జీతమేది... జగనన్నా!
ABN, First Publish Date - 2022-05-14T06:09:44+05:30
విద్యుత్ ఉద్యోగులంటే బ్యాంకులు పిలిచి రుణా లిచ్చేవి.
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
రెండు నెలలనుంచి తారుమారైన బడ్జెట్
ధర్నాలకు దిగుతున్న ఉద్యోగులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
విద్యుత్ ఉద్యోగులంటే బ్యాంకులు పిలిచి రుణా లిచ్చేవి. రెండు నెలల నుంచి వాయిదాలు చెల్లించ లేకపోతున్నాం.డిఫాల్టర్లుగా నిలబడ్డాం. అదనపు చార్జీలంటూ ఒక్కో వాయిదాకు రూ.1000 వసూలు చేశారు. ప్రభుత్వం జీతం చెల్లించకపోవడంతో వాయిదాలు కట్టలేని పరిస్థితి ఏర్పడింది.
– ఇది ఓ విద్యుత్ అధికారి ఆవేదన.
మార్చి నెలలో డిస్కమ్‌లకు బకాయిలు చెల్లిం చారు. ప్రజల నుంచి వచ్చిన ఆదాయమంతా అటు మళ్లించారు. ఆ నెల వేతనం ఆలస్యమైందంటే అర్థం ఉంది. ఏప్రిల్ నెల వేతనం ఎందుకివ్వలేదు. మాపై ఎందుకు వివక్ష చూపుతున్నారు.
– ఇది మరో విద్యుత్ ఉద్యోగి ఆవేదన.
భీమవరం సబ్ డివిజన్ పరిఽధిలో ఒక విద్యుత్ ఉద్యోగి తన పిల్లల చదువు కోసం బ్యాంకు రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా ఐదో తేదీన రూ.10వేలు వంతున వాయిదా చెల్లిస్తూ వస్తున్నాడు. జీతం పడే బ్యాంకు ఖాతా నుంచే వాయిదా మినహాయింపు అవుతుంది. రెండు నెలల నుంచి గాడి తప్పింది. అదనపు చార్జీలు చెల్లించాలంటూ నోటీసు వచ్చింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు సబ్ డివిజన్లలో సుమారు రెండు వేల మంది విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వేతనాలు సకాలంలో అందకపోవ డం ఉద్యోగులకు ఇది తొలి అనుభవం. ఎప్పుడైనా ఇతర ప్రభుత్వ శాఖలకు వేతనాలు మంజూరులో జాప్యం జరిగేది. విద్యుత్ ఉద్యోగులకు మాత్రం కచ్చితంగా వేతనం అందేది. ప్రతి నెలా ఒకటి లేదా రెండో తేదీలో వేతనం వచ్చి పడేది. గడిచిన రెండు నెలల నుంచి వేతన మంజూరులో తారుమారు అయింది. ప్రభుత్వ ఖజానా లోటు కావడంతో ఆ ప్రభావం విద్యుత్ ఉద్యోగులపై పడింది.
టాన్స్‌కో ఆదాయం మళ్లింపు
వాస్తవానికి ట్రాన్స్‌కోను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చార్జీలు పెంచుతూ వస్తోంది. ట్రూఆప్ చార్జీలంటూ రెండు నెలలపాటు అదనపు చార్జీల ను వసూలు చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలకు బకాయిలు పడడంతో మార్చిలో ట్రాన్స్‌కో ఆదాయమంతా అటువైపు మళ్లించారు. దాంతో ఏప్రిలో ఒకటో తేదీన చెల్లించాల్సిన వేతనం పడలేదు. సుమారు రెండు వారాలపాటు జాప్యం జరిగింది. మరుసటి నెలకు అంతా సర్దుకుం టుందని భావించారు. కానీ ఏప్రిల్ వేతనం ఇప్పటికీ అందలేదు. రెండు వారా లు గడచి పోతున్నాయి. ప్రభుత్వం జీతం ఊసెత్తడం లేదు. వేతనం ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామంటూ విద్యుత్ జేఏసీ ప్రకటించింది. సబ్ డివిజన్ల పరిధిలో ధర్నాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. వేతనం కోసం ఇంకెన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందోనంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వేతనం ఆలస్యం కావడంతో నెల బడ్జెట్ అంతా తారుమారైం దంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.