‘స్పందన’కు కచ్చితంగా హాజరవ్వాలి

ABN , First Publish Date - 2022-05-14T06:51:44+05:30 IST

జిల్లా కేంద్రంలో వారానికి ఒకసారి నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఆర్జీలు సమర్పించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తున్నారని, అందువల్ల ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులంతా విధిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.

‘స్పందన’కు కచ్చితంగా హాజరవ్వాలి
స్పందన కార్యక్రమంలో అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

జిల్లా అధికారులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశం

అర్జీలను ప్రాధాన్యతక్రమంలో పరిష్కరించాలని సూచన


పాడేరు, మే 13(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో వారానికి ఒకసారి నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఆర్జీలు సమర్పించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తున్నారని, అందువల్ల ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులంతా విధిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌లతో కలిసి శుక్రవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అధికారులకు తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు ఎంతో దూరం నుంచి వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న స్పందన కార్యక్రమానికి అధికారులు హాజరు కాకుండా ప్రజల్ని నిరుత్సాహపరిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతి అధికారి స్పందన కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని, ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. 


‘స్పందన’కు మోదకొండమ్మ పండుగ ఎఫెక్ట్‌....

స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు 45 అర్జీలను అందజేశారు. గిరిజన పల్లెల్లో సామాజిక ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్న 751 మందికి నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించడంలేదని ఆ సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు గ్రామ సచివాలయం పరిధిలో ఉండడంతో సేవలు పొందడం ఇబ్బందిగా ఉందని, వనుగుపల్లిలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. తమకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేయాలని హుకుంపేట మండలం గుర్రాలతోట గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. తమకు మూడు నెలల వేతన బకాయిలు అందాలని మాతృ భాషా వలంటీర్లు అర్జీ అందజేశారు. జీకేవీధి మండలం సీలేరు గురుకుల పాఠశాల హాస్టల్‌ వర్కర్‌గా పనిచేస్తూ గత ఏడాది మృతిచెందిన తన భర్త చిన్నగడ్డయ్య ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని భార్య బొంకుల అనిత చంటిబిడ్డతో వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. ముగ్గురు పిల్లలతో ఇల్లు గడవడం కష్టంగా వుందని, ఏడాది నుంచి పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా న్యాయం చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి, గిరిజన సంక్షేమ విద్యా శాఖ డీడీ సీఏ.మణికుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Read more