రెఫర్‌ టు కర్నూలు

ABN , First Publish Date - 2022-05-14T06:10:47+05:30 IST

ఏ చిన్న జబ్బు చేసి ఎమ్మిగనూరు ఆస్పత్రికి వెళ్లినా రెఫర్‌ టూ కర్నూలు అనే కాగితం చేతిలో పెడతారనే విమర్శలు ఉన్నాయి.

రెఫర్‌ టు కర్నూలు
ఆసుపత్రి ఆవరణలోని వార్డుల వెలుపల బెడ్‌లపై రోగులు

  1. ఎమ్మిగనూరు వైద్యశాలలో డాక్టర్ల కొరత  
  2. భర్తీకాని పోస్టులు
  3. చిన్న వ్యాధికి కూడా అందని వైద్యం 
  4. ప్రైవేట్‌ వైద్యశాలలే దిక్కు  

ఎమ్మిగనూరు, మే 13: ఏ చిన్న జబ్బు చేసి ఎమ్మిగనూరు  ఆస్పత్రికి వెళ్లినా రెఫర్‌ టూ కర్నూలు అనే కాగితం చేతిలో పెడతారనే విమర్శలు ఉన్నాయి. ఈపాటి దానికి అక్కడికి వెళ్లడం దేనికని రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రుల దారి పడుతున్నారు. ఈ కమ్యూనిటీ ఆస్పత్రిలో వైద్యుల దగ్గరి నుంచి స్వీపర్‌ దాకా 66 మంది ఉండాలి.  కానీ 30 మందే ఉన్నారు. 16 మంది వైద్యులు ఉండాలి. కానీ ఏడుగురే ఉన్నారు. అలాంటి చోట వైద్యం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అంతా రెఫర్‌ టూ కర్నూలు తప్ప ట్రీట్‌మెంట్‌ ఏమీ లేదని రోగులు విసుక్కుంటున్నారు. ఇదీ  50 పడకల ఆసుపత్రి వైనం.  


250 నుంచి 300 ఓపీలు

ఎమ్మిగనూరు పట్టణం, మండలం నుంచేగాక నందవరం, మంత్రాలయం, గోనెగండ్ల, పెద్దకడుబూరు మండలాల నుంచి కూడా రోజుకు 250 నుంచి 300 వరకు రోగులు వస్తుంటారు. ప్రతి గురువారం స్కానింగ్‌ కోసం దాదాపు వందమందికి పైగా  వస్తుంటారు. అంతేగాక నెలలో దాదాపు 200నుంచి 300వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. అలాగే కంటి చికిత్స కోసం రోగులు వస్తుంటారు. దీంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల రద్దీగా ఉంటుంది. అయితే ఇందులో  కొన్ని పోస్టులు చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. అదనంగా కొన్ని ఖాళీపడుతున్నాయి. వాటిని భర్తీ చేయాలని అధికారులు అనుకోవడం లేదు. దీంతో చిన్న వ్యాధితో రోగులు వచ్చినా ప్రాథమిక చికిత్స చేసి కర్నూలుకు రెఫర్‌ చేస్తున్నారు. చాలా మంది వ్యాధిగ్రస్థులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు.  


ఖాళీలు ఇలా.. 

వైద్యశాలలో ప్రధానంగా మూడు సివిల్‌ సర్జన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  ఆర్‌ఎం 1, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 8, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టు 1, ఏఓ 1పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఇవిగాక ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 


నత్తనడకన నిర్మాణ పనులు

ఎమ్మిగనూరు  కమ్యూనిటీ  వైద్యశాల ఆవరణలోనే 19ఏళ్ల కితం అప్పటి మంత్రి దివంగత  బీవీ మోహన్‌రెడ్డి వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. 2014లో బీవీ తనయుడు జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో మరోసారి రూ. 12.60 కోట్ల నాబార్డు నిధులతో ఆసుపత్రిని 50 నుంచి 100 పడకలు పెంచేందుకు శంకుస్థాపన చేశారు. మళ్లీ ప్రభుత్వం మారటంతో పనులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మరోసారి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వంద పడకల ఆసుపత్రికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అయితే పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పుడు పూర్తి అయ్యేదీ చెప్పలేని పరిస్థితి. 


వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలి - రంగన్న, ఏఐఎ్‌సఎఫ్‌, జాతీయ కార్యదర్శి, ఎమ్మిగనూరు 

ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలి. వైద్యసిబ్బంది కొరతతో రోగులకు సక్రమంగా వైద్యం అందటం లేదు. దీంతో వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది.  వందపడకల ఆసుపత్రిని త్వరగా పూర్తిచేయాలి. నిర్లక్ష్యం చేయటం సరికాదు. 


వైద్యుల భర్తీ చర్యలు తీసుకుంటా:  డా. రాంజీ నాయక్‌, డీసీహెచ్‌ఎ్‌స, కర్నూలు 

ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీ చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.  త్వరలో ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉంది.  

Read more