జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ రద్దు
ABN, First Publish Date - 2022-05-14T09:08:50+05:30
జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ రద్దు
వేసవిలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తిరుమల, మే 13 (ఆంధ్ర జ్యోతి) : వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను పరిమితం చేశామన్నారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమంగా అందిస్తున్నామన్నారు. భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేలా చలువపందిళ్లు, నేలపై చలువసున్నం, కార్పెట్లు వేశామని, ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు సేదతీరేలా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. పేదలకు పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తామన్నారు. జమ్మూ, సీతంపేట, అమరావతి ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఏప్రిల్ నెలలో 20.64 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించామని, రూ.127 కోట్లు హుండీ ఆదాయం సమకూరిందన్నారు. శ్రీవారికి ఈ-హుండీ ద్వారా రూ.4.41 కోట్లు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఈ-హుండీ ద్వారా రూ.13 లక్షలు లభించాయన్నారు.