-
-
Home » Andhra Pradesh » West Godavari » tenth spot valuations teachers absent at eluru dist-NGTS-AndhraPradesh
-
టెన్త్ స్పాట్‌కు టీచర్ల డుమ్మా
ABN , First Publish Date - 2022-05-14T06:12:20+05:30 IST
పది మూల్యాంకన విధులకు తుదిగా నియమితులైన టీచర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. విధులకు గైర్హాజరైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మినహాయింపుల కోసం పడిగాపులు
డీఈవో వ్యాఖ్యలపై దుమారం
ఏలూరు ఎడ్యుకేషన్, మే 13 : పది మూల్యాంకన విధులకు తుదిగా నియమితులైన టీచర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. విధులకు గైర్హాజరైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ డొల్లేనని శుక్రవారం నుంచి ఏలూరు సెయింట్ ఽగ్జేవియర్ హైస్కూలులో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో తలెత్తిన వివాదమే ఓ నిదర్శనం. స్పాట్ విధుల నుంచి తమ సంఘాలకు చెందిన టీచర్లకు మినహాయింపులు ఇవ్వాలంటూ పలు ఉపాద్యాయ సంఘాలు భారీ అభ్యర్థనలతో డీఈవోను కోరారు. ఈ క్రమంలో కొన్ని సంఘాలకే ఆమె ప్రాధాన్యత ఇచ్చి, మరికొందరికి మినహాయింపులు ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. వాస్తవానికి ఉదయం 9 గంటలకే మూల్యాంకన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, మధ్యాహ్నం రెండు గంటలకు కూడా పలువురు టీచర్లు స్పాట్ కేంద్రంలో రిపోర్టు చేయలేదు. నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులు, వైకల్యం, అధిక వయసు తదితర కారణాలపై ఇప్పటికే వందల సంఖ్యలో ఉపాధ్యాయులు మినహాయింపు పొందారు. మళ్లీ మినహాయింపుల కోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఆశ్రయించడంతో విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఈ క్రమంలో మినహాయింపుల కోసం వేచి వున్న టీచర్లను అగౌరవ పరిచేలా డీఈవో వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ ఆర్‌టీఎఫ్ నాయకులు సుధీర్, స్టీఫెన్ తదితరులు ఆరోపించారు. దీంతో తొలిరోజునే స్పాట్ కేంద్రంలో ఒకింత ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. దీనిపై డీఈవో గంగాభవాని మాట్లాడుతూ విధులకు నియమితులైన టీచర్లను హాజరు కావాల్సిందిగా మాత్రమే కోరామన్నారు. ఎవరినీ కించపరచలేదని వివరించారు.
షోకాజ్ నోటీసులు ఇస్తాం : డీఈవో
తెలుగు సబ్జెక్టుతోపాటు, స్పెషల్ అసిస్టెంట్లుగా స్పాట్ విధులకు నియమితులైన టీచర్లలో పలువురు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గైర్హాజరయ్యారు. దీంతో వీరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. లోటు ఏర్ప డిన మేరకు కొత్తగా సిబ్బందిని నియమించేందుకు ఆర్డర్లు పంపారు. తొలిరోజు చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 1,400 మందికి గాను 1342 మంది హాజరు కాగా 53 మంది గైర్హాజరయ్యారు. స్పెషల్ అసిస్టెంట్లు 290 మందికి 207 మంది హాజరు కాగా 83 మంది గైర్హా జరైనట్టు గుర్తించారు. మినహాయింపుల కోసం శుక్రవా రం రాత్రి తొమ్మిది తర్వాత కూడా పలువురు టీచర్లు స్పాట్ కేంద్రం బయటవేచి ఉన్నారు. వివిధ సబ్జెక్టుల్లో అదనంగా నియమితులైన టీచర్లకు రిలీవింగ్ ఆర్డర్లు ఇచ్చి పంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి స్పాట్ క్యాంపు పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు అదికారులు ప్రయత్నిస్తున్నారు.

