15 లక్షల మందిలో లక్ష మందికే భరోసా: కొల్లు
ABN, First Publish Date - 2022-05-14T09:38:56+05:30
15 లక్షల మందిలో లక్ష మందికే భరోసా: కొల్లు
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో మత్స్యకార వృత్తిపై 15 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం లక్ష మందికి మాత్రమే మత్స్యకార భరోసా పేరుతో రూ.10 వేలు ఇస్తోంది. అదే పెద్ద మహాకార్యం మాదిరిగా కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు గుమ్మరిస్తోంది. ఇదో పెద్ద ఘనతా..!’’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘‘జీవో 217 ద్వారా రిజర్వాయర్లు, నదులపై మత్స్యకారుల హక్కులను రద్దు చేసి లక్షల మంది పొట్టగొట్టారు. కరెంటు చార్జీలు, పెట్రో ఉత్పత్తుల రేట్లు, నిత్యావసరాల ధరలు పెంచేశారు. రూ.10 వేలు ఇచ్చి రూ.30 వేలు వారినుంచి గుంజుతున్నారు’’ అని ఆరోపించారు.