మహానాడుకు అడ్డంకులు

ABN , First Publish Date - 2022-05-14T06:58:26+05:30 IST

తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించుకునే మహానాడు కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించే ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది.

మహానాడుకు అడ్డంకులు

మినీస్టేడియం ఇచ్చేందుకు నిరాకరణ 

ముందుగా దరఖాస్తు చేసి డబ్బులు కట్టినా అనుమతి ఇవ్వని ప్రభుత్వం

అత్యవసర పరిస్థితుల్లో  నిర్వహణకు మరో వేదిక కోసం నేడు పరిశీలన

జిల్లా నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ష

తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించుకునే మహానాడు కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించే ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం  ప్రారంభించింది. అందుకోసం ముందుగా రిజర్వు చేసుకున్నా, అద్దె చెల్లించినా ఒంగోలులోని మినీస్టేడియాన్ని కేటాయించేది లేదని తేల్చేశారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వినియోగిం చుకునేందుకు మినీస్టేడియం దక్కకపోవటంతో మరో ప్రాంగణం కోసం టీడీపీ నాయకులు గాలింపు చేపట్టారు.  

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందుకు అవసరమైన ఏర్పాట్లకు ఆ పార్టీ శ్రీకారం పలికింది. గుంటూరు బైపాస్‌లో సువిశాలమైన ప్రైవేటు భూమిని ఎంపిక చేసుకున్నారు. అయితే మేలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ స్థలం చూడాలని ఆ పార్టీ నిర్ణయిం చుకుంది. ఆ మేరకు ఒంగోలు నగరంలోని పాత జడ్పీ వద్ద నిర్మితమైన మినీస్టేడియాన్ని వినియోగించుకోవాలని భావించారు. తొలిరోజు 10వేల మందితో జరిగే ప్రతినిధుల సభను మినీ స్టేడియంలో నిర్వహించుకు నేందుకు ఇబ్బంది ఉండదని భావించారు. వర్షం కొనసాగితే రెండవరోజు బహిరంగసభ అక్కడే ముగించాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ గతనెలలోనే కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను కలిసి రెండురోజులు పాటు మినీసేడియం ఇవ్వాలని దరఖాస్తు ఇచ్చారు. అంతేకాక వారంరోజుల క్రితం కనీసం నాలుగు రోజులు దాన్ని లీజుకు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రోజుకు లీజు ధర రూ.18వేల ప్రకారం అద్దెను కూడా చలానా ద్వారా చెల్లించారు. అయితే అధికార యంత్రాంగం తాజాగా మినీస్టేడియం లీజులకు ఇవ్వటం కుదరదని తేల్చేశారు. ఆ మేరకు గురువారం అధికారి కంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తాము లీజు ప్రతిపాదనలను శాప్‌ అధికారులకు పంపామని వారు నిరాకరించినట్లు సమాచారం ఇచ్చారు. అంతేకాక వేసవి క్రీడా శిక్షణ శిబిరాల తేదీలు పొడిగిస్తూ అవి ఉన్నందున లీజుకు ఇవ్వటం కుదరదని సాకు చెప్పినట్లు తెలిసింది. 


ప్రత్యామ్నాయం కోసమే..

గుంటూరు బైపాస్‌ రోడ్డులోని బృందావనం కళ్యాణ మండపం వెనుక 80 ఎకరాల ప్రైవేటు స్థలంలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వాతావరణ విపత్కర పరిస్థితులు ఎదురైనా దివంగత ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా జరిగే మహానాడును ప్రత్యామ్నాయ స్థలంలో నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేయాలని భావించి మినీస్టేడియం చూశారు. శుక్రవారం జిల్లా నాయకులతో టెలీ కాన్పరెన్స్‌ నిర్వహించిన పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించి అవసరమైతే వినియోగించుకునేందుకు వీలుగా మరో చిన్నస్థలం చూడాలని కోరారు. టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు స్వామి, రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, పార్టీ నాయకులు దామచర్ల జనార్దన్‌, సత్య, ఉగ్రనరసింహరెడ్డి తదితరులతో మాట్లాడిన తర్వాత గుళ్లాపల్లి వద్ద మూతబడి దామచర్ల కుటుంబానికి భాగస్వామ్యం ఉన్న మహి ఆగ్రో ప్యాక్టరీ  స్థలాన్ని వినియోగించుకోవాలనే అంచనాకు వచ్చారు. ఆ మేరకు వేదిక ఏర్పాట్లు చూసే  సంస్థ ప్రతినిధులను శనివారం వెళ్లి ఆ స్థలాన్ని చూసి వినియోగానికి అవకాశం ఉందో లేదో పరిశీలించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. 


అనువైన స్థలం కోసం అన్వేషణ

ఆ మేరకు శనివారం ఉదయం 10గంటలకు మహీ ఆగ్రో స్థలాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ స్థలం అనువుగా ఉంటే గుంటూరు బైసాస్‌లోని స్థలంతో పాటు వర్షం వస్తే నిర్వహించుకునేందుకు అక్కడా వేదిక ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఏ విషయం శనివారం స్ధలం పరిశీలన అనంతరం ఖరారయ్యే అవకాశం ఉంది. కానిపక్షంలో ఇతర ప్రైవేటు ఆవరణలను కూడా పరిశీలించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. అయితే గతంలో అమరావతి  రైతుల పాదయాత్ర సందర్భంగా రాత్రి బసకు, మధ్యాహ్నం భోజనానికి ఎంపిక చేసిన ప్రైవేట్‌ విద్యాసంస్థలను అధికారపార్టీ నాయకులు వత్తిడి చేసి చివర్లో రద్దుచేయించిన ఉదంతాన్ని అచ్చెన్నాయుడు దృష్టికి నాయకులు తీసుకెళ్లారు. దీంతో మహానాడు నిర్వహణకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్వహించక తప్పదని అందుకు ఇబ్బంది లేని స్థలాలను చూడాలని ఆయన జిల్లా నాయకులను ఆదేశించారు. తదనుగుణంగా మహానాడు జరిగే రోజుల్లో వర్షం వస్తే కార్యక్రమం నిర్వహించే స్థలం కోసం శనివారం టీడీపీ నాయకులు అన్వేషణ చేసే అవకాశం ఉంది. 


Read more