-
-
Home » Andhra Pradesh » Kurnool » Dumma for evaluation-NGTS-AndhraPradesh
-
మూల్యాంకనానికి డుమ్మా
ABN , First Publish Date - 2022-05-14T05:44:05+05:30 IST
కర్నూలు ఏ.క్యాంపు మాంటిస్సోరి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు ఉపాధ్యాయులు భారీగా గైర్హాజరయ్యారు.
పది స్పాట్‌కు గైర్హాజరైన 72 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 13: కర్నూలు ఏ.క్యాంపు మాంటిస్సోరి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు ఉపాధ్యాయులు భారీగా గైర్హాజరయ్యారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి తోడు విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మొదటిరోజే స్పాట్ అభాసుపాలైంది. ఉపాధ్యాయుల గైర్హాజరీకి విద్యాశాఖ అధికారుల మెతక వైఖరి, చేతగానితనం కారణమనే విమర్శలు వస్తున్నాయి. పది స్పాట్ విధులకు టీచర్లు అధిక సంఖ్యలో గైర్హాజరైన విషయం తెలిసి రాష్ట్ర స్థాయి అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మూల్యాంకనం విధులకు గైర్హాజరైన 72 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని పరీక్షల విభాగం రాష్ట్ర పరిశీలకురాలు మేరీ చంద్రిక శుక్రవారం తెలిపారు. గైర్హాజరు కావడానికి కారణాలు ఏమిటో సంజాయిషీని ఇవ్వాలని, శనివారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. అలాగే స్పాట్ ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయుల్ని ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎందుకు రిలీవింగ్ చేయలేదో సంజాయిషీ చెప్పాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కోరినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. కొంత మంది ఉపాధ్యాయులు మూల్యాంకనం విధులకు ఆలస్యంగా హాజరై సాయంత్రం నిర్ణయించిన టైం కంటే ముందే వెళ్లిపోయారు. దీంతో పది మూల్యాంకన శిబిరం అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు ఉన్నా యి. మొదటి రోజు మూల్యాంకనానికి 20 శాతం పైగా ఉపాధ్యాయులు అనుమతి లేకుండానే గైర్హాజర్ అయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం మొదట ఈ నెల 20వ తేదీ వరకు పాఠశాలలకు వెళ్లాలని ఉపాధ్యాయులకు సూచించింది. ఆ తర్వాత ఈ ఉత్తర్వులను సవరిస్తూ మే 15వ తేదీ వరకు మాత్రమే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో స్పాట్ విఽధులపట్ల ఉపాధ్యాయుల్లో నిరాసక్తత తలెత్తినట్లు తెలుస్తోంది.
స్పాట్ డ్యూటీలకు రాని టీచర్లపై చర్యలు తీసుకోవాలి
పదో తరగతి స్పాట్ విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులపైన, వారికి సహకరించిన పాఠశాలల ప్రధానోపాద్యాయులపైన చర్యలు తీసుకోవాలని పరీక్షల విభాగం రాష్ట్ర పరిశీలకురాలు మేరీ చంద్రికకు, డీఈవో రంగారెడ్డికి బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ వినతి పత్రం అందజేశారు. శారీరక సమస్యలు, అంగవైకల్యం ఉన్నవారు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరిన వెంటనే స్పందించి వారి డ్యూటీలను రద్దు చేసిన రాష్ట్ర పరిశీలకురాలు మేరీ చంద్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.

