టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?
ABN, First Publish Date - 2022-05-14T06:40:18+05:30
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అధికార పార్టీ శాసనసభ్యులు, సమన్వయకర్తలకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది.
మీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లయ్యింది, ఇంకెప్పుడు ఇస్తారు
‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమానిని నిలదీసిన మహిళ
ఓపిక పట్టాలన్న విజయనిర్మల
ఆనందపురం మండలంలో మాజీ మంత్రికి సమస్యలు ఏకరువు పెట్టిన మహిళలు
రోడ్లు, డ్రైనేజీలు, చెత్త సమస్యలు ప్రస్తావన
విశాఖపట్నం, ఎంవీపీ కాలనీ, మే 13 (ఆంధ్రజ్యోతి):
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అధికార పార్టీ శాసనసభ్యులు, సమన్వయకర్తలకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. సమస్యలు, సంక్షేమ పథకాలపై జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అర్హులకు పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేయడం లేదని, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ధ్వజమెత్తుతున్నారు.
‘టిడ్కో ఇంటి కోసం రూ.25 వేలు చెల్లించాం. ఇప్పటివరకు ఇల్లు రాలేదు. అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తున్నాం. మీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లవుతోంది. ఇప్పటికీ ఇల్లు మంజూరుకాలేదు. ఇంకెప్పుడు ఇస్తారు’...అంటూ వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్, తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మలను మహిళలు నిలదీశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం జీవీఎంసీ 17వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా విజయనిర్మలను ఇళ్ల మంజూరుపై వనజ అనే మహిళతో పాటు మరికొందరు ప్రశ్నించారు. ఎప్పుడు మంజూరుచేస్తారో చెప్పాలని నిలదీశారు. దీంతో ఆమె త్వరలోనే మంజూరవుతాయని, ఓపిక పట్టాలని కోరారు. దీంతో మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యల ఏకరువు
కాలనీలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, మురుగునీరు రహదారులపైకి పొంగి దుర్గంధం వ్యాపిస్తోందని మరికొందరు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే అది ప్రభుత్వ నిర్ణయమని, అభివృద్ధి పనుల కోసమే యూజర్ చార్జీ వసూలుచేస్తున్నారని, సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గేదెల లావణ్య, వైసీపీ నేతలు పాల్గొన్నారు.
మాజీ మంత్రికి షాక్
డ్రైనేజీ, రోడ్డు, తాగునీటి కోసం నిలదీసిన మహిళలు
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు సమస్యల సెగ తగిలింది. ఆయన గురువారం ఆనందపురం మండలం పెద్దిపాలెంలో కార్యక్రమం నిర్వహణకు వెళ్లగా స్థానిక సమస్యలపై మహిళలు నిలదీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గత మూడేళ్లలో ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వివరించేందుకు మాజీ మంత్రి యత్నించగా గుండువారి కల్లాలులో గుండు శైలజ అనే మహిళ తమ ప్రాంత సమస్యలను ఏకరువుపెట్టారు. కొన్ని ఇళ్ల వరకే సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మించారని, తమ ఇళ్లను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ‘మావి ఇళ్లు కాదా? మేము మనుషులం కాదా?, వాళ్లేనా మనుషులు’ అని ప్రశ్నించారు. దీంతో షాక్‌కు గురైన ఆయన అక్కడి నుంచి పక్క వీధిలోకి వెళ్లగా అక్కడ దివ్యజ్యోతి అనే మహిళ...తమ ప్రాంతంలో చెత్త సేకరణ జరగడం లేదని, ఫోరైడ్ నీటిని సరఫరా చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఫోరైడ్ నీరు తాగడం వల్ల తమ ప్రాంతంలో చాలామందికి మోకాళ్ల సమస్యలు వస్తున్నాయని, ఇప్పటికైనా తమకు మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.