-
-
Home » Andhra Pradesh » Kadapa » fighiting in two rivolaries of ycp-MRGS-AndhraPradesh
-
పట్టపగలే అచ్చం సినిమాలో లాగే డిష్యుం.. డిష్యుం..
ABN , First Publish Date - 2022-05-15T05:12:06+05:30 IST
పట్టపగలే అచ్చం సినిమాలో లాగే డిష్యుం.. డిష్యుం..
- సినీ ఫక్కీలో ఆయుధాలతో వైసీపీ వర్గీయుల బాహాబాహీ
- పోలీసుల సమక్షంలోనే బరి తెగింపు
- ఇరువర్గాలపై నామమాత్రపు కేసులు
రాయచోటి, మే 14 (ఆంధ్రజ్యోతి): అచ్చం సినిమాలో ఫైటింగ్ జరిగే విధంగా వందలాది మంది పట్టపగలు ఘర్షణకు దిగారు. చేతుల్లో రాళ్లు, ఆయుధాలతో కలబడ్డారు. పలువురికి రక్తగాయాలయ్యాయి. తమ ముందే రాళ్లతో కొట్టుకుంటూ ఉన్నా వారిని చెదరగొట్టి ఘర్షణను అదుపు చేయకుండా.. ఘర్షణకు పాల్పడుతున్న వారిని ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ.. పోలీసులు బుజ్జగించారని పలువురు విమర్శిస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా ఘర్షణలకు పాల్పడితే అదీ పోలీసుల సమక్షంలో అయితే పోలీసు ట్రీట్మెంటు వేరే లెవల్లో ఉంటుంది. అయితే శనివారం జరిగిన ఘర్షణలో మాత్రం పోలీసులు మరీ ఫ్రెండ్లీ పోలీసుల్లాగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఆయుధాలతో దాