నర్సీపట్నం, నాతవరంలలో కుండపోత వర్షం
ABN, First Publish Date - 2022-05-09T06:30:57+05:30
వాతావరణంలో మార్పుల కారణంగా ఆదివారం పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ మండినప్పటికీ సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో నర్సీపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
నర్సీపట్నం/ నాతవరం, మే 8 : వాతావరణంలో మార్పుల కారణంగా ఆదివారం పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ మండినప్పటికీ సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో నర్సీపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని చిరు గాలులతో వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఎటుచూసినా నీరే కనిపించింది. వెంకునాయుడుపేట, ప్రశాంతినగర్, బ్యాంక్ కాలనీ, శివపురం తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే, నాతవరం మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కుండపోతగా వాన పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.