-
-
Home » Andhra Pradesh » Kurnool » Is reconciliation achieved-MRGS-AndhraPradesh
-
Byreddy- ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య సయోధ్య కుదిరినట్టేనా..!?
ABN , First Publish Date - 2022-05-15T05:06:42+05:30 IST
Byreddy- ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య సయోధ్య కుదిరినట్టేనా..!?
- బైరెడ్డి సిద్ధార్థ, ఎమ్మెల్యే ఆర్థర్‌తో మాట్లాడిన వైసీపీ పెద్దలు
- ‘గడప గడపకు’ కలిసి పని చేయాలని సూచన
నంద్యాల, మే 14 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. వీరి తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయన్న ఉద్దేశంతో వైసీపీ పెద్దలు గతంలో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయితే అవేవీ ఫలితాన్నివ్వలేదు. దీంతో మరోసారి తాజాగా వీరివురు మధ్య సయోధ్యను కుదుర్చేందుకు వారిని విజయవాడ పిలిపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన, కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి అమ్జాద్ బాషా సమక్షంలో ఇద్దరిని సమావేశపరిచారని, గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఇద్దరు కలిసి పాల్గొనాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా ఇద్దరు కలిసి పని చేయాలని సూచించారని తెలుస్తోంది.
కలిసి సాగుతారా..!
బైరెడ్డి సిద్ధార్థ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్యే ఆర్థర్ గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమ వర్గం వారికి టికెట్లను ఇప్పించుకునే విషయంలో గొడవలకు సైతం దిగారు. కర్నూలు పాత బస్టాండ్, కొత్త బస్టాండ్‌కు సమీపంలోని ప్రైవేటు హోటల్లో సీనియర్ నాయకులు ముందే గొడవపడ్డారు. అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. వారి ముందు సరేనంటూ చేతులు కలిపినా తర్వాత ఆర్థర్, సిద్ధార్థ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
గత ఏడాది మిడ్తూరు మండలంలోని సచివాలయ భవనాల ప్రారంభోత్సవ సమయంలో ఆర్థర్, సిద్ధార్థ మధ్య విభేదాలు సమసిపోలేదన్న విషయం మరోసారి బహిర్గతమైంది. దానికి తోడు గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఇద్దరు కలిసి సాగడం లేదన్న విషయం వైసీపీ పెద్దలు దృష్టికి వెళ్లింది. ఇలా నియోజకవర్గంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోతే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉందని వైసీపీ అధి నాయకత్వం భావించినట్లుంది. ఇప్పటికే గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజల్లో పార్టీ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఇలాంటి సమయంలో నియోజకవర్గంలోని ఇద్దరు ముఖ్య నాయకులు గొడవ పడటం పార్టీకి అసలు మంచిది కాదని ఇద్దరిని పిలిచి మరీ క్లాస్ పీకారని, గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో కలిసి పాల్గొనాలని వైసీపీ పెద్దలు సూచించినట్లు సమాచారం.

