మేనమామ తల నరికి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు..

ABN , First Publish Date - 2022-05-14T20:57:56+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో దారుణం జరిగింది. కోపంలో సొంత మేనమామ తల నరికిన ఓ వ్యక్తి..

మేనమామ తల నరికి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు..

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో దారుణం జరిగింది. కోపంలో సొంత మేనమామ (60) తల నరికిన వ్యక్తి.. ఆ తలను, అందుకు ఉపయోగించిన పదునైన గొడ్డలిని తీసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కరిమతి గ్రామంలో శుక్రవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు లాల్‌బహదూర్‌ గౌడ్ శుక్రవారం తన మేనమామ మక్సూదన్ సింగ్ గౌడ్ ఇంటికి వెళ్లాడని, ఇద్దరి మధ్యా వాగ్వాదం చెలరేగిందని జమోదీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి శేషమణి మిశ్రా తెలిపారు. మాటామాటా పెరగడంతో లాల్‌బహదూర్ గౌడ్ ఒక గొడ్డలితో తన మేనమామ మెడపై వేటు వేశాడని, గొడ్డలిగా పదునుగా ఉండటంతో తల మొండెం నుంచి తెగిపడిందని చెప్పారు. దాడి అనంతరం తలను ఒక చేతిలో, గొడ్డలిని మరో చేతిలో తీసుకుని పోలీస్ స్టేషన్ వైపు నడిచి వెళ్తుండగా, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు మిశ్రా తెలిపారు.


కాగా, తన మేనమామ చేతబడి చేస్తూ తరచు తనకు సమస్యలు సృష్టించేవాడని, అలా చేయవద్దని తాను పలుమార్లు చెప్పినా వినేవాడు కాదని నిందితుడు తమ ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా గొడవ జరగడంతో తాను ఆగ్రహంతో తట్టుకోలేక దాడికి దిగినట్టు నిందితుడు అంగీకరించాడు.

Read more