నందీశ్వరస్వామికి పరోక్ష ఆర్జిత సేవ

ABN , First Publish Date - 2022-05-14T05:49:35+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం త్రయోదశిని పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్షసేవగా విశేష అభిషేక అర్చనలు చేశారు.

నందీశ్వరస్వామికి పరోక్ష ఆర్జిత సేవ

శ్రీశైలం, మే 13: శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం త్రయోదశిని పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్షసేవగా విశేష అభిషేక  అర్చనలు చేశారు. ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను నిర్వహించారు. నందీశ్వరస్వామికి శాస్ర్తోక్తంగా పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతో, కుంకుమోదకం, హరిద్రోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికార్జున గుండంలోని శుద్ధజలాలతో అభిషేకం నిర్వహించి అనంతరం అన్నాభిషేకం జరిపారు. అభిషేకానంతరం నందీశ్వరస్వామికి నూతన వస్త్రసమర్పణ, విశేష అర్చనలు నిర్వహించారు. క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో పూజలలో పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్షసేవల ద్వారా అవకాశం కల్పించింది.  భక్తులు ఈ పరోక్ష సేవలో పాల్గొనేందుకు దేవస్థానం వెబ్‌సైట్‌ డబ్య్లూడబ్య్లూడబ్య్లూ.శ్రీశైలదేవస్థానం.ఓఆర్‌జీ లేదా ఆన్‌లైన్‌ ద్వారా ఒక్కొపూజకు రూ. 1,116 లు సేవారుసుమును చెల్లించి పాల్గొనాలని తెలిపారు. ఆర్జిత పరోక్ష సేవ  పూజా కార్యక్రమాన్ని శ్రీశైలటీవీ లేదా యూట్యూబ్‌ ద్వారా వీక్షించవచ్చును. 





Read more