కమ్యూనిటీ భవనం నిర్మిస్తే ఎంపీకి పేరు.. నాకేంటీ

ABN , First Publish Date - 2022-05-14T05:50:44+05:30 IST

బోయకాలనీలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనం పూర్తి అయ్యేందుకు నిధులు కేటాయించాలని

కమ్యూనిటీ భవనం నిర్మిస్తే ఎంపీకి పేరు.. నాకేంటీ
అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనాన్ని పరిశీలిస్తున్న శావల దేవదత్‌

 ప్రజల కోసం చేసే పనుల్లో పేరు చూస్తారా ? 

 ఎమ్మెల్యే రక్షణనిధి తీరుపై దేవదత్‌ విమర్శ

తిరువూరు, మే 13: బోయకాలనీలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనం పూర్తి అయ్యేందుకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేను కోరితే.. ఈ భవనం పూర్తయితే  ఎంపీకి పేరువస్తుంది, నాకు రాదుగా అనటం  శోచనీయం అని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ అన్నారు.  నమస్తే తిరువూరులో భాగంగా బోయకాలనీలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కమ్యూనిటీ భవనం నిర్మాణానికి ఎంపీ నిధులు రూ.10 లక్షలు, మున్సిపల్‌ నిధులు రూ.30 లక్షలు కేటాయించగా సుమారు నాలుగు సంవత్సరాల క్రితం భవన నిర్మాణం చేపట్టినా  అసంపూర్తి ఉందని కాలనీ వాసులు తెలిపారు. ఈ భవనం పూర్తిచేయటానికి నిధులు కేటాయించాలని  ఎమ్మెల్యే రక్షణనిధిని కోరగా, ఎంపీ నిధులతో ప్రారంభమైన భవనానికి నిధులు కేటాయిస్తే పేరు ఎంపీకి వస్తుంది కాని నాకు పేరు రాదుగా అన్నారని కాలనీ వాసులు దేవదత్‌తో అన్నారు. ప్రజలకు అవసరమైన వాటిలో కూడా రాజకీయాలు చూస్తారా అన్ని ప్రశ్నించారు. తాగునీటి సరఫరా, డ్రెయిన్లు తదితర సమస్యలను స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌, తాళ్లూరి రామారావు, డాక్టర్‌ జయసింహా, మీనుగు శ్రీనివాస్‌, మీనుగు లక్ష్మి, ఆకుల దుర్గాప్రసాద్‌, ఇంజమర్ల వాసు, వాకదాని లక్ష్మీనారాయణ, కామాల రామారావు,  తదితరులు పాల్గొన్నారు.


మూడేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి

 ఒక్క అవకాశం అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, మూడు సంవత్సరాల్లో ఎం అభివృద్ధి చేశారో చెప్పాలని ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య డిమాండ్‌ చేశారు.  పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు, ప్రతిఏటా జాబ్‌క్యాలెండర్‌,  విద్యుత్‌ చార్జీలు తగ్గింపు చేస్తామన్న ఈ హామీలు ఎక్కడ నెరవెర్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే రక్షణనిధి అప్పుడప్పుడు నియోజకవర్గానికి రావడం తప్ప, అభివృద్ధి చేసింది శూన్యం అన్నారు. 



Read more