-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari drc meeting-NGTS-AndhraPradesh
-
గరం..గరం
ABN , First Publish Date - 2022-05-14T06:16:41+05:30 IST
జిల్లాలో రహదారుల అథోగతిపై ఆర్అండ్బీ అధికారులపై ప్రశ్నల పరంపర..
వాడి.. వేడిగా డీఆర్సీ సమావేశం
సమస్యలపై అధికార పక్ష సభ్యుల ఏకరవు
మంత్రి కారుమూరి వర్సెస్ చెరుకువాడ
అన్నింటికి ఆర్థిక అంశాలతోనే ముడి
రోడ్ల మంత్రికి.. గతుకుల రోడ్లపై రావాలని రంగనాథరాజు ఆహ్వానం
భీమవరం, మే 13 : జిల్లాలో రహదారుల అథోగతిపై ఆర్అండ్బీ అధికారులపై ప్రశ్నల పరంపర.. జిల్లా ఇన్చార్జి మంత్రి దాడిశెట్టి రాజాను భీమవరం–గూడెం రోడ్డులో తీసుకురావాలంటూ మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సెటైర్లు.. అసాని తుఫాన్ వల్ల దెబ్బతిన్న ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సమస్యపై అధికారపక్షం సభ్యులే ఏకరువు పెట్టిన పరిస్థితి.. జగనన్న ఇళ్ల నిర్మాణం, స్థలాల పూడికలు, నూతన కలెక్టరేట్‌కు భూసేకరణ వంటి అంశాలపై చర్చ.. కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదని అధికారుల వివరణలు.. మధురాన్నంపై ఆరోపణలు సరికాదని మాజీ మంత్రి రంగరాజు వ్యాఖ్యలతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా తొలి డీఆర్సీ సమావేశం వాడివేడిగా సాగింది. జిల్లా ఇన్ చార్జి మంత్రి దాడిశెట్టి రాజా, మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్‌తో పాటు అధికార పక్షం పూర్తిగా హాజరు కాగా ప్రతిపక్షం నుంచి ఉండి ఎమ్మెల్యే రామరాజు మాత్రమే పాల్గొన్నారు.
2వేల ఎకరాలలోపే వరికి నష్టం..
సమావేశం ప్రారంభంలో ఆసాని తుఫాన్ నష్టంపై అధికారులను మంత్రులు ప్రజా ప్రతినిధులు ప్రశ్నించగా వర్షాలతో వరి పంటకు అంతగా నష్టం సంభవించలేదని, రెండు వేల ఎకరాలలోపే నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలి పారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ తడిచిన ధాన్యాన్ని కొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ 1,12,044 ఎకరాల్లో వరి పంట మీద ఉందని, సుమారు 200 ఎకరాల్లో పనలు, 354 ఎకరా ల్లో వరి కుప్పలు తడిశాయన్నారు. 33 శాతం నష్టం దాటితేనే నష్టపరిహారం ప్రతిపాదన పంపాలన్నారు. ‘తడిచిన ధాన్యాన్ని యఽథావిధిగా కొనుగోలు చేయాలి. మొన్న పంట కాలంలో రూ.వంద తగ్గించారు. ఈసారి అలా చేయొద్దు’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సూచించగా పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ గణనాథ మాట్లాడుతూ ఈ పం టకు 7.83 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ఇంత వరకు 4.20 లక్షలు పూర్తయిందన్నారు. ధాన్యాన్ని రైతుల నుంచి రైస్ మిల్లులు కొనుగోలు అవకాశం లేదా అని ఉండి ఎమ్మెల్యే రామరాజు ప్రస్తావించగా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వివరణ ఇస్తూ క్లస్టర్ల ప్రకారం మాత్రమే ధాన్యాన్ని కొంటున్నారని, ధాన్యం అమ్మిన రైతులకు కిరాయి రూ.1480 చెల్లిస్తుంటే రూ.1450 మాత్రమే రైతులకు చేరుతోందని, ఈ కమిషన్ సమస్యపై దృష్టి పెట్టాలని సమావేశం దృష్టికి తెచ్చారు.
అధ్వాన రోడ్లపై వాడి వేడి చర్చ..
జిల్లాలో రహదారుల దారుణ పరిస్థితులు.. వాటి అభి వృద్ధి, ప్రతిపాదనల పెండింగ్, నిధులు మంజూరు.. బిల్లుల పెండింగ్‌పై సమావేశంలో కాస్త వాడివేడి చర్చ సాగింది. ఆర్అండ్బీ ఎస్ఈని రోడ్ల ప్రతిపాదనలపై ప్రజా ప్రతినిధు లు ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ గతంలో మంజూరైన రూ.32 కోట్లు బ్యాంకు రుణ నిధులతో చేపట్టిన పనులు 75 శాతం పూర్తయ్యాయన్నారు. మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు, భీమవరం, ఉండి ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, మంతెన రామరాజు తమ ప్రాంతంలో గతంలో ప్రతిపాదన చేసిన రహదారులు పెండింగ్ గురించి ప్రశ్నించారు.
