ఇక, చివరి యుద్ధాల మోహరింపు!

ABN , First Publish Date - 2022-12-29T01:12:58+05:30 IST

విషయం గంభీరంగా, తీవ్రంగా ఉన్నప్పుడు విదూషకత్వం మంచిది కాదు. అటువంటి మాటలు మాట్లాడడానికి తమకు యోగ్యత ఉన్నదని వారు అనుకోవచ్చును కానీ...

ఇక, చివరి యుద్ధాల మోహరింపు!

విషయం గంభీరంగా, తీవ్రంగా ఉన్నప్పుడు విదూషకత్వం మంచిది కాదు. అటువంటి మాటలు మాట్లాడడానికి తమకు యోగ్యత ఉన్నదని వారు అనుకోవచ్చును కానీ, ఒక్కోసారి సమయం సందర్భం అందుకు అనుమతించవు. మేధావులు మౌనం వీడాలని కెసిఆర్ మాట్లాడడమే హాస్యాస్పదం అనుకుంటే, ఆయన కుమార్తె కూడా అదే పాట అందుకున్నారు. కెసిఆర్, కెటిఆర్ కూడా ఎప్పుడైనా ఉచ్చరించారో లేదో తెలియదు కానీ, ఫాసిజం అన్న మాటను కూడా కవిత ప్రయోగించారు. దేశంలో ఫాసిజం నెలకొంటున్నదన్న అభిప్రాయం విస్తృతంగా వ్యాపించి ఉన్నది కాబట్టి, అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, కవిత తాను ప్రస్తుతం చిక్కుకుపోయిన పరిస్థితులలో ఆ మాట ప్రత్యేకంగా వినిపిస్తుంది. గత ఎనిమిదేళ్ల పాలనలో భిన్నాభిప్రాయాల విషయంలో రాష్ట్రప్రభుత్వం ప్రదర్శించిన వైఖరి సుప్రసిద్ధమే. తమ సామాజిక నేపథ్యానికి చెందిన రాష్ట్రపతిని కలుసుకుని కష్టాలు చెప్పుకోవడానికి, వినతులు ఇవ్వడానికి ప్రయత్నించిన ఆదివాసులను, వారి సంఘాల ప్రతినిధులను ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసులు బుధవారం నాడు నిర్బంధించారు. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్ష అభ్యర్థిని బలపరిచిన గతాన్ని తుడిచిపెట్టడానికి కాబోలు, ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వం హైదరాబాద్ అంతటా అట్టహాసపు స్వాగత ప్రకటనలు గుప్పించింది.

మాట్లాడే మాటలు, చేసే చేతలు ఏవైనప్పటికీ, కెసిఆర్ పెద్ద ప్రమాదంలో ఉన్నారన్నది నిజం. ముప్పు కొద్దికొద్దిగా ముంచుకు వస్తున్నది, ఎత్తుకు పై ఎత్తు వేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉన్నది కానీ, తప్పుల మీద తప్పులు చేయగలిగిన చరిత్ర కూడా ఉన్నది. మహాబలశాలి అయిన ప్రత్యర్థి, తన చేతిలో ఉన్న సమస్త శక్తులతో పాటు, కెసిఆర్, ఆయన పార్టీ, ఆయన ప్రభుత్వం చేసిన తప్పులను కూడా సమర్థంగా వినియోగించుకుంటున్నాడు. దేశంలోని ప్రగతిశీల శక్తులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు భయపడుతున్న ఫాసిస్టు ప్రమాదంలో భాగంగానే కెసిఆర్, ఆయన పరివారం ఇబ్బందిలో పడుతున్నారు. అందులో కూడా సందేహం లేదు. అంతమాత్రాన, వారి లోపాలు మాఫీ అయిపోవు. ఆత్మరక్షణ కోసమైనా, తెలంగాణ సహజీవన సంస్కృతి రక్షణ కోసమైనా, జాతీయస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమైనా, గట్టి పోరాటం చేయగలిగే నైతిక శక్తి వారిలో లోపించింది కాబట్టి, ప్రమాదతీవ్రత మరింత పెరుగుతున్నది. గతంలో ప్రతిష్ఠ కోల్పోయిన నేతలకు కమ్యూనిస్టుల స్నేహం మాట్లు వేసేది. ఇప్పుడు ఆ వైద్యం పనిచేస్తున్నట్టు లేదు. తెలంగాణ సమాజం విశాలమైనది, నిశిత దృష్టి కలిగినది.

