ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

ABN , First Publish Date - 2022-05-14T08:26:19+05:30 IST

ఈ జాబితాలో ప్రభుత్వ రంగంలోని ఎస్‌బీఐతో పాటు మూడు భారతీయ బ్యాంకులకూ చోటు లభించింది.

ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

53వ స్థానాన్ని దక్కించుకున్న కంపెనీ 


న్యూఢిల్లీ: దేశీయ కార్పొరేట్‌ రంగంలో ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) హవా కొనసాగుతోంది. ఫోర్బ్స్‌ పత్రిక తాజా గా రూపొందించిన టాప్‌ గ్లోబల్‌-2000 కంపెనీల జాబితాలో ఆర్‌ఐఎల్‌కు 53వ స్థానం లభించింది. ఈ విషయంలో మరే భారతీయ కంపెనీ రిలయన్స్‌ దరిదాపుల్లోకి కూడా రాలేదు. గత  ఏడాదితో పోలిస్తే. రిలయన్స్‌ ఈ ఏడాది రెండు స్థానాలు ముందుకు వచ్చింది. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, ఆయా కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ ఆధారంగా ఫోర్బ్స్‌  ఏటా ఈ జాబితా రూపొందిస్తుంది. 


జాబితాలో నాలుగు బ్యాంకులు : ఈ జాబితాలో ప్రభుత్వ రంగంలోని ఎస్‌బీఐతో పాటు మూడు భారతీయ బ్యాంకులకూ చోటు లభించింది. ఇందులో ప్రభుత్వ రంగంలోని ఎస్‌బీఐ 105వ స్థానంతో అగ్రస్థానంలో ఉంది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 153, ఐసీఐసీఐ బ్యాంక్‌  204, యాక్సిస్‌ బ్యాంక్‌ 431వ స్థానాల్లో నిలిచాయి. 


అదానీ కంపెనీలకూ చోటు: పారిశ్రామిక రంగంలో  ముకేశ్‌ అంబానీతో పోటీపడుతున్న గౌతమ్‌ అదానీ గ్రూప్‌లోని ఐదు కంపెనీలకూ ఈ ఏడాది ఫోర్బ్స్‌  గ్లోబల్‌ -2000 జాబితాలో చోటు దొరికింది. గ్రూప్‌లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (1,453), అదానీ పోర్ట్స్‌ (1,568), అదానీ గ్రీన్‌ ఎనర్జీ (1,570), అదానీ ట్రాన్స్‌మిషన్‌ (1,705), అదానీ టోటల్‌ గ్యాస్‌ (1,746) వరుసగా ఈ జాబితాలో చేరాయి. అదానీ గ్రూప్‌ కంపెనీలకు ఈ జాబితాలో చోటు దొరకడం ఇదే మొదటిసారి.  


ఇతర కంపెనీలు: ఈ ఏడాది ఈ జాబితాలో భారతీయ కంపెనీల్లో ఇంధన, బ్యాంకింగ్‌ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ తర్వాత ఓఎన్‌జీసీ  (228), హెచ్‌డీఎ్‌ఫసీ (268), ఐఓసీ (377), టీసీఎస్‌ (384), టాటా స్టీల్‌ (407) ముందున్నాయి. 

Read more