‘అల్లం’ ఫలితాలు ఆశాజనకం
ABN, First Publish Date - 2022-05-14T06:48:38+05:30
ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల్లో సాగుకు అనువైన అల్లం వంగడాలపై స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రయోగాత్మకంగా పరిశోధనలు జరుపుతున్నారు.
చింతపల్లిలో ఐదు రకాల వంగడాలపై ప్రయోగాత్మక సాగు
నాలుగు రాష్ట్రాల నుంచి ఏడు రకాలను రప్పించిన శాస్త్రవేత్తలు
మూడేళ్ల నుంచి సాగు... ఫలితాలపై అధ్యయనం
ప్రస్తుత ఖరీఫ్‌లో చివరి ఏడాది సాగు
వచ్చే ఏడాది రైతుల చెంతకు విత్తనం
చింతపల్లి, మే 13: ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల్లో సాగుకు అనువైన అల్లం వంగడాలపై స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రయోగాత్మకంగా పరిశోధనలు జరుపుతున్నారు. కేరళ, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల నుంచి రప్పించిన ఏడు రకాల సాగు, పంట దిగుబడులు, ఆశించే తెగుళ్లు, తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. మూడేళ్ల ప్రయోగాత్మక సాగులో ‘జాన్ జింజర్’ అనే రకం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ శివకుమార్ తెలిపారు.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని గిరిజన మండలాల్లో సుమారు 90 వేల హెక్టారుల్లో అల్లం సాగు అవుతున్నది. దశాబ్దం క్రితం వరకు గిరిజన రైతులు దేశవాళీ రకాలను సాగుచేసేవారు. 2010 నుంచి శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారుల సూచనల మేరకు గిరిజన నాడియా, సుప్రభ రకాలను పండిస్తున్నారు. నాడియా రకం సాధారణ దిగుబడి ఎకరానికి పది టన్నులు కాగా రైతులు 8-9 టన్నులు సాధిస్తున్నారు. అయితే పీచు తక్కువగా వుండి, కొమ్ము పరిమాణం పెద్దదిగా ఉండే అల్లం రకాలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. దీంతో గిరిజన ప్రాంత రైతులకు ఈ తరహా వంగడాలను పరిచయం చేసేందుకు చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగుకు శ్రీకారంచుట్టారు.
ఏడు రకాలపై పరిశోధనలు
కొమ్ము పరిమాణం పెద్దదిగా, పీచు తక్కువగా వుండే ఏడు రకాల అల్లం వంగడాలను ఇతర రాష్ట్రాల నుంచి నుంచి దిగుమతి చేసుకుని శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. కేరళ నుంచి జాన్‌జింజర్, పశ్చిమబెంగాల్ నుంచి గోరుబతాని, బోల్డ్ నాడియా, సిక్కిం నుంచి బైస్, ఒడిశా నుంచి పీజీఎస్-102, పీజీఎస్-121, పీజీఎస్-95 రకాలను రప్పించి మూడేళ్ల నుంచి ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సాగు చేసి తుది ఫలితాలను సమీక్షించనున్నారు. రానున్న వారం రోజుల్లో నాట్లు వేసేందుకు విత్తనాన్ని సిద్ధం చేశారు. ప్రయోగాత్మక సాగులో ఇదే చివరిదని, పంట నాణ్యత, పీచు శాతం, పరిమాణం, తెగుళ్లను తట్టుకునే శక్తిపై అధ్యయనం చేసి గిరిజన ప్రాంతానికి అనువైన వంగడాలను ఎంపిక చేస్తామని పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ శివకుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ప్రొట్రేల్లో నారు పెంపకం
అల్లం విత్తనాన్ని నేరుగా పొలంలో నాటడంలేదు. సుమారు నెల రోజుల పాటు నారు పెంచి, అనంతరం ప్రధాన పొలంలో నాటుతున్నారు. ఇందుకోసం ప్రొట్రేలను వినియోగిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 500 కిలోల అల్లం విత్తనం అవసరం. ప్రొట్రేలలో నారు పెంపకం చేపడితే 250 కిలోలు సరిపోతుంది. దుంపకుళ్లు తెగులు ఆశించదు. ఎదిగిన మొక్కలు నాటడం వల్ల దిగుబడి పెరుగుతుంది.
వచ్చే ఏడాది విత్తనం పంపిణీ
డాక్టర్ శివకుమార్, ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి
మూడేళ్ల పరిశోధనల్లో జాన్ జింజర్ రకం బాగుంది. చివరి ఏడాది ప్రయోగాత్మక సాగును ప్రస్తుత ఖరీఫ్‌లో చేపడుతున్నాం. విత్తనాభివృద్ధి కోసం వచ్చే ఏడాది ఏడు రకాల్లో మేలిజాతి వంగడాలను రైతులకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. 2024 ఖరీఫ్‌లో ఇతర రైతులకు కూడా విత్తనం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.