-
-
Home » Andhra Pradesh » The current crisis is on the rise-NGTS-AndhraPradesh
-
కరెంటు సంక్షోభం పైపైకి!
ABN , First Publish Date - 2022-05-04T07:56:35+05:30 IST
కరెంటు సంక్షోభం పైపైకి!

బొగ్గు కొరతతో డిస్కంలు విలవిల
మార్కెట్లో అమాంతం పెరిగిన విద్యుత్ ధర
రెండ్రోజుల్లో యూనిట్‌కు రూ.3.45 పెరుగుదల
3 రోజుల్లోనే జనంపై 122 కోట్ల ట్రూఅప్ భారం
పడిపోతున్న బొగ్గు నిల్వలు.. సరఫరా అరకొర
వీటీపీఎ్‌సలో రోజుకు సరిపడా నిల్వలూ లేవు
ఆర్టీపీపీలో రోజున్నరకే సరిపోతాయి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం మరింత ముదిరింది. ఓపక్క పెరుగుతున్న వినియోగం, డిమాండ్.. ఇంకోపక్క దేశీయంగా బొగ్గు కొరత.. అరకొర సరఫరా.. సాధారణ థర్మల్ విద్యుత్కేంద్రాల్లోనూ పది శాతం మేర విదేశీ బొగ్గును వాడాలన్న షరతులతో డిస్కంలు బెంబేలెత్తిపోతున్నాయి. కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిష్కర్షగా వ్యవహరిస్తుండడం.. బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధర అమాంతం పెరిగిపోవడంతో దిక్కుతోచక సతమతమవుతున్నాయి. వాస్తవానికి నిరంతర విద్యుత్ అందిస్తున్నామనే మిషతో.. బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.20కు డిస్కమ్‌లు కొనుగోలు చేశాయి. దీనిపై విపక్షాలు, వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ప్రభుత్వం రూ.12కి మించి కొనకూడదని నిర్దేశించింది. దీంతో కొనుగోళ్లు తగ్గించి.. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం, సగం కరెంటే వాడాలని నియంత్రించడం వంటి చర్యలకు డిస్కమ్‌లు ఉపక్రమించాయి. ప్రజలు ఏసీలు, గీజర్లు వాడడం తగ్గించాలని కూడా సూచించింది. గత నెల 30 తేదీన సగటున యూనిట్ రూ.11.54 చొప్పున 34.86 మిలియన్ యూనిట్లను రూ.40.23 కోట్లకు కొనుగోలు చేశాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.12 కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నాయని ప్రజలు భావించారు. కానీ అమాంతం ధర పెరిగిపోవడంతో.. సోమవారం ఏకంగా యూనిట్ రూ.14.99 చొప్పున 29.38 మిలియన్ యూనిట్లను రూ.44 కోట్లకు కొనాల్సి వచ్చింది. యూనిట్‌కు ఒక్కసారిగా మూడు రూపాయలు పెరగడం.. గత మూడ్రోజుల్లోనే డిస్కంలు రూ.122 కోట్ల మేర బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేయడం వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. ఎందుకంటే ఈ భారమంతా ట్రూ అప్ చార్జీల పేరుతో వారి నుంచే వసూలు చేయబోతున్నాయి.
ప్లాంట్లలో బొగ్గు సంక్షోభం
గడచిన మూడేళ్లలో ప్రభుత్వం దూరదృష్టి లేకుండా.. నిర్లక్ష్య ధోరణితో అనుసరించిన విద్యుత్ విధానం కారణంగా థర్మల్ యూనిట్లలో బొగ్గు నిల్వలు గణనీయంగా పడిపోయాయి. జెన్కో విద్యుత్కేంద్రాలైన కృష్ణపట్నం, వీటీపీఎస్, ఆర్టీపీపీల్లో విద్యుదుత్పత్తి వ్యయం భారీగా ఉందని.. బహిరంగ మార్కెట్లో కరెంటు కారుచౌకగా దొరుకుతోందంటూ ప్రభుత్వం వాటిని షట్‌డౌన్ చేయడం ప్రారంభించింది. బొగ్గు నిల్వలు పెంచుకోవడంపై దృష్టి సారించలేదు. దీంతో ఆయా ప్లాంట్లలో నిల్వలు క్రమంగా పడిపోయాయి. బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు చెల్లించకుండానే కొనుగోలు ఆర్డర్లను నిలుపుదల చేయడంతో ఆ సంస్థలు రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించాలని నోటీసులిచ్చాయి. బొగ్గు సరఫరా ఆపేశాయి. దేశీయంగా కరెంటు కొరత ఏర్పడి బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెరగడంతో.. మళ్లీ థర్మల్ కేంద్రాలే దిక్కయ్యాయి. కానీ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు మాత్రం లేదు. బకాయిలు చెల్లిస్తేనే బొగ్గు సరఫరా చేస్తామని జెన్కోకు బొగ్గు కేంద్రాలు తెగేసి చెప్పాయి. గతంలో 90 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకున్న థర్మల్ ప్లాంట్లలో ఇప్పుడు 1-2 రోజులకు మించి నిల్వల్లేవు. వీటీపీఎ్‌సలో రోజువారీ వినియోగం 28,500 మెట్రిక్ టన్నులు కాగా.. సోమవారం నాటికి 26,194 మెట్రిక్ టన్నులే నిల్వ ఉంది. అంటే నిండా ఒకరోజుకు కూడా చాలదు. ఆర్టీపీపీలో రోజుకు 21వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఒకటిన్నర రోజులకు సరిపడా 32,384 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. కృష్ణపట్నంలో మాత్రం ఆరున్నర రోజులకు సరిపడా 1,20,889 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు సరఫరా ఏపూటకాపూటగా ఉండడం.. బహిరంగ మార్కెట్లో ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. రాష్ట్రం మరింత సంక్షోభంలోకి వెళ్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.