మళ్ళీ మొదటికొచ్చిన ముదిరాజ్ రిజర్వేషన్లు!
ABN, First Publish Date - 2022-11-03T03:55:28+05:30
తెలంగాణ రాష్ట్రంలోని వెనకబడిన తరగతుల జనాభాలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న ముదిరాజులు తమ రిజర్వేషన్...
తెలంగాణ రాష్ట్రంలోని వెనకబడిన తరగతుల జనాభాలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న ముదిరాజులు తమ రిజర్వేషన్ సౌకర్యం కోసం దాదాపు పన్నెండేళ్ళకు పైగా చేస్తున్న న్యాయపోరాటం ఈ అక్టోబర్ 11న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తుదితీర్పుతో నీరుగారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి చొరవతో ముదిరాజులను బీసీ–డీ నుండి బీసీ–ఏ గ్రూపులోకి మారుస్తూ జీవో 15 పేరిట వెలువరించిన ప్రభుత్వ ఉత్తర్వులు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకుండానే నిర్వీర్యమైపోయాయి.
ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ బీసీ–ఏ గ్రూపులోని కొన్ని సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశాయి. అక్కడ ముదిరాజులకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దీనిపై ముదిరాజులు 2010లోనే సుప్రీంకోర్జును ఆశ్రయించారు. పన్నెండేళ్ళ నిరీక్షణ తర్వాత ఈ నెల 11న సుప్రీంకోర్టు తుదితీర్పును వెలువరించింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్‌లను తోసిపుచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని వెనకబడిన తరగతుల కమిషన్ ద్వారా వీలున్న ప్రత్మామ్నాయ మార్గాలను అన్వేషించి పరిష్కారాన్ని సూచించాలని సుప్రీంకోర్జు ఈ తీర్పు సందర్భంగా ఆదేశించింది. నిజానికి వెనకబడిన తరగతుల కమిషన్ చేసిన సిఫారసులతోనే నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో 15ను వెలువరించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం పన్నెండేళ్ళు కాలయాపన చేసి పరిష్కారమేమీ సూచించకుండా సమస్యను తిరిగి అదే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పింది.
1970లో అనంతరామన్ కమిటీ సమర్పించిన నివేదికలో తెనుగు, ముత్రాసి, బంటు, తదితర పేర్లతో ఉనికిలో ఉన్న ముదిరాజులను ‘విముక్త జాతుల’కు సంబంధించిన వారిగా గుర్తించింది. కానీ సాంప్రదాయ వృత్తికి సంబంధించిన విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఇతర కులాలకు సంబంధించిన వర్గీకరణలో బీసీ–డీ గా గుర్తించింది. 2009లో నాటి బీసీ కమిషన్ అనంతరామన్ కమిటీ ‘పొరపాటున’ బీసీ–ఏ గ్రూపులో చేర్చాల్సిన ముదిరాజులను బీసీ–డీ గ్రూపులో చేర్చిందని నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ముదిరాజులను బీసీ–ఏ గ్రూపులోకి మారుస్తూ జీవో 15 ఉత్తర్వులను జారీ చేసింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఉత్తర్వులను కొట్టివేసింది.
అయితే, జీవో 15 ఉత్తర్వుల వెనకా, దాన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునివ్వటం వెనకా వై.ఎస్. రాజశేఖరరెడ్డి చొరవ ఉన్నదనే చర్చ ముదిరాజ్ సామాజికవర్గం ప్రజల్లో ఇంకా సజీవంగానే ఉన్నది. అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న ముదిరాజుల ఓట్లను సమీకరించే రాజకీయ కుట్రలో భాగంగానే అమలుకు అవకాశం లేని ఉత్తర్వులను పావుగా వాడుకున్నారనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ముదిరాజ్ కుల సంఘాలకు చెందిన నాయకులు సుప్రీం కోర్జును ఆశ్రయించారు. ఈ కేసులో వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్జు 2010 అక్టోబర్ 28న మూడునెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది! ఈ ఆదేశాలకు అనుగుణంగా జస్టిస్ ధళవ సుబ్రహ్మణ్యం నాయకత్వంలోని బీసీ కమిషన్ నివేదికను తయారుచేసేందుకు అవసరమైన కసరత్తును నిర్వహించింది.
