ఇంకెన్నాళ్లు?

ABN , First Publish Date - 2022-05-15T05:16:26+05:30 IST

స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఐటీడీఏ పరిధిలో నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2017 నుంచి నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయ భర్తీకి అవరోధం ఏర్పడింది.

ఇంకెన్నాళ్లు?


 స్పెషల్‌ డీఎస్సీ కోసం ఎదురుచూపు
2017 నుంచి విడుదల కాని నోటిఫికేషన్‌
ఐటీడీఏ పరిధిలో భర్తీ కాని ఉపాధ్యాయ పోస్టులు
ప్రభుత్వం స్పందించాలని విన్నపం

(సీతంపేట )


స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఐటీడీఏ పరిధిలో నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు.  2017 నుంచి నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయ భర్తీకి అవరోధం ఏర్పడింది. దీంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ, జీపీఎస్‌ పాఠశాలలను ఉపాధ్యా యుల కొరత వేధిస్తోంది. ఆ ప్రభావం పిల్లల చదువులపై పడుతోంది. మొత్తంగా ఆశ్రమ పాఠశాలల్లో 55, జీపీఎస్‌ పాఠశాలల్లో 105 ఉపాధ్యాయ పోస్టులతో పాటు స్పెషల్‌ డీఎస్సీ ఏజెన్సీ పరిధిలో 16 మండలాల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.  అసలు  ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక స్పెషల్‌ డీఎస్పీ ద్వారా  పీజీహెచ్‌ఎంలు ఆరు, మేథ్స్‌ 28, సైన్స్‌ 41, ఇంగ్లిష్‌ 18, ఎస్‌ఎస్‌ 14, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు ఆరు, ఫిజికల్‌ డైరెక్టర్లు ఏడు, ఎల్‌పీ తెలుగు 14, ఎల్‌పీ హిందీ 14, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు నాలుగు, ఎస్‌ఏ హిందీ ఏడు, క్రాఫ్ట్‌ టీచర్‌ చొప్పున ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒప్పంద ఉపాధ్యాయ (సీఆర్‌టీ)ల ద్వారా భర్తీ చేస్తూ ఉపాధ్యాయ లోటును తీర్చాల్సిన పరిస్థితి నెలకొంది.   21 బ్యాక్‌లాగ్‌ నాలుగో తరగతి సిబ్బందిని కూడా  భర్తీ  చేయడం లేదు.  ప్రభుత్వం ఖాళీల నివేదిక కోరుతున్నప్పటికీ దీనికి సంబంధించి నియామకాలు లేకపోవడం, పదోన్నతులు పొందలేని పరిస్థితి నెలకొనడంతో సిబ్బందిలో కొంత అసహనం వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.  ఈ అంశంపై  ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.కమల మాట్లాడుతూ..  స్పెషల్‌ డీఎస్సీకి సంబంధించి ఖాళీల జాబితా ఇప్పటికే ప్రభుత్వానికి అందించామని తెలిపారు.  

 


Read more