దేశంలో ఎన్నికల రాజకీయాలలో ఉన్న ప్రతిపక్ష రాజకీయశక్తులన్నిటికి సిద్ధాంతబలం, నైతికశక్తి లోపించడమే ఇప్పటి సమస్య. ఒక విశ్లేషక మేధావి ప్రశ్నించినట్టు, 2024 ఎన్నికల మీదనే ఎందుకు ఇంత గురి, ఇంత బాధ్యత? ఎన్నికల మీద మాత్రమే ఆశలు పెట్టుకుంటే నిరాశే ఎదురవుతుంది. సమస్త ప్రజారంగాలలోనూ ప్రతిఘటనను నిర్మించడమే నికరమైన ఫలితాలను ఇస్తుంది. అలాగని, ఎన్నికల కీలకత్వాన్ని తగ్గించలేము. ప్రభుత్వ విధానాల మీద ఏదో ఒకనాటికి ప్రజలలో విముఖత పెరుగుతుందని, అప్పుడు ఆ వ్యతిరేకతను లబ్ధిగా మార్చుకోవచ్చునని చూడడం ప్రతిపక్షాలకు అలవాటయింది. ప్రభుత్వ వ్యతిరేకతను నిర్మించే పని కూడా ప్రతిపక్షాలు చేయవు. వివిధ ప్రజారంగాలలో ఉన్న ప్రజాస్వామిక వాదులు భావప్రచారాన్ని, ఉద్యమాలను చేయడం వల్ల ప్రజలలో చైతన్యం కలగడమే కాకుండా, ప్రతిపక్షాలలో కూడా కదలిక సాధ్యపడుతుంది.

ముగుస్తున్న సంవత్సరంలో కీలకమయిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బిజెపి రెండోసారి ఘనవిజయం సాధించింది. గుజరాత్‌లో మెరుగైన ఘనవిజయం పొందింది. హిమాచల్ ప్రదేశ్‌లో, ఢిల్లీ స్థానిక సంస్థలలో ప్రతిపక్షాలు గెలిచాయి. బిహార్‌లో నితిశ్ కుమార్ భాగస్వామ్యపార్టీని మార్చి, ప్రతిపక్షశిబిరంలోకి ఫిరాయించారు. పట్టుదల ఉన్నవారు జయాపజయాల నుంచి తగిన సందేశాన్ని అందుకుంటారు. అమృతోత్సవం హడావుడి త్వరలోనే చల్లారిపోయింది. చరిత్రపై యుద్ధం సాగుతూనే ఉన్నది. అన్నిటికంటె పెద్ద పరిణామం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తలపెట్టిన జోడో యాత్ర. ఆచరణాత్మక ఫలితాల కంటె ఆదర్శ ప్రకటనే ఎక్కువ ఉన్నదని పెదవి విరుస్తున్నవారున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి, తనకూ కూడా పేరు ప్రతిష్ఠలను పెంచగలిగిన కార్యక్రమం అది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా ఎంతో కొంత మాట్లాడడం మొదలుపెట్టారు. ఇన్ని జరుగుతున్నా, ప్రతిపక్షాలను ఒక గీత మీదకో, ఒక వృత్తంలోపలికో తీసుకువచ్చే ప్రయత్నాలు జరగడం లేదు. కర్ణాటక, తెలంగాణతో సహా, అనేక రాష్ట్రాల ఎన్నికలు 2023లో జరగనున్నాయి. కాశీ గ్యాన్ వాపీ వివాదం ప్రస్తుతానికి విశ్రాంతిలో ఉండగా, తాజాగా మధురలో కొత్త వివాదం న్యాయప్రక్రియలో జీవం పోసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి ప్రయత్నాలు మొదలయ్యాయి. పాలకయంత్రాంగంతో గట్టిగా వ్యవహరిస్తున్నప్పటికీ, అనేక కీలక అంశాల మీద న్యాయవ్యవస్థ స్పందనలు ఎట్లా ఉంటాయన్నది ఊహించలేము. జాతీయ మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయిన స్థితిలో, ప్రజాస్వామ్యంలో కొనవూపిరితో మిగిలిన ఒంటి స్తంభంగా భావిస్తున్న న్యాయవ్యవస్థ తీసుకోగలిగే బాధ్యతభారానికి పరిమితులుంటాయి. పరిస్థితుల క్రమాన్ని మార్చాలన్న సంకల్పం ప్రజలలో వ్యక్తమైతే తప్ప, ఒక్కొక్క ప్రజాస్వామిక వ్యవస్థా కోలుకోవడం మొదలుకాదు. అయితే, మోహరించిన బలగాలలో సమతూకం లేదు. బహుముఖాలుగా, బాహుబలి పనిచేస్తున్నప్పుడు, ప్రత్యామ్నాయంగా వ్యవహరించవలసిన వారు చీలికలు పేలికలుగా ఉన్నారు. అనేక ప్రాంతీయ పార్టీలకు సొంతదృష్టి తప్ప, దూరదృష్టి లేదు, రాజనీతి లేదు. ఎవరికి వారు స్వచర్మరక్షణార్థం ప్రయత్నించడమే తప్ప, కట్టుగా ఉండడం, జట్టు కట్టడం మీద నమ్మకం లేదు.