2011 నాటికి ఈ కమిషన్ కాలపరిమితి ముగిసిపోవటం, అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడం... తదితర అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు విధించిన గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పించ లేదు. ఈ పరిణామాల క్రమంలో జూన్ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ముదిరాజుల రిజర్వేషన్ అంశం కోర్టులో వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్ సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బి.ఎస్. రాములు చైర్మనుగా ప్రప్రథమ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన బీసీ కమిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. అయితే 2010 అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా ఎలాంటి నివేదికను బీసీ కమిషన్ సమర్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలు కోరుతూ దాగుడుమూతలాడింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో సుప్రీం కోర్టు 2018 జూలై అయిదున బీసీ కమిషన్ తన నివేదికను సమర్పించడానికి డిసెంబర్ 2018 వరకూ అవకాశాన్ని కల్పిస్తున్నామని, ఈ విషయంలో మరోసారి ఎలాంటి అవకాశాలను ఇచ్చేదిలేదని ఖరాఖండిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు విధించిన గడువులోగా బీసీ కమిషన్ ఎలాంటి నివేదికను కోర్టుకు సమర్పించలేదు.
జూలై 2018 నుంచి సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చిన అక్టోబర్ 11 దాకా, అంటే దాదాపు 50 నెలల సుదీర్ఘ విరామ కాలంలో, ముదిరాజుల రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నామని చెప్పుకుంటున్న సంఘాలు గానీ, కేసులో భాగస్వాములు కావడం ద్వారా అనేక వ్యయప్రయాసలకోర్చి రిజర్వేషన్ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామని చెప్పుకుంటున్న కులపెద్దలుగానీ, ముదిరాజుల సంక్షేమమే మాకు ముఖ్యమంటూ ప్రతి ఎన్నికల్లోనూ పునరుద్ఘాటిస్తున్న పార్టీలుగానీ, గడచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ముదిరాజుల మద్దతును పొందిన అధికార పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం గానీ, ఆ ప్రభుత్వం తరఫున స్పందించవలసిన బీసీ కమిషన్‌గానీ... ఇలా అందరూ నిమ్మకునీరెత్తినట్టే వ్యవహరించారు.
విచిత్రమేమిటంటే వెనకబడిన తరగతులలో అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న ముదిరాజు సామాజిక వర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెండుదఫాలుగా నియమించిన ‘బీసీ కమిషన్’లలో ఎవ్వరికీ చోటు దక్కలేదు. 2018 డిసెంబరులోగా నివేదికను సమర్పించాలంటూ సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికలను బేఖాతరుచేసి, 50 నెలలు అకారణంగా కాలయాపనకు పూనుకున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ కేసు వేయాలనే ఆలోచన కూడా చేయకపోవడం ముదిరాజ్ కులసంఘాల పనితీరుకు నిదర్శనం!
ఇదిలా ఉండగా, సుప్రీంకోర్జు తన తుదితీర్పు సందర్భంగా ప్రస్తావించిన అంశాలు, ఇచ్చిన ఆదేశాలు, చేసిన సూచనలు రెండు తెలుగు రాష్ట్రాల ముదిరాజ్ సామాజికవర్గ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు పన్నెండేళ్ళ క్రితం ముదిరాజులను బీసీ–ఏ గ్రూపులోకి మారుస్తూ జారీ చేసిన ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను నాటి హైకోర్టు కొట్టివేసిందో, తిరిగి అదే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన బీసీ కమిషనుకు ఈ సమస్య పరిష్కారాన్ని సూచించాలని సుప్రీంకోర్జు తన తుదితీర్పులో ఆదేశించింది. తుది పరిష్కారాన్ని సూచించే సందర్భంలో గతంలో తెరమీదికి వచ్చిన అభ్యంతరాలను, ఆలోచనలను, వాదలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని, వాటిమీద బహిరంగ చర్చలను నిర్వహించి అందరి అభిప్రాయాలను క్రోడీకరించాలని, ఈ క్రమంలో వెలువరించే పరిష్కారం మీద తలెత్తే అనుమానాలను, ప్రశ్నలను వ్యక్తం చేసేందుకు కూడా అవకాశాలుంటాయని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం తుదితీర్పులో వ్యాఖ్యానించింది. ఇక ముదిరాజుల ముందున్నది ఒకే మార్గం. రిజర్వేషన్ సమస్య పరిష్కారానికి వీలున్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, వాటిని సాధించుకునే దిశలో ఆచణాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవడం, ‘సమిష్టి ఆలోచన–ఉమ్మడి కార్యాచరణ’ పద్ధతిలో ఆ ప్రణాళికలను అమలుపరచగలిగే దీక్షాదక్షతలు కలిగి ఉన్న ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని నిర్మించుకోవడం... ఇదే ముదిరాజ్ సామాజిక ప్రజల లక్ష్యం కావాలి.
పిట్టల రవీందర్
‘ముదిరాజ్ అధ్యయన వేదిక’ వ్యవస్థాపకులు
Updated Date - 2022-11-03T03:55:32+05:30 IST