రైతులను ఆదుకోవడంలో విఫలం
ABN, First Publish Date - 2022-05-14T05:54:40+05:30
రైతులను ఆదుకోవడంలో విఫలం
రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఆగ్రహం
తోట్లవల్లూరులో అసాని ప్రభావ పంటల పరిశీలన
తోట్లవల్లూరు, మే 13 : వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలై రైతాంగం ఆర్థికంగా చితికిపోతోందని, విపత్తులతో నష్ట పోయిన రైతాంగాన్ని ఆదుకోవటంలో విఫలమయ్యారని రాష్ట్ర టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. అసాని తుఫాను ప్రభావ పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఈ కమిటీ శుక్రవారం తోట్లవల్లూరు మండలంలో పర్యటించింది. వల్లూరుపాలెంలో తడిసిన మొక్కజొన్న పంటను, పాములలంకలో పడిపోయిన అరటి తోటలను సందర్శించి రైతులతో మాట్లాడింది. అనంతరం చంద్రమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పంటల నమోదులో కూడా టీడీపీ రైతా, వైసీపీ రైతా అని వివక్ష చూపటం దుర్మార్గమన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,759 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.1,617 కోట్లే ఇచ్చిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం వరికి హెక్టారుకు రూ.15 వేల పరిహారం చెల్లించాల్సి ఉండగా, టీడీపీ హయాంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ ఇచ్చామని, ఇప్పుడు సీఎం జగన్ ఎన్డీఆర్ఎఫ్ నిబంధనలు అమలు చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో టీడీపీ ఇచ్చిన పరిహారానికి తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విపత్తులతో పీకల్లోతు కష్టాల్లో రైతులుంటే వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టేందుకు సాహసించటం దుర్మార్గమని, అలా చేస్తే రైతుల తరఫున పోరాడతామని హెచ్చరించారు. భూసార పరీక్షలను నిలిపివేశారు.. పంటల దిగుబడి పెరగటం ఇష్టం లేదా.. అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయంలో యాంత్రీకరణకు టీడీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేయగా, వైసీపీ ఎంత ఖర్చు చేసిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వర్ల కుమార్‌రాజా, టీడీపీ మండల అధ్యక్షుడు వీరపనేని శివరామ్‌ప్రసాద్, ఉపాధి హామీ మండలి మాజీ డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి, తెలుగు రైతు మండల అధ్యక్షుడు నెక్కలపూడి మురళీ, సర్పంచ్ మూడే శివశంకర్, భీమవరపు అంజిరెడ్డి పాల్గొన్నారు.