మాజీ సైనికుల భూములకు పీవోటీ చట్టం వర్తించదు

ABN , First Publish Date - 2022-05-06T08:04:51+05:30 IST

సైనికులు, మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన సాగు భూములను పదేళ్ల కాలపరిమితి దాటిన తర్వాతే స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని రెవెన్యూశాఖ మరోసారి..

మాజీ సైనికుల భూములకు  పీవోటీ చట్టం వర్తించదు

పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు

ఎన్‌వోసీలు కూడా అక్కర్లేదు

నిషేధ జాబితా నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోయేలా వెబ్‌ల్యాండ్‌లో ఏర్పాట్లు

కేసుల పరిష్కారంలో కలెక్టర్లకు కీలక అధికారాలు

సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు జారీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): సైనికులు, మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన సాగు భూములను పదేళ్ల కాలపరిమితి దాటిన తర్వాతే స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని రెవెన్యూశాఖ మరోసారి స్పష్టత ఇచ్చింది. ఆ భూములకు ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ ల్యాండ్స్‌(బదిలీ నిషేధం-పీవోటీ) చట్టం-1977 వర్తించదని, భూమి లేని నిరుపేదల కోటాలో వారికి భూములు ఇవ్వలేదన్న విషయం పరిగణ నలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అసైన్‌మెంట్‌ చేసిన తేదీ తర్వాత సరిగ్గా  పదేళ్లకు ఆ భూములు ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని సెక్షన్‌ 22(ఏ)లోని నిషేధ భూముల జాబితా నుంచి తొలగిపోయేలా వెబ్‌ల్యాండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) జి.సాయిప్రసాద్‌ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేశారు. పదేళ్ల కాలపరిమితి దాటిన భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేకుంటే ప్రభుత్వం జారీ చేసే నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) అవసరం లేదని మరోసారి పునరుద్ఘాటించారు. నిజానికి ఈ అంశాలపై 2016 జూలై 4నే నాటి ప్రభుత్వం జీవో 279 జారీ చేసింది. అందులోని అంశాలను పునరుద్ఘాటిస్తూ, విశాఖ జిల్లా కలెక్టర్‌ లేవనెత్తిన అనేకానేక సందేహాలకు స్పష్టత ఇస్తూ సీసీఎల్‌ఏ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేశారు. 


సైనికులకు భూమి కేటాయించాలంటే..

ఇకపై మాజీ సైనికులు, సర్వీసులో ఉన్న సైనికుల పేరిట సాగు భూములు కేటాయించాలంటే విధిగా జిల్లా సైనిక్‌ సంక్షేమ అధికారి కార్యాలయం నుంచే దరఖాస్తు రావాలని సీసీఎల్‌ఏ పేర్కొన్నారు. ఆ దరఖాస్తును గ్రామ లేదా వార్డు సచివాలయానికి పంపించాక తిరిగి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరాలని దిశానిర్దేశం చేశారు. దరఖాస్తు సమయంలో జిల్లా సైనికాధికారి కార్యాలయంలోనే వారి బయోమెట్రిక్‌ తీసుకోవాలన్న కొత్త అంశాన్ని చేర్చారు. తహసీల్దార్‌ నుంచి జిల్లా అసైన్‌మెంట్‌ రివ్యూ కమిటీకి డిజిటల్‌ ఫైలు వెళ్లాక అసైన్‌మెంట్‌కు కమిటీ సిఫారసు చే యాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఈ-ఫైలింగ్‌లోనే ఉండాలని, ఫిజికల్‌ ఫైల్‌ రూపంలో ఉండొద్దని స్పష్టత ఇచ్చారు.


జాయింట్‌ కలెక్టర్‌ లాగిన్‌లోనే అసైన్‌మెంట్‌కు సంబంధించిన డిజిటల్‌ రికార్డు రూపొందాలని, మీ సేవ ద్వారా పాస్‌బుక్‌ను పోస్టల్‌ అడ్ర్‌సకు పంపించాలని సీసీఎల్‌ఏ స్పష్టత ఇచ్చారు. అయితే, భూమిపై పాస్‌బుక్‌ జారీ సమయంలో జిల్లా కలెక్టర్‌ ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు.  దరఖాస్తు చేసుకున్నది సైనికులా, మాజీ సైనికులా అన్నది గుర్తించేందుకు జీవో 743, జీవో 1117లలో ఇచ్చిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆదేశించారు. సర్వీసు రిజిస్టర్‌ ఆధారంగా తీసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలోనే వారి నుంచి స్వీయ ధృవీకరణ తీసుకోవాలన్నారు. మాజీ సైనికులకు ఇచ్చే అసైన్‌మెంట్‌ను పీవోటీ చట్టం కింద నిరుపేదలకు ఇచ్చినట్లుగా భావించొద్దని సీసీఎల్‌ఏ స్పష్టత ఇచ్చారు. 


పదేళ్ల తర్వాత ఎన్‌వోసీ లేకుండానే..

