ఖైదీలకు ఆరోగ్యశ్రీ సదుపాయం

ABN , First Publish Date - 2022-05-14T05:42:34+05:30 IST

రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లోని ఖైదీలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరోగ్యశ్రీ పథకం’ వర్తించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జైళ్ల శాఖ ఐజీ డాక్టర్‌ ఇండ్ల శ్రీనివాసరరావు తెలిపారు.

ఖైదీలకు ఆరోగ్యశ్రీ సదుపాయం
మాట్లాడుతున్న జైళ్ళ శాఖ ఐజీ డాక్టర్‌ ఇండ్ల శ్రీనివాసరావు

రాష్ట్రంలోని అన్ని జైళ్లలోని వారికి వర్తింపు

జైళ్ల శాఖ ఐజీ డాక్టర్‌ ఇండ్ల శ్రీనివాస్‌

విశాఖపట్నం, మే 13: రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లోని ఖైదీలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరోగ్యశ్రీ పథకం’ వర్తించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జైళ్ల శాఖ ఐజీ డాక్టర్‌ ఇండ్ల శ్రీనివాసరరావు తెలిపారు. అడవివరంలోని కేంద్ర కారాగారాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పలు బ్లాకులు సందర్శించారు. జైలు ఆవరణలోని మామిడితోట వేలంను ఆయన పర్యవేక్షణలో నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఖైదీలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం వల్ల ఒరిగే ప్రయోజనాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రతి ఖైదీ జైలులోకి ప్రవేశించిన మరుక్షణం నుంచి ఈ పథకం అతనికి వర్తించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ఖైదీలందరికీ మెరుగైన, కార్పొరేట్‌ వైద్యసేవలందుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.


ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి ఉన్న ఖైదీని తగిన బందోబస్తుతో తరలించి, ఆసుపత్రి వద్ద కాపలా కాస్తామన్నారు. అక్టోబర్‌లో విశాఖలో బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో జైలు సిబ్బందికి ‘డ్యూటీమీట్‌’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన జైలు సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. జైలు ఆవరణలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన పసుపు, కారం, మసాలాపొడి తయారీ యూనిట్లు నిలిచిపోయిన విషయం సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువెళ్లగా పునఃప్రారంభానికి చర్యలు చేపడతామన్నారు.


ముడిసరుకు కొనుగోలుకు టెండర్లు పిలిచి, పొడులు ప్రజల ముంగిటకు చేరుస్తామని తెలిపారు. రాష్ట్రంలోని జైలు ఖైదీల్లో 7,593 మందికి మొదటి డోస్‌, 5,083 మందికి రెండవ డోస్‌ కొవిడ్‌ టీకా వేయడం పూర్తయిందని తెలిపారు. 1935 మంది సిబ్బందికి మొదటి డోస్‌, 1902 మందికి రెండో డోస్‌ పూర్తయిందన్నారు. తొలుత జరిగిన మామిడి తోట వేలంను రూ.52 వేలకు ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. అనుకున్న మేర ఆదాయం రాకపోవడంతో ఆవులు, గేదెల వేలాన్ని నిలిపివేశారు. డిపాజిట్లను పాటదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జైలు అదనపు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ రామచంద్రరావు పాల్గొన్నారు.

Read more