-
-
Home » Andhra Pradesh » YS Jagan Mohan Reddy government Farmers-NGTS-AndhraPradesh
-
రైతులను పిండండి
ABN , First Publish Date - 2022-05-09T08:16:01+05:30 IST
కరువు కాటకాలు, వరదలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని..

‘నీటి తీరువా’ టార్గెట్ 943 కోట్లు.. మూడేళ్ల బకాయిలు కట్టాల్సిందే
రైతులకు డిమాండ్ నోటీసులు
వీఆర్వోలకు గ్రామాల్లో టార్గెట్లు
కట్టనివారికి పౌర సేవలు బంద్
పాత బకాయిలపైనా 6% వడ్డీ
నీటి సరఫరా లేనిచోటా బిల్లులు
ఆందోళనలో రైతాంగం
కరువు కాటకాలు, వరదలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని రైతుల నుంచి నీటితీరువా వసూళ్లకు గత ప్రభుత్వాలు గట్టిగా ఒత్తిడి చేయలేదు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పడిన జగన్ ప్రభుత్వం.. సందు దొరికితేచాలు జనాన్ని పిండేస్తోంది. నీటితీరువా బకాయిలపై ఇప్పుడు కన్నేసింది. మొత్తం రూ. 943 కోట్లు వసూలు చేయాలంటూ రెవెన్యూ శాఖకు టార్గెట్ పెట్టి రంగంలోకి దిగింది. మూడేళ్ల బకాయిలు కట్టాలంటూ రైతులకు నోటీసులిస్తూ... కట్టనివారికి గ్రామాల్లో పౌర సేవలు నిలిపివేస్తోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): పౌరసేవలకు, పన్నుల చెల్లింపులకు మధ్య జగన్ ప్రభుత్వం లింకు పెడుతోంది. ఎన్నడూలేనిది నీటితీరువాకోసం పట్టుబడుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పొలం పనుల్లో ఉన్న రైతులను వెతికి వెతికి డిమాండ్‌నోటీసులు అందిస్తున్నారు. కాలువలు ఉండి, అందులో నీరు పారకపోయినా నీటితీరువా చెల్లించాల్సిందేనని రెవెన్యూశాఖ ఒత్తిళ్లు తీసుకొస్తోంది. అంతేకాదు, ధ్వంసమైన కాలువల పరిధిలోని రైతులకు సైతం నీటితీరువా చెల్లింపు డిమాండ్ నోటీసులు జారీ చేస్తోంది. మూడేళ్ల బకాయిలు కలిపి రూ.943 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో పన్ను సిద్ధాంతం గట్టిగా అమలుచేస్తోంది. దీంతో రెవెన్యూ అధికారుల తీరు రైతులను బెంబేలెత్తిస్తోంది. కాలువలు, నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల ద్వారా సాగునీరు అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నీటిపన్ను వసూలు చట్టం-1988 ప్రకారం రెవెన్యూశాఖ ఏటే టా నీటితీరువా వసూలు చేసి ఆ నిధులను నీటిపారుదల శాఖ ఖాతాలో వేయాలి. రైతుల ఆర్థిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులతో దెబ్బతింటున్న పంటల దిగుబడిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు ఈ పన్ను వసూళ్లకు ఒత్తిడి తీసుకురాలేదు. పౌరసేవలు, ఇతర ప్రభుత్వ సేవలకు పన్నుల చెల్లింపును తప్పనిసరి చేయలేదు. దీంతో కొన్నేళ్లుగా నీటితీరువా బకాయిలు రూ.వేల కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. పెద్ద రైతులు, స్తోమత కలిగినవారు పన్నులు చెల్లిస్తున్నారు. పేద రైతులు, కౌలు రైతులు, కాలువలు ఉన్నా నీరే పారని ప్రాంతాల అన్నదాతలు పన్నులు చెల్లించడం లేదు.