రోడ్లు కోసం కొత్తగా ప్రతిపాదనలు చేసిన ఏలూరు డివిజన్లో రూ.86 కోట్లు, కొవ్వూరు డివిజన్‌కి రూ.80 కోట్లు చేస్తే భీమవరానికి రూ.40 కోట్లు ప్రతిపాదన ఎలా చేశారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు. చాలా రోడ్లు కేంద్రం పైకి నెట్టివేస్తున్నారన్నారు. భీమవరం – తాడేరు వంతెన ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని అసహనం వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డుకు కోటి రూపాయలు మంజూరయ్యాయని పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించా రు. ఎస్ఈ బదులిస్తూ నిడా ఫేజ్–2లో ప్రతిపాదించామని, మళ్లీ టెండర్లు పిలుస్తామ న్నారు. జిల్లాకు నిడాలో రూ.180 కోట్లు ప్రతిపాదనలు చేశామని ముందు వంతెనలకు రూ.50కోట్లు వస్తాయన్నారు.
పాలకొల్లు రహదారి ఆక్రమణలతో దారుణంగా ఉందని, ట్రాఫిక్‌లో వెళ్లలేక తాను ఇటీవల ప్రయాణం మానుకున్నానంటూ శ్రీరంగనాథరాజు అధికారుల దృష్టికి తెచ్చారు. ఆక్రమణలు తొలగిస్తామని కలెక్టర్ వివరణ ఇచ్చారు.
ఉండి, నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం నియోజకవర్గాల్లో పలు రోడ్లు దారుణంగా ఉండడం, పెండింగ్ లో ఉండడాన్ని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆర్అండ్బీ అధికారులు వివరణ ఇస్తూ ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లను ఫాలో చేస్తున్నామని, ఎస్ఎస్ఆర్ రేట్లు కూడా పెరిగాయని కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మంత్రి దాడిశెట్టి వివరణ ఇస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రిగారు మా ఊరి రోడ్డులో ఒకసారి రండి..
ఆర్అండ్బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా భీమవరం – తాడేపల్లిగూడెం రోడ్డు మీదుగా రావాలి.. దారిలో మా ఊరు యండగండి ఉంది చూడండి..! అంటూ రోడ్ల పరి స్థితిపై మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సెటైర్ వేశారు. ఎన్‌హెచ్ 165 నుంచి ఎన్‌హెచ్ 16 వరకు 35.4 కి.మీ. ఉన్న ఈ రోడ్డు జాతీయ రహదారి చేయాలని ప్రతిపాదన చేశాం. రెండువైపులా కాల్వలు ఉన్నాయని భూమి సరిపోదని తిరస్కరించారు. ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్న ఫైలు కదిలించండి.. అంటూ మంత్రిని కోరారు. దీనికి మంత్రి దాడిశెట్టి స్పంది స్తూ కృష్ణబాబుతో మాట్లాడి ఫాలోఅప్ చేస్తామన్నారు.
మధురాన్నం వద్దంటే ఆపేస్తాం..
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో కొన్ని లోపాల గురించి సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కొంత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం సరిగా అందలేదని ప్రస్తావన తెచ్చినప్పుడు ‘మేడమ్ మధురాన్నం పథకం నేను నిర్వహిస్తున్నా.. ఎటువంటి ప్రాఫిట్ లేకుండా ఇస్తున్నాం.. పంపిణీ వద్దంటే ఆపేస్తాం.. కరోనా సమయంలో 5లక్షల మందికి భోజనాలు పెట్టాం.. మీకు కూడా తెలుసు.. గుం టూరు హాస్పిటల్లో ఉచిత భోజనం పెట్టాం.’.. అంటూ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమస్య ఉంటే చెప్పాలి కానీ.. నేరుగా ఫిర్యాదు చేయడం తగదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
పెనుగొండ ఎస్ఈబీ సీఐను సస్పెండ్ చేయండి
పెనుగొండ ఎస్ఈబీ సీఐగా విధులు నిర్వహిస్తున్న సుధ వైఖరిపై మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ రైతులు 50 కేజీల ఇసుక తీసు కెళ్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని, కనీసం ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మైనింగ్ కేసులు ఆమెకు ఎందుకని? ఎస్పీ రవిప్రకాష్‌ను ప్రశ్నించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు మాట్లా డుతూ ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు.
తణుకులో నాడు–నేడు పథకంలో బాత్రూమ్ లెట్రిన్లను శుభ్రంగా నిర్మించినప్పటికీ అక్కడ మిగిలిన మెటీరియల్‌ను ఫొటో తీసి ఒక పత్రిక అబద్ధపు వార్త రాసిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ఏ పాఠశాలలో అయినా ఇటువంటి మెటీరియల్ ఉండకూడదని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.
జిల్లా కార్యాలయాల నూతన భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణపై చర్చించారు. భీమవరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని 16 ఎకరాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు బదిలీ చేసి, ఇక్కడ శాశ్వత భవనా లు నిర్మించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచించారు. ఉండి కేవీకేలో ఉన్న 70 ఎకరాల స్థలాన్ని వినియోగించుకునే అంశంపై చర్చకు వ చ్చింది. భీమవరంలో స్థలాన్ని చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
జిల్లాలో పలుచోట్ల తాగునీటి సమస్య ఉందని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. సమస్య ఉన్న ప్రాంతాలను సందర్శించి చర్యలు తీసుకో వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

