముగిసినట్టేనని సంతోషించారు. అయితే ఆయన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు అయ్యారు.


సమాజ హితం కోసమే జీవించిన దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలం పెద్దపాడులో మునియ్య, శ్రీమతి సుంకులమ్మలకు జన్మించారు. ప్రాధమిక విద్యను, హైస్కూల్‌ విద్యను చదివిన తరువాత, బ్యాచ్‌లర్‌ డిగ్రీను మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1946–52 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శాసనసభ్యుడుగా ఉన్నారు. 1950–52 వరకు ప్రోవిజనల్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. 1952లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కర్నూలు నియోజకవర్గంనుండి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ఇండిపెండెంట్‌ ప్రత్యర్థి యస్‌. శంకరయ్యపై విజయం సాధించారు. ఆ తరువాత టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ప్రణాళిక, ఆరోగ్యం, హరిజన సంక్షేమం, సహకార కమ్యూనిటీ మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1954లో బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పని చేశారు. 1955లో శాసనసభ మధ్యంతర ఎన్నికలలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, సమీప సిపిఐ ప్రత్యర్థి రామచంద్రయ్యపై విజయం సాధించారు.


1956లో నీలం సంజీవరెడ్డి నేతృత్వంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ, గృహవసతి, సహకార శాఖను సమర్థంగా నిర్వహించారు. 1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 12 వరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1962 ఎన్నికలలో కోడుమూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా సంజీవయ్య రికార్డు సృష్టించారు. 1964 నుంచి 1972 వరకు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. 1964–67 సంవత్సరాల మధ్య కేంద్ర కార్మిక ఉపాధి పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసిన సంజీవయ్య తిరిగి 1970 ఫిబ్రవరి నుంచి పదమూడు నెలల పాటు కేంద్ర కార్మిక, పునరావాస శాఖను నిర్వహించారు. ఇలా పదవులు ఆయనను వెదుక్కుంటూ వచ్చి వరించాయి తప్ప ఆయన ఏనాడు పదవుల కోసం వెంపర్లాడలేదు. మృదు స్వభావి, స్నేహశీలి అయిన సంజీవయ్య తన విశాల హృదయంతో అందరినీ మన్నించి గౌరవించిన ఉత్తమ సంస్కారి. నిర్వహించిన ప్రతి పదవిలో పాలనా దక్షత చూపి ప్రజాభిమానాన్ని విశేషంగా పొందిన ఉదాత్తుడు సంజీవయ్య. పట్టుదలకు దృఢ సంకల్పం తోడయితే అత్యున్నత శిఖరాలు అధిరోహించటంలో కుల మతాలు అడ్డురావని నిరూపించిన నిస్వార్థ ప్రజాసేవకుడు దామోదరం సంజీవయ్య.


మిత్రుడు, సహచరుడు అయిన ఎ.సి సుబ్బారెడ్డి తాఖీదులకు సంజీవయ్య తలవంచలేదు. మంత్రి పదవికి రాజీనామా చేయమని సుబ్బారెడ్డిని ఆదేశించారు. సుబ్బారెడ్డి తన రాజీనామాను ఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి పంపించారు. ఎంతో తాత్సారం జరిగింది. సంజీవరెడ్డి జోక్యం చేసుకున్నారు. చివరకు సంజీవయ్య తన వంతు ప్రయత్నాలన్నీ చేసి సుబ్బారెడ్డి రాజీనామాను గవర్నర్‌కు పంపించారు. గవర్నర్‌ వెంటనే దాన్ని ఆమోదించారు. ఇదేమంత చిన్న విషయం కాదు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే బోలెడు సాహసం అవసరం.బహుశా తన కేబినేట్‌ సహచరుడిని తొలిగించిన తొట్టతొలి ముఖ్యమంత్రి సంజీవయ్యే కావచ్చు. నాడు అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉంటూ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న సంజీవరెడ్డితో సంజీవయ్య నిరంతరం పోరాటం సలిపారు. పంటలు –పశువుల బీమాను ప్రవేశపెట్టి పేద రైతాంగానికి వరదలు, తుఫాన్ల నష్టాల నుంచి ఉపశమనం కలిగించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక ప్రణాళికే సంజీవయ్య ఆర్థిక విధానం. సహకార రంగంలోనూ పరిశ్రమల స్థాపన జరగాలని సంజీవయ్య కోరుకున్నారు.


1957లో నవ్య సాహితీ సమితీ వారు హైదరాబాద్‌ న్యూసైన్స్‌ కాలేజీలో తమ సంస్థ పదవ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. సంజీవయ్యను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ సభలో మరొక వక్త డాక్టర్‌ భోగరాజు సీతారామయ్య. సంజీవయ్య ప్రసంగం అక్కడి రసజ్ఞ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆయన గళం నుంచి వెలువడిన గీత మాలికల మాధుర్యంతో ఆ సభ యావత్తు పులకరించింది. సంజీవయ్య సమగ్ర జీవిత చరిత్ర ఇంకా రావాల్సే ఉంది. అది త్వరలోనే రాగలదని ఆశిద్దాం.

 బత్తుల వీరాస్వామి 

అంబేడ్కర్‌ యువజన సంఘం

(దామోదరం సంజీవయ్య 50వ వర్ధంతి సందర్భంగా)

Read more