అసాని అలజడి
ABN, First Publish Date - 2022-05-11T05:56:51+05:30
అసాని అలజడి
బందరు వద్ద నేటి సాయంత్రం తీరం దాటే అవకాశం
రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్
నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు
గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు
జిల్లా యంత్రాంగం అప్రమత్తం
తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు
మచిలీపట్నంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అసాని తుఫాను అలజడి సృష్టిస్తోంది. మచిలీపట్నం వద్ద నేటి సాయంత్రం తీరం దాటే అవకాశం ఉండటంతో రెండు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను తీవ్రరూపం దాల్చడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురుగాలులు, చిన్నపాటి వర్షాలు కురిశాయి. బుధవారం ఈ పరిస్థితి తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మంగినపూడి, హంసలదీవి వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.
మచిలీపట్నం-విజయవాడ, ఆంధ్రజ్యోతి : అసాని తుఫాను ముప్పు జిల్లాను అతలాకుతలం చేస్తోంది. ఒడిశా తీరం వైపు వెళ్తున్న ఈ తుఫాను మంగళవారం తన గమనాన్ని మార్చుకుని మచిలీపట్నం వైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రానికి మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో కోస్తాతీరం వెంబడి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కాకినాడకు 210 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 310 కిలోమీటర్లు, గోపాలపురానికి 500 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా మంగళవారం బలమైన గాలులు వీచాయి. వర్షాలు కురిశాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
పటిష్ట బందోబస్తు
అసాని తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత మండలాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు కలెక్టరేట్‌లో 08672-252572, 99086 64635 నెంబర్లతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. భారీ వర్షాలు కురిసి విపత్కర పరిస్థితులు ఏర్పడితే సమాచారం తెలుసుకునేందుకు పదిమంది అధికారులను నియమించారు. మంగినపూడి బీచ్, హంసలదీవిలోని సాగరసంగమం తదితర ప్రాంతాల్లో సముద్రం వద్దకు ఎవరూ వెళ్లకుండా మెరైన్, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగినపూడి బీచ్ వద్ద సముద్ర పరిస్థితిని ఆర్డీవో ఐ.కిషోర్ పరిశీలించారు. తుఫాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. కలెక్టర్ మంగళవారం తన చాంబరులో ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జేసీ మహేశ్‌కుమార్ రావిరాల, ఇతర పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తీరం వెంబడి మండలాల తహసీల్దార్లను అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వంసిద్ధం చేశామని చెప్పారు. కాగా, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
నేడు భారీ వర్షాలు
తుఫాను తీవ్రరూపం దాల్చడంతో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ తుఫాను మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలు ఉండటంతో ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో భారీగా వర్షాలు కురవడంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ఉమ్మడి జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లు బ్రేక్‌డౌన్ అయినప్పుడు తక్షణమే పునరుద్ధరించాలని సీపీడీసీఎల్ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
రైతుల్లో వణుకు
తుఫాను ప్రభావానికి అరటి, బొప్పాయి, మునగ తదితర పంటలు సాగు చేస్తున్నవారు, తీరం వెంబడి ఆక్వా సాగు చేస్తున్న రైతులు వణికిపోతున్నారు. రెండు రోజులుగా వీచిన బలమైన ఈదురుగాలులకు అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తుఫాను తన దిశను మార్చుకుని మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకనుండటంతో మరింత ఆందోళనలో మునిగిపోయారు. 1990, మే 9న తుఫాను సంభవించింది. ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటున్నారు.