 సైనికులు, మాజీ సైనికులకు భూముల కేటాయింపు పక్కా నిబంధనల ప్రకారమే జరిగి ఉంటే, వారు ఆ భూమిలో పొజిషన్‌లో ఉంటే, అసైన్‌మెంట్‌ చేసిన తేదీ నుంచి సరిగ్గా  పదేళ్ల కాలపరిమితి దాటాక ఆ భూములను అమ్ముకునే హక్కు వారికి ఉందని సీసీఎల్‌ఏ పేర్కొన్నారు. జీవో 297 ప్రకారం పదేళ్లకాలపరిమితి దాటిన భూములకు ఎన్‌వోసీలు కూడా అక్కర్లేదన్నారు. జిల్లా స్థాయిలో పదేళ్ల కాలపరిమితి దాటిన భూములను అసైన్‌మెంట్‌ కేటగిరీ నుంచి తొలగించేలా వెబ్‌ల్యాండ్‌లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే, రికార్డు పక్కా ఉన్న భూముల్లో అసైన్‌మెంట్‌ అయిన తేదీ నుంచి పదేళ్ల కాలపరిమితి దాటిన వెంటనే ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించేలా వెబ్‌ల్యాండ్‌లోనూ ఏర్పాట్లు చేసుకోవాలని, ఈ మేరకు ప్రత్యేక రిజిస్టర్లను నిర్వహించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కాగా, రికార్డులు, వాస్తవికత విషయంలో వివాదం ఉన్న భూములపై ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. 2013కు ముందు, తర్వాత మాజీ సైనికుల నుంచి కొనుగోలు చేసిన భూములపై కూడా స్పష్టత ఇచ్చారు. భూమి అసైన్‌మెంట్‌ వాస్తవమైనదే అయితే, భూమి అమ్మిన వ్యక్తి మాజీ సైనికులే అయితే నిబంధనల ప్రకారం వాటిని అనుమతించాలన్నారు.


అసైన్‌మెంట్‌ డీఆర్‌ ఫైల్స్‌, ఇతర ఆధారాలు లేని కేసుల్లోనూ పొజిషన్‌పై విచారణ చేసి, నిజమైన మాజీ సైనికులు, లేదా సైనికులే అయితే, అసైన్‌మెంట్‌ నిజమే అయితే వాటికి కూడా పదేళ్ల కాలపరిమితి నిబంధన వర్తిస్తుందన్నారు. అంటే, డీఆర్‌ ఫైల్స్‌ లేకున్నా, లబ్ధిదారులు నిజమైన వారే అయితే, వారికి అన్ని హక్కులూ ఉంటాయని, ఆ భూములను అమ్ముకోవచ్చని పేర్కొన్నారు. భూమి కేటాయించిన తర్వాత కూడా పొజిషన్‌లో లేకుంటే వాటిని నిబంధనల ప్రకారం రద్దుచేయాలని ఆదేశించారు. 


పట్టా భూమిగా మార్చాలి..

సైనికులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాక వారంలో ఆ భూమిని పట్టాభూమిగా రికార్డులు మార్చాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. వెబ్‌ల్యాండ్‌లో ఆ భూముల స్వభావాన్ని పట్టా భూములుగా చూపించాలన్నారు. నకిలీ, తప్పుడు పత్రాలతో భూములు పొందిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆ పట్టాలను రద్దుచేయడంతోపాటు వాటిని కలిగి ఉన్నవారిపై క్రిమినల్‌ కేసులు దాఖలు చేయాలని ఆదేశించారు. 


నీటి వనరులున్న భూములు ఇస్తే రద్దు చేయాలి

చెరువులు, కుంటలు, నదీ తీర ప్రాంతాల్లో మాజీ సైనికులు, సైనికులు, ఇతరులకు భూములు అసైన్‌మెంట్‌ చేస్తే అది నిబంధనకు విరుద్ధంగా జరిగినదిగానే పరిగణించాలని సీసీఎల్‌ఏ పేర్కొన్నారు. అలాంటి అసైన్‌మెంట్లను నిబంధనల మేరకు రద్దుచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు ఇచ్చే భూముల విషయంలో జిల్లా కలెక్టర్లకు కీలక అధికారాలు కల్పించేలా సీసీఎల్‌ఏ జారీచేసిన మార్గదర్శకాలున్నాయి. అయితే, ఏ చట్టప్రకారం కలెక్టర్లకు ఆ అధికారాలు కట్టబెడుతున్నారో సీసీఎల్‌ఏ వివరించలేదు. ‘‘భూమిపై మాజీ సైనికులే పొజిషన్‌లో ఉన్నా, ఇతర ఆధారాలున్నా... భూమి కేటాయింపునకు సంబంధించిన డీఆర్‌ ఫైల్స్‌ మిస్‌ అయిన సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఈ వ్యవహారంలో ఏం చేయాలని విశాఖ కలెక్టర్‌ వివరణ కోరారు. డీఆర్‌ ఫైల్‌ కనిపించకపోయినా, ఆ భూమిపై మాజీ సైనికులే పొజిషన్‌లో ఉంటే దాన్ని వాస్తవికమైనదిగా భావించాలి.


అలాంటి కేసుల్లోనూ పదేళ్ల కాలపరిమితి దాటాక ఆ భూమిని అమ్ముకునే అవకాశం కలెక్టర్‌ కల్పించాలి’’ అని పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో ఎలాంటి నిబంధనలు పాటించకున్నా అసైన్‌మెంట్‌ జరిగిపోయింది. అసైనీ భూమిపై పొజిషన్‌లో ఉంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్న ప్రశ్నకు సీసీఎల్‌ఏ సమాధానం ఇస్తూ ఈ దశలో అసైనీ మాజీ సైనికుడా? కాదా నిర్ధారించుకోవాలన్నారు. అలాంటి భూములు నిషేధ జాబితా నుంచి తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉందని గుర్తుచేశారు. ఇలా అనేక అంశాల్లో కలెక్టర్లకు విశేష అధికారాలు ఉన్నాయన్నట్లుగా పేర్కొన్నారు. అయితే, ఏ చట్టం పరిధిలో కలెక్టర్లకు ఆ అధికారాలు ఉన్నాయో సీసీఎల్‌ఏ వివరించలేదు.

Read more