అర్హులైనా.. అందని సబ్సిడీ

ABN , First Publish Date - 2022-05-14T06:46:45+05:30 IST

ప్రభుత్వం కల్పిస్తున్న విద్యుత్‌ ఛార్జీల రాయితీలు పొందేందుకు ముదినేపల్లి మండల ఆక్వా రైతులకు ఎన్నో నిబంధనలు అడ్డొస్తున్నాయి.

అర్హులైనా.. అందని సబ్సిడీ
రొయ్యల చెరువు

నిబంధనల పేరుతో  మంగళం

విద్యుత్‌ రాయితీకి ఆక్వా జోన్‌ అడ్డంకి..

నష్టపోతున్న 1500 మంది రైతులు?

ముదినేపల్లి, మే 13 : ప్రభుత్వం కల్పిస్తున్న విద్యుత్‌ ఛార్జీల రాయితీలు పొందేందుకు ముదినేపల్లి మండల ఆక్వా రైతులకు ఎన్నో నిబంధనలు అడ్డొస్తున్నాయి. ఈ రాయితీ ఆక్వా రైతులకు నామమాత్రంగానే అందుతు న్నది. అయిదెకరాల లోపు చెరువు విస్తీర్ణం కలిగి ఉన్నా ఆక్వా జోన్‌ నిబంధన అడ్డు వస్తున్నది. ఈ రాయితీ పొందాలనుకుంటున్న రైతుల చెరువులు ఆక్వా జోన్‌లో నమోదై ఉండాలన్న నిబంధన నిరాశ కలిగిస్తున్నది. ముదినేపల్లి మండలంలోని అత్యధిక శాతం చెరువులు ఆక్వా జోన్‌లో లేవు. మండలంలో సుమారు 800 ఎకరాలకు సంబంధించిన 160 మంది ఆక్వా రైతులు మాత్రమే ప్రస్తుతం విద్యుత్‌ ఛార్జీల్లో రాయితీ పొందుతున్నారు. ఆక్వా జోన్‌ పరిధిలో ఉన్న సర్వే నంబర్లకు మాత్రమే విద్యుత్‌ రాయితీ వర్తిస్తుందన్న నిబంధన వల్ల మండలంలో సుమారు 1500 మంది అయిదెకరాల లోపు ఉన్న రైతులు నష్టపోతున్నట్టు తెలిసింది. గతంలో మత్స్యశాఖ అధికారులు చేపల చెరువు తవ్వకానికి అనుమతి ఇచ్చిన సర్వే నెంబర్లను ఆక్వా జోన్‌లో చేర్చారు. మూడేళ్లుగా మండలంలో చెరువుల తవ్వకానికి వేలాది ఎకరాలకు అనుమతి ఇచ్చినా ఆక్వా జోన్‌ పరిధిలోకి రాలేదు. దీంతో యూనిట్‌కు 1.50 రూపాయల విద్యుత్‌ ఛార్జీ సదుపాయాన్ని వందలాది మంది రైతులు పొందలేకపోతున్నారు.


ఆక్వాజోన్‌గా గుర్తించాలి 

చేపలు, రొయ్యల సాగు జరుగుతున్న ప్రాంతాలన్నిం టినీ మత్స్యశాఖ ఆక్వా జోన్‌గా గుర్తించాలి. అందులో అర్హులైన రైతులకు విద్యుత్‌ రాయితీ కల్పించాలి.

– బొప్పన సుందరరామయ్య,  తెలుగు రైతు నేత, ములకలపల్లి

 

రాయితీ అర్హత పెంచాలి 

విద్యుత్‌ రాయితీ పొందే ఆక్వా రైతులకు అర్హతను అయిదెకరాల నుంచి పది ఎకరాలకు పెంచాలి. లేకుంటే రాయితీ చిన్న, సన్నకారు రైతులందరికీ అందదు. 

–బాసినశెట్టి కిషోర్‌, ఆక్వా రైతు, బొమ్మినంపాడు


మత్స్యశాఖ గుర్తింపు తప్పనిసరి

ఆక్వా రైతులు విద్యుత్‌ ఛార్జీల్లో రాయితీ పొం దాలంటే మత్స్యశాఖ అధికారులు గుర్తించిన ఆక్వా జోన్‌ పరిధిలో ఉండాలి. ఈ జోన్‌లో లేని సర్వే నంబర్లకు రాయితీ వర్తించదు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలి.

–రవికుమార్‌,  ఏఈ, విద్యుత్‌ శాఖ


Read more