ఎన్‌ఐఏ అదుపులో మాజీ మావోయిస్టు

ABN , First Publish Date - 2022-05-14T05:45:07+05:30 IST

మదనపల్లెకు చెందిన మాజీ మావోయిస్టు ఆంజనేయులు అలియాస్‌ అంజి(40)ని గురువారం నేషనల్‌ ఇన్వేస్టిగేషన్‌ అథారిటీ(ఎన్‌ఐఏ)అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్‌ఐఏ అదుపులో మాజీ మావోయిస్టు
మాజీ మావోయిస్టు ఆంజనేయులు(పైల్‌ఫొటో)

రెండోసారి అదుపులోకి తీసుకున్న అధికారులు


మదనపల్లె క్రైం, మే 13: మదనపల్లెకు చెందిన మాజీ మావోయిస్టు ఆంజనేయులు అలియాస్‌ అంజి(40)ని గురువారం నేషనల్‌ ఇన్వేస్టిగేషన్‌ అథారిటీ(ఎన్‌ఐఏ)అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా గాలివీడుకు చెందిన ఆంజనేయులు గతంలో మావోయిస్టు దళాల్లో వివిధ హోదాల్లో పనిచేసి, ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలసి పోయారు. ఎనిమిదేళ్ల కిందట మదనపల్లెకు వచ్చి స్థానిక బీకేపల్లె కాలనీలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. ఇతనికి భార్య సుగుణ, ఇద్దరు పిల్లలున్నారు. కాగా ట్రాక్టర్‌ పెట్టుకుని బాడుగలు తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా మావోయిస్టు నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడనే అభియోగంతో రెండునెలల కిందట కేంద్ర దర్యాప్తు బృందం మదనపల్లెకు వచ్చి స్థానిక టూటౌన్‌ పోలీసుల సహ కారంతో ఆంజ నేయులును అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతని సెల్‌ఫోన్‌తో సహా ఇంట్లోని పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు. అనంతరం వారం రోజుల తరువాత వదిలేశారు. అయితే గురువారం మళ్లీ మదనపల్లెకు వచ్చి స్థానిక పోలీసుల సహకారంతో ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా మావో యిస్టు నేతలతో సంబంధాలు కొనసాగించడమే కాకుండా నక్సలిజంలోకి వెళ్లేలా యువ తను ప్రేరేపిస్తూ, వారిని రిక్రూట్‌ చేస్తున్నాడనే అభియోగంతో కేంద్ర దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. కాగా ఆంజనేయులు భార్య సుగుణకు 41ఏ నోటీసు ఇచ్చి విచా రణ నిమిత్తం కేరళ రాష్ట్రం తిరుచ్చికి తరలించారు. కాగా తన భర్తను విడిచిపెట్టాలంటూ సుగుణ ఎన్‌ఐఏ అధికారులను వేడుకుంది. తన భర్తకు ఏ హాని జరిగినా అధికారులే బాధ్యత వహించాలని పేర్కొంది. ఎవరితో ఎలాంటి సంబంధం లేకుండా ట్రాక్టర్‌ పెట్టుకుని జీవనం సాగిస్తున్న తన భర్తను విచారణ పేరుతో ఎన్‌ఐఏ అధికారులు వెంట తీసుకెళ్లడంతో సుగుణ కన్నీరు పెట్టుకుంది. తన భర్తకు ఏదైనా జరిగితే బిడ్డలూ, తానూ అనాథలమవుతామని రోధించింది.  

Read more