-
-
Home » Andhra Pradesh » Krishna » bikes burning case one person arrested-NGTS-AndhraPradesh
-
‘పగ’మంట..!
ABN , First Publish Date - 2022-05-14T06:16:37+05:30 IST
ప్రతీకారం పగను పెంచింది. ఆ పగ మంట పెట్టింది. చిట్టినగర్ లంబాడీపేటలో బైక్‌ల దహనం కేసులో నిందితుడిని కొత్తపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
‘పగ’మంట..!
బైక్‌ల దహనం కేసులో నిందితుడి అరెస్టు
ఎదురింటి వ్యక్తి వివాదం
ఆ కారణంగానే బైక్‌కు నిప్పు
పక్క బైక్‌లకు అంటుకున్న మంటలు
విజయవాడ/ చిట్టినగర్, మే 13 (ఆంధ్రజ్యోతి) : ప్రతీకారం పగను పెంచింది. ఆ పగ మంట పెట్టింది. చిట్టినగర్ లంబాడీపేటలో బైక్‌ల దహనం కేసులో నిందితుడిని కొత్తపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎదురింట్లో ఉన్న వ్యక్తితో వివాదాల కారణంగానే బైక్‌కు నిప్పు పెట్టాడు. ఈ మంటలు చుట్టుపక్కల వాహనాలకు వ్యాపించాయి. దీనికి సంబంధించిన వివరాలను ఉపకమిషనర్ బాబూరావు, ఏసీపీ కె.హనుమంత రావు, ఇన్‌స్పెక్టర్ గురుప్రకాశ్ వెల్లడించారు.
లంబాడీపేటకు చెందిన రత్నావతు సాయికుమార్ అలియాస్ సాయి గ్యాస్ డెలివరీ చేసే ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం వివాహమైంది. సాయికి భార్య, ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. రెండేళ్ల క్రితం కుమార్తెను తీసుకుని భార్య సాయికి దూరంగా వెళ్లిపోయింది. సాయికి ఇంటికి ఎదురుగా వెంకటేశ్వరరావు ఉంటున్నాడు. ఎదురెదురు ఇళ్లు కావడంతో వెంకటేశ్వరరావుకు సంబంధించిన బంధువుతో సాయి మాట్లాడు తుండేవాడు. ఆమెతో మాట్లాడొద్దని ఆయన పలుమార్లు హెచ్చరించాడు. అయినా చాలాసార్లు వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ వెంకటేశ్వరరావుకు కనిపించారు. దీంతో వెంకటేశ్వరరావు, ఆయన మామ దుర్గారావు కలిసి సాయితో గొడవపడ్డారు. కొద్దిరోజుల క్రితం అతడిపై దాడి చేశారు. అప్పటి నుంచి వెంకటేశ్వరరావుపై సాయి ప్రతీకారం పెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఈనెల 11న పోరంకిలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లిన సాయి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. వారు ఆటోలో తీసుకొచ్చి అడ్డరోడ్డు జంక్షన్ వద్ద దింపారు. కొండపైకి వెళ్తున్న సమయంలో అక్కడ పార్క్ చేసి ఉన్న వెంకటేశ్వరరావు ద్విచక్రవాహనం కనిపించింది. ఆ వాహనం పెట్రోలు పైపు లాగేసి జేబులో ఉన్న లైటర్‌ను వెలిగించి పడేశాడు. వెంకటేశ్వరరావు వాహనానికి అంటుకున్న మంటలు పక్కన ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. ఇందులో గంజాయి బ్యాచ్‌కు చెందిన సాయితేజ అలియాస్ బబ్లూ బైక్ కాలిపోయింది. ఈ పని చేసింది బబ్లూ అని స్థానికులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం అతడి వద్దకు గంజాయి కోసం యువ కులు రావడంతో మందలించామని, ఆ సమయంలో తమను హెచ్చరించాడని దుర్గారావు అనే వ్యక్తి చెప్పాడు. మొదటి నుంచి గంజాయి బ్యాచ్‌కి చెందిన సాయితేజపై ఆరోపణలు చేశారు. గ్యాస్ డెలివరీ ఆటో డ్రైవర్ సాయితో జరిగిన వివాదం గురించి మాత్రం చెప్పలేదు. బైక్‌లు దహనం కావడంతో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లంతా మేల్కొని బయటకు వచ్చారు. ఆ సమయంలో సాయి తల్లి అతడ్ని లేపింది. వెంటనే తన తల్లిని పనిలోకి పంపేసి, సాయి గ్యాస్ కంపెనీకి వెళ్లిపోయాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆధారాలు సేకరిస్తున్నారని తెలుసుకున్న సాయి ఇంటికి రాకుండా బయట తిరుగుతూ ఉన్నాడు. బైక్‌లు తగలిబడిన తర్వాత ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటి నుంచి పోలీసులు సమా చారం సేకరించారు. తెల్లవారుజామున వెళ్లిన సాయి ఇంటికి రాలేదన్న విషయాన్ని గ్రహించిన పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. కొండ ప్రాంతం నిద్ర పోతున్న సమయంలో అడ్డరోడ్డుకు ఆటోలో వచ్చిన సాయిని పోలీసులు గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాయిపై భవానీపురంలో రెండు చోరీ కేసులు, కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఒక బైండోవర్ కేసు, ఒక గంజాయి కేసు ఉన్నట్టు సమాచారం.