పేర్లు షార్ట్‌లిస్టు..నోటీసులు
అప్పుల తప్పులతో ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన జగన్ సర్కారు.. నీటితీరువా బకాయిలపై దృష్టిపెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో గత మూడేళ్లలో నీటితీరువా వసూళ్ల లక్ష్యం రూ.1347కోట్లు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన 2019-20 లో నీటితీరువా టార్గెట్ 380 కోట్లు. 2020-21లో 447 కోట్ల రూపాయలు. 2021-22 సంవత్సరంలో 520 కోట్లు. మొత్తం 1347 కోట్లు. రెవెన్యూశాఖ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన ఓ ప్రజంటేషన్ ప్రకారం 30 శాతం నీటితీరువా మాత్రమే వసూలైంది. ఇంకా 943 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ఈ వసూళ్ల కోసం గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులను రైతులపై ప్రయోగిస్తున్నారు. ఏ రైతు నీటితీరువా బకాయిలు ఉన్నది తె లుసుకునేందుకు వెబ్‌ల్యాండ్‌లోనే ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఈ-పంట యాప్ ద్వారా నీటితీరువా వసూళ్ల కోసం ‘డిమాండ్- కలెక్షన్ బ్యాలెన్స్(డీసీబీ)’ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారు. ఈ సాప్ట్‌వేర్‌ను వెబ్‌ల్యాండ్‌లో ఉన్న రైతుల డేటాకు అనుసంధానం చేశారు. బకాయిలున్న ప్రతి రైతు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా నోటీసులు పంపిస్తున్నారు. నీటిపన్నును గట్టిగా రాబట్టుకునేందుకు గతేడాది డిసెంబరులోనే రెవెన్యూశాఖ ఓ సర్క్యులర్ ఇచ్చింది. ఫిబ్రవరి నాటికే బకాయిలు వసూలు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. అసలుతోపాటు పాత బకాయిలపైనా ఆరుశాతం వడ్డీ కలిపి పన్ను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూశాఖ ఆదేశించింది. అయితే, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్పెషల్‌డ్రైవ్ చేపట్టింది. బకాయిలున్న రైతుల పేర్లను షార్ట్‌లిస్టు చేసి వారికి మరోసారి డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో రెవెన్యూ అధికారులు నేరుగా పొలాల దగ్గరికెళ్లి డిమాండ్ నోటీసులు ఇచ్చారు. ఇదే విషయాన్ని ఈ-పంట (ఈ-క్రాప్) అమలుకు సంబంధించిన నివేదికల్లో పొందుపరిచారు. ‘‘రైతు ఎక్కడ ఉంటే అక్కడికెళ్లి డిమాండ్ నోటీసులు ఇస్తున్నాం. బకాయిల వసూళ్లకు పనిచేస్తున్నామ’’ని నివేదికల్లో పేర్కొన్నారు.
రోడ్డెక్కుతున్న రైతులు..
రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి నీటితీరువా చెల్లించే విధానం తీసుకువచ్చే ఆలోచన చేసినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో పౌరసేవలతో ముడిపెట్టినట్లు తెలిసింది. పాస్‌బుక్, ఎఫ్‌లైన్ పిటిషన్, ఎఫ్‌ఎమ్‌బీ, ఇతర పౌరసేవలకు రైతులు మీ సేవ, గ్రామ సచివాలయాలకు వెళ్లినప్పుడు నీటితీరువా పెండింగ్ ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ ముందు ఆ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. తమను ఇబ్బందిపెడుతున్నారంటూ గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. పాస్‌బుక్‌లకు నీటితీరువాకు ముడిపెట్టి పనులు ఆపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇది ఒకటిరెండు జిల్లాలకు పరిమితం కాలేదని తర్వాత తెలిసింది. నీటి తీరువాను ఎలాగైనా వసూలు చేయాలన్న లక్ష్యంలో భాగంగానే ఇలా చేస్తున్నారన్న విషయం బయటకొచ్చింది.
చుక్కనీరు రాకున్నా నోటీసులు
ప్రకాశం జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ కుడికాలువ చివరి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కాలువలు ఉన్నా వాటిలో నీళ్లుపారడం లేదు. చాలా ప్రాంతాల్లో కాలువలు ధ్వంసమయ్యాయి. అయినా వాటి పరిధిలోని రైతులకు నీటితీరువా చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ పరిణామం రైతులను కలవరానికి గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా చుక్కనీరు పంటలకు అందకున్నా ఇప్పుడు నీటితీరువా చెల్లించాలనడం అన్యాయం అని రైతులు వాపోతున్నారు.