సరఫరా.. అరకొర

ABN , First Publish Date - 2022-05-15T05:13:58+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డుదారులకు అన్ని రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు అందించాల్సి ఉంది. అయితే జిల్లాలో ఆ పరిస్థితి లేదు.

సరఫరా.. అరకొర

 
కార్డుదారులకు పూర్తిస్థాయిలో అందని కందిపప్పు
స్టాక్‌ ఉన్నా ముందుకు రాని డీలర్లు

(పాలకొండ)
 
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డుదారులకు అన్ని రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు అందించాల్సి ఉంది. అయితే జిల్లాలో ఆ పరిస్థితి లేదు. కార్డుదారులకు కొన్నినెలలుగా బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారు. కందిపప్పు మాత్రం ఇవ్వడం లేదు. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల పరిధిలో చాలాచోట్ల రేషన్‌ బియ్యం వాహనాలు (ఎండీయూ), డిపోల ద్వారా అరకొరగానే కందిపప్పును సరఫరా చేస్తున్నారు. సబ్సిడీపై అందించే కందిపప్పు కిలో ప్యాకెట్‌ ధర రూ.63 కాగా బయట మార్కెట్లో ధర రూ. రూ.90 నుంచి 110 వరకూ పలుకుతోంది. దీంతో కార్డుదారులు అధిక ధరలకు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సబ్సిడీ కందిపప్పు సరఫరా నామమాత్రంగానే జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికా రులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 ఇదీ పరిస్థితి ..
పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు లక్షల 67 వేల 473 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులందరికీ ప్రతి నెలా కిలో చొప్పున 267.473 టన్నుల కందిపప్పు సరఫరా చేయాల్సి ఉంది. అయితే అధికారుల లెక్కల ప్రకారం 148.048 టన్నులు మాత్రమే కార్డుదారులకు సరఫరా చేస్తున్నారు. వాస్తవంగా రేషన్‌ డీలర్లు కందిపప్పు విడుదల చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కందిపప్పు ప్యాకెట్లకు రంధ్రాలు పడినా, పగిలినా కార్డుదా రులు కొనుగోలు చేయడం లేదు. నాణ్యత లేదనే సాకుతో బహిరంగ మార్కెట్‌లో ఈ పప్పును కొనుగోలు చేసేవారు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. దీంతో ముందుగా పెట్టుబడి పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని కొందరు రేషన్‌డీలర్లు భావిస్తున్నారు. మొత్తంగా వివిధ కారణాలతో పలు రేషన్‌డిపోల పరిధిలో కొన్ని నెలలుగా కందిపప్పు సరఫరా కావడం లేదు. మరికొంతమంది డీలర్లు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నుంచి వచ్చే కమిషన్‌ ద్వారా మాత్రమే కందిపప్పును కొనుగోలు చేసి కార్డుదా రులకు విక్రయిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో కందిపప్పు నిల్వలు ఉన్నా.. వాటి సరఫరాపై దృష్టిసారించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

అందుబాటులో నిల్వలు
జిల్లాలో కార్డుదారులకు ప్రతినెలా సరిపడా కందిపప్పు నిల్వలను ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో అందుబాటులో ఉంచుతున్నాం. డీడీలు తీసిన డీలర్లకే సరుకులు సరఫరా చేస్తున్నాం.
- నాయక్‌, డీఎస్‌వో, పార్వతీపురం మన్యం జిల్లా


 

Read more