ఒక రాజకీయశక్తి సిద్ధాంతాలు ఏమిటి, వారికి అధికారం సంక్రమించినప్పుడు వారు అనుసరించబోయే విధానాలు దేశాన్ని ఎటు తీసుకుపోతాయి వంటి అంశాలపై ప్రజాజీవితంలో ఉన్నవారికి అవగాహన ఉండాలి. 2009 సంవత్సరంలో ఇంకా ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే ఆడ్వాణీని కలిసి అభినందించినప్పుడు కానీ, 2014 తరువాత పార్లమెంటులో అనేక నిర్ణయాలపై మద్దతు ఇచ్చినప్పుడు కానీ, కెసిఆర్‌కు భవిష్యత్ చిత్రపటం సాక్షాత్కరించలేదు. పంటిబిగువున గెలవగలిగినా మునుగోడు పోరు చుక్కలు చూపించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తన మెడకే చుట్టుకుంటున్నది. ప్రజాభిమానం తనవైపు మళ్లుతున్న స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నా, దాన్ని స్థిరపరుచుకునే వ్యూహం మీద పూర్తి దృష్టిపెట్టకుండా, బిజెపితో ఏదో ఒక స్థాయి స్నేహం మీద ఆశలు పెట్టుకుంటున్న చంద్రబాబు నాయుడుకు కూడా ఇంత అనుభవం తరువాత కూడా పర్యవసానాల మీద స్పష్టత రాలేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడం కానీ, బలమైన నాయకులు ప్రాంత స్థాయిలో ఎదగడం కానీ బిజెపి సహించదు. అదేదో వ్యక్తిగత వ్యతిరేకత కాదు, బలమైన కేంద్రం అన్నది బిజెపి సిద్ధాంతం. వారు నమ్మే తీవ్రజాతీయతకు ప్రాంతీయ ప్రయోజనాల వాదం వ్యతిరేకమైనది. ఆంధ్రప్రదేశ్ మీద గురి పెట్టడానికి సమయం పట్టవచ్చును కానీ, ఈ లోగా అక్కడ ప్రత్యామ్నాయంగా జనప్రియ నాయకుడు బలపడే అవకాశాన్ని వారు ఇష్టపడరు. తెలంగాణలో వెంటనే తాము అధికారంలోకి రాగల అవకాశాన్ని చూస్తున్నారు కాబట్టి, రాజీకి అవకాశం లేని పోరాటం కెసిఆర్‌తో చేస్తున్నారు. కెసిఆర్ జీవన్మరణ పోరాటం చేయవలసిందే, గత్యంతరం లేదు.

ఇన్ని వరుస విజయాల మధ్య కూడా, బిజెపికి 2024 ఎంతో కీలకమయినది. ఆ పార్టీకి ఒక కాలక్రమ ప్రయాణమున్నది. అందులో అవాంతరాలకు ఆస్కారముండకూడదు. మహా శక్తిశాలురకు ప్రజాస్వామ్యం మీద ఉండే ఫిర్యాదు ఏమిటంటే, అది ఎవరినైనా గద్దె దింపగలదు. జరిగిన తప్పులను సరిదిద్దగలదు. బిజెపికి 2024లో గెలుపు గ్యారంటీ కావాలంటే, 2023లో జరిగే అసెంబ్లీల ఎన్నికలలో విజయాలు రావాలి. తెలంగాణ విషయానికి వస్తే, కెసిఆర్‌కు ఉనికి సమస్య. గెలిచి తీరాలి. అందుకే హోరాహోరీ పోరు ఇప్పటికే మొదలయింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే, మధ్యప్రదేశ్‌లో విజయానికి అది ఉపయోగపడుతుంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని నిలుపుకోవడానికి తోడ్పడుతుంది. 2024కు కావలసిన మోహరింపులు తీవ్రమవుతాయి. లేదూ, ఏ తీవ్ర ఆవేశాలకో ఆస్కారమిచ్చే పరిణామాలు జరిగితే, బుల్డోజర్ జైత్రయాత్ర 2023 నుంచే ప్రారంభమవుతుంది.

ఈ ఏడాది ప్రతిపక్ష సమీకరణలు అడుగు ముందుకు పడింది లేదు కానీ, ప్రజల నుంచి ప్రజాస్వామిక స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముస్కాన్ ప్రతిఘటన దగ్గర నుంచి, జహంగీర్ పూర్‌లో కూల్చివేతల నిరసన దాకా, అవకాశం లభించిన ప్రతిసారి, అందుబాటులో ఉన్న పద్ధతుల్లో ప్రజలు గొంతు విప్పారు. కొన్నిచోట్ల పోలింగ్ ద్వారా స్పందించారు. భావ రంగంలో అనేక నిరసనలు వ్యక్తం అయ్యాయి. సామాజిక మాధ్యమాలలో సైతం ప్రగతిశీలత, హేతుబద్ధత బలమైన గొంతులుగా మారుతున్నాయి. నచ్చని సినిమాలమీద, నటుల మీద నిషేధాస్త్రాలు విఫలమవుతున్నాయి. ద్వేషం మీద వ్యతిరేకత ఏమో కానీ, విసుగు పెరుగుతున్నది. వచ్చే ఏడాది ఈ క్రమం మరింత బలపడుతుందా? లేక, మళ్లీ, ఏదో ఉన్మాదంలోకి జారిపోతామా?

కె. శ్రీనివాస్

Updated Date - 2022-12-29T01:12:58+05:30 IST

Read more