నాటు బాంబు పేలుడు

ABN , First Publish Date - 2022-11-08T00:20:28+05:30 IST

రాళ్లచెరువుపల్లె హరిజనవాడకు పక్కనే ఉన్న ఓ పొలంలో నాటుబాంబులు పేలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

నాటు బాంబు పేలుడు
క్లూ్‌సటీంతో వివరాలు సేకరిస్తున్న సీఐ విశ్వనాధరెడ్డి

భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

ఓబులవారిపల్లె, నవంబరు 7: రాళ్లచెరువుపల్లె హరిజనవాడకు పక్కనే ఉన్న ఓ పొలంలో నాటుబాంబులు పేలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకెళితే... రైల్వేకోడూరుకు చెందిన లేత సిద్దయ్య కుమారుడు సురేష్‌బాబుకు చెందిన వ్యవసాయ పొలంలో పెట్లూరు శ్రీహరి (49), అతడి భార్య పోలమ్మ కాపలాదారులుగా ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం వారిరువురూ నాటుబాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్రీహరి మృతి చెందగా అతడి భార్య చికిత్స పొందుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారు ప్రమాదం జరిగిన స్థలానికి దూరంగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న రైల్వేకోడూరు సీఐ విశ్వనాధరెడ్డి, క్లూస్‌టీం, బాంబు స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు నిర్వహించారు. పేలుడు ధాటికి షెడ్డు రేకులు పగిలిపోయాయి. ఘటనా ప్రదేశంలో పేలుడు సంభవించేందుకు వాడే సామగ్రిలైన నైలాన్‌దారం, బ్యాండేజీ, కవర్‌, నల్లమందు, యూరియా, సున్నం, ఉప్పు ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. అడవి పందులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు ఇలాంటి పనులు చేస్తుంటాడని చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. దీనిపై సీఐ విశ్వనాధరెడ్డిని వివరణ కోరగా మృతుడు శ్రీహరి అడవి జంతువులను వేటాడటం కోసం నాటు బాంబులు లేదా ఔట్లు తయారు చేస్తున్నట్లు అక్కడ జరిగిన ఘటన ఆధారంగా తెలుస్తోందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-11-08T00:20:28+05:30 IST

Read more