10 మండలాలకు ఇన్‌చార్జిలే దిక్కు
ABN, First Publish Date - 2022-05-15T05:09:50+05:30
గ్రామాల అభివృద్ధిలో ఎంపీడీవోలదే కీలక పాత్ర. అయితే జిల్లాలో ఈ పోస్టుల కొరత తీవ్రంగా ఉంది. 15 మండలాల్లో పది మండలాలకు ఇన్‌చార్జి అధికారులే ఉన్నారు. ఐదు మండలాలకే రెగ్యులర్ ఎంపీడీవోలు ఉన్నారు.
ఐదు మండలాలకే రెగ్యులర్ అధికారులు
జిల్లాను వేధిస్తున్న ఎంపీడీవోల కొరత
పెరుగుతున్న రాజకీయ జోక్యం
(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)
గ్రామాల అభివృద్ధిలో ఎంపీడీవోలదే కీలక పాత్ర. అయితే జిల్లాలో ఈ పోస్టుల కొరత తీవ్రంగా ఉంది. 15 మండలాల్లో పది మండలాలకు ఇన్‌చార్జి అధికారులే ఉన్నారు. ఐదు మండలాలకే రెగ్యులర్ ఎంపీడీవోలు ఉన్నారు. ఉన్నతాధికారులు ఒక్కో ఎంపీడీవోకు రెండు మండలాల బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు రాజకీయ జోక్యం మితిమీరడంతో పల్లెల ప్రగతి ఆశించిన స్థాయిలో కానరావడం లేదు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాలు ఉన్నాయి. మూడు మండలాల్లో రెగ్యులర్ ఎంపీడీవో ఒకరు కూడా లేరు. పార్వతీపురం ఇన్‌చార్జి ఎంపీడీవోగా సూరిబాబు వ్యవహ రిస్తున్నారు. పార్వతీపురం మండల పరిషత్ పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తూ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. బలిజిపేట మండల పరిపాలనాధికారిగా త్రినాథరావు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ రెగ్యులర్ ఏవోగా ఉన్న పార్వతిని సాలూరుకు డిప్యుటేషన్ వేసి అక్కడ ఎంపీడీవోగా నియమించారు. పార్వతి స్థానంలో మొరకముడిదాం (విజయనగరం జిల్లా)లో రెగ్యులర్ ఏవోగా విధులు నిర్వహిస్తున్న త్రినాథరావును బలిజిపేట మండలం ఏవోగా డిప్యూటేషన్‌పై వేశారు. ఆయనకు బలిజిపేట మండల పరిషత్‌కు ఇన్‌చార్జి ఎంపీడీవోగా, సీతానగరం ఎంపీడీవోగా బాధ్యతలను అప్పగించారు. పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ లేరు. సీనియర్ అసిస్టెంట్‌గా నియామకమైన శ్రీనివాసరావు గజపతినగరం పంచాయతీరాజ్ విభాగం సబ్ డివిజన్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు.
సాలూరులో..
సాలూరు ఎంపీడీవోగా పార్వతి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పార్వతీపురం నియోజకవర్గంలోని బలిజిపేట మండల పరిషత్ రెగ్యులర్ పరిపాలన అధికారి. అయితే గతంలో బలిజిపేట ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తూనే పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం ఎంపీడీవోగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సాలూరు ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. సాలూరు రెగ్యులర్ ఎంపీడీవోగా నియామకమైన శివరామప్ప ప్రస్తుతం కురుపాం ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఉన్నారు. మక్కువ మండలం ఎంపీడీవోగా ఈవోపీఆర్‌డీ సూర్యనారాయణ ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఉన్నారు. పాచిపెంట మండల పరిషత్ అధికారిగా రాధాకృష్ణ ఇన్‌చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
కురుపాంలో...
కురుపాం నియోజకవర్గంలో కొమరాడ ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఏవో రమేష్ ఉన్నారు. ఇన్‌చార్జి ఎంపీడీవోతో పాటు ఇన్‌చార్జి ఈవోపీఆర్‌డీగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరాడ రెగ్యులర్ ఈవోపీఆర్‌డీగా ఉన్న గోపాలరావును గరుగుబిల్లి ఇన్‌చార్జి ఎంపీడీవోగా నియమించారు. గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల పరిషత్‌లకు రెగ్యులర్ ఎంపీడీవోలు ఉన్నారు. సాలూరు రెగ్యులర్ ఎంపీడీవోగా ఉండాల్సిన శివరామప్ప కురుపాం ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు.
పాలకొండలో...
ఈ నియోజకవర్గంలో భామిని, సీతంపేట మండలాల్లో రెగ్యులర్ ఎంపీడీవోలు ఉన్నారు. పాలకొండ ఈవోపీఆర్‌డీ ఆనందరావు ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. వీరఘట్టం ఈవోపీఆర్‌డీ ప్రకాశరావు ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఉన్నారు.
మితిమీరిన రాజకీయ జోక్యం
మండల పరిషత్ అధికారులు ఇన్‌చార్జిలు కావడంతో పలు నియోజకవర్గాల్లో రాజకీయ జోక్యం ఎక్కువవుతోంది. నాయకుల ఆశీస్సులతో కొందరు రెగ్యులర్ పోస్టులు వదిలి ఇన్‌చార్జి ఎంపీడీవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జి ఎంపీడీవోలు నాయకుల గీత దాటడం లేదు. మరికొన్ని చోట్ల ఎంపీడీవో కార్యాలయాలను రాజకీయ నాయకులు తమ కార్యాలయాలుగా మారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పరిషత్ కేంద్రంగా పాలన సాగిస్తున్న మండల పరిషత్‌లలో అధికారుల పోస్టింగ్‌లు విషయంలో అంతా గందరగోళంగానే ఉంది. రాజకీయ కోణంలోనే తమకు అభిమాన పాత్రులైన అధికారులను ఎంపీడీవోలుగా నియమించుకొనే పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. దీంతో రెగ్యులర్ ఎంపీడీవోలు ఇతర మండలాల్లో ఇన్‌చార్జి ఎంపీడీవోలుగా విధులు నిర్వహించాల్సి వస్తోంది.
త్వరలోనే రెగ్యులర్ ఎంపీడీవోల నియామకం
త్వరలోనే రెగ్యులర్ ఎంపీడీవోల నియామకం జరుగుతుంది. జిల్లాలో అన్ని మండలాలకు ఎంపీడీవోలు ఉన్నారు. రెగ్యులర్ ఎంపీడీవోలు లేక ఇన్‌చార్జిలుగా కొంతమందిని నియమించాం. ఎంపీడీవోల నియామకంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.
- రాజకుమార్, డిప్యూటీ సీఈవో, ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్