రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
ABN, First Publish Date - 2022-05-14T05:42:43+05:30
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాధకర ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది.
మరో యువకుడికి తీవ్రగాయాలు
బాధిత కుటుంబాల్లో అలుముకున్న విషాదం
మదనపల్లె క్రైం, మే 13: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాధకర ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. తాలూకా పోలీసుల కథనం మేరకు..పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ కురువూరుకు చెందిన శంకరప్ప కుమారుడు టి.జగదీష్(24), రెడ్డెప్ప కుమారుడు ఎ.గణేష్(23), సుబ్రహ్మణ్యం కుమారుడు శివాజీ(22)లు కమ్మీపనులు చేస్తుండేవారు. ఈనేపథ్యంలో పనులు చేసేందుకు శుక్రవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంలో మదనపల్లెకు బయలు దేరారు. మదనపల్లె మండలం 150వ మైలు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న క్వాలిస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా, గణేష్, శివాజీలు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించి, తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆస్పత్రిలో బాధితుల పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. అక్కడ గణేష్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, ఘటనపై ఆరా తీశారు. అనంతరం బాధిత కుటుంబీకులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. జగదీష్, గణేష్ కుటుంబీకులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాధం అలుముకుంది. కాగా జగదీష్‌కు భార్య శ్యామల, ఏడాది వయసు గల బాబు ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.