-
-
Home » Andhra Pradesh » Kurnool » Modi Jagan fail in price control-NGTS-AndhraPradesh
-
ధరల అదుపులో మోదీ, జగన్ విఫలం
ABN , First Publish Date - 2022-05-14T05:42:42+05:30 IST
ధరలను అదుపు చేయడంలో మోదీ, జగన్ ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామక్రిష్ణ అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ
కర్నూలు(న్యూసిటీ), మే 13: ధరలను అదుపు చేయడంలో మోదీ, జగన్ ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామక్రిష్ణ అన్నారు. ఈ నెల 15న విజయవాడలో జరిగే వామపక్షపార్టీల సమావేశంలో ధరల పెంపుపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం సీఆర్ భవన్‌లో రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ. సత్యనారాయణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామక్రిష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, వారిని పట్టించునే నాథుడేలేరని అన్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇందులో 69 మంది చనిపోగా ఎటువంటి నష్టపరిహారం అందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినెట్ సమావేశంలో ఇన్‌పుట్ సబ్సిడీ గురించి ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో రైతులు వలస బాట పట్టారని అన్నారు. నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ఆర్టీసీపై రూ..720, విద్యుత్‌పై రూ.1400 కోట్లు ప్రజలపై భారం మోపారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఆదానిప్రదేశ్‌గా మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై 26 జిల్లాలో సీపీఐ పెద్ద ఎత్తు ఆందోళన చేస్తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కే.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ఎన్.రసూల్ పాల్గొన్నారు.

