సెస్సు భారం ఎవరిది?
ABN, First Publish Date - 2022-05-14T06:01:25+05:30
సెస్సు భారం ఎవరిది?
మిల్లర్లకే భారం అంటున్న ప్రభుత్వం
రైతులు బాధితులు కాదంటూ అధికారుల వాదన
కాదు.. రైతులపైనే భారం వేస్తామంటున్న మిల్లర్లు
ధాన్యంపై సెస్సు పెంపు భారంపై భిన్న వాదనలు
అన్ని విధాలా నష్టం రైతన్నకే..
ఆందోళనకు సమాయత్తమవుతున్న మిల్లర్లు
ధాన్యంపై సెస్సు పెంపు భారం రైతులపై ఏమాత్రం ఉండదని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. మిల్లర్లకు వేసే ఈ పన్నుకు, రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. అదేం కాదు.. సెస్సు రెట్టింపైతే రైతులపైనే భారమేస్తామని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యంపై సెస్సును పెంచినా, మిల్లర్లు దానిని వ్యతిరేకిస్తున్నా, అధికారులు సమర్థించుకుంటున్నా చివరికి ఆ భారం అన్నదాత వద్దకే వచ్చి ఆగుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలోని రైతులపై రూ.వందల కోట్ల భారం పడనుంది.
గుడివాడ, మే 13 : రైతుల నుంచి సెస్సు వసూలు నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలతో కొన్నాళ్లు ఆపినట్టే ఆపిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ బాదుడుకు సిద్ధమైంది. అన్నదాతపై రెట్టింపు భారం మోపింది. కేంద్ర ప్రభుత్వం వద్దన్నా మార్కెటింగ్ సెస్సును రెండు శాతానికి పెంచుతూ ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. తాజా జీవోతో అటు రైస్ మిల్లర్లు, ఇటు రైతుల గుండెల్లో పిడుగు పడినట్టైంది. వ్యవసాయ ఉత్పత్తులు, పశుగణాభివృద్ధి 1966 చట్టంలోని సెక్షన్-12 ప్రకారం సెస్సు వసూళ్లను రెట్టింపు చేసేలా బైలా 24(1)ను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ధాన్యంపై గతంలో ఉన్న ఒక శాతం సెస్సు రెండు శాతానికి పెరిగింది. రొయ్యలపై మార్పు చేయలేదు. మార్కెటింగ్ సెస్సును మిల్లర్ల నుంచి వసూలు చేస్తామని చెబుతున్నా పరోక్షంగా ఆ భారం రైతులపైనే పడనుంది. ఆ మేరకు రైతులు ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది.
రైతులపై భారం ఇలా..
వాస్తవంగా మిల్లర్లకు వేసే పన్నుకు రైతులు ఏవిధంగా బాధితులవుతారంటూ మార్కెటింగ్ శాఖ అధికారులు వాదిస్తున్నారు. ధాన్యం కొనే సమయంలోనే సెస్సు, ఇతర ఖర్చులను మిల్లర్లు, ధాన్యం కొనుగోలుదారులు తగ్గించి ధర నిర్ణయిస్తారు. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రభుత్వం పెంచిన భారం రైతులపైనే పడుతుంది. ఇదే అదునుగా ధాన్యం కొనుగోలుదారులు ధర తగ్గించి కొంటున్నారు. అసలే ఆదాయాలు అంతంతమాత్రంగా ఉన్న వ్యవసాయంపై మార్కెటింగ్ సెస్సు రూపంలో ఈ బాదుడేంటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే మద్దతు ధర లేక అవస్థలు పడుతున్న రైతుల నడ్డి విరిచే ప్రయత్నాలు చేయడం దారుణమంటున్నాయి. ఇంకా ధాన్యం డబ్బు రైతుల ఖాతాల్లో వేయకుండా నానా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి ధాన్యాగారంగా ఉన్న కృష్ణాడెల్టాపై దీని ప్రభావం భారీగానే పడే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు పేరిట రైతుల గుండెల్లో అనుమానపు బీజాలు నాటిన రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో మరింత ముంచిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మిల్లర్ల పోరుబాట
ఇప్పటికే ప్రభుత్వ బకాయిలతో అల్లాడుతున్న రైస్ మిల్లర్లు తాజా ఉత్తర్వులపై మండిపడుతున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనలేమని, ఒకేసారి అంత భారం మోపితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సెస్సును మిల్లర్ల నుంచి వసూలు చేస్తామని పేర్కొంటున్నా పుట్టెడు కష్టాల్లో ఉన్న తాము ఆ భారాన్ని మోయడానికి సిద్ధంగా లేమని అంటున్నారు. పెంచిన సెస్సు భారాన్ని పరోక్షంగా రైతులపైనే వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. రైతులకు చెల్లించే ధరలో కోత విధించడం మినహా గత్యంతరం లేదంటున్నారు. ధాన్యంపైనా, మరాడించిన బియ్యంపైనా సెస్సు కడుతున్న తాము తాజా పెంపును ఎలా భరిస్తామని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారంతా ప్రభుత్వంతో చర్చించేందుకు సమాయత్తమవుతున్నారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల మిల్లర్లను ఏకం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. గతంలో లెవీ ధాన్యం మర ఆడించిన దానికి సంబంధించి ఒక్కో రైస్‌మిల్లుకు ప్రభుత్వం రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు బకాయి పడినట్లు తెలుస్తోంది. ఆ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పాటు మార్కెటింగ్ సెస్సు రెండింతలు చేయడంపై నిరసన తెలపడానికి ఉద్యుక్తులవుతున్నారు.
కృష్ణా రైతులపై రూ.వందల కోట్ల భారం
ఎకరాకు 30 క్వింటాళ్ల ధాన్యం పండుతుందనుకుంటే క్వింటాకు ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరగా రూ.1,960 రైతులకు చెల్లిస్తారు, అందులో ఒక శాతం అంటే.. రూ.196 ప్రభుత్వం సెస్సు కింద వసూలు చేస్తుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం క్వింటాకు రూ.392 వసూలు చేయను న్నారు. కృష్ణాజిల్లా రైతులు సుమారు 1.64 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. ఈ రకంగా సెస్సు రూపంలో రూ.వందల కోట్లను గతంలో కంటే ఎక్కువగా ప్రభుత్వానికి చెల్లించనున్నారని తేలుతోంది. మినుములు, పెసలు, చెరుకు.. ఇలా అన్ని వ్యవసాయ ఉత్పత్తుల మీద మార్కెట్ సెస్సు రెట్టింపు కానుంది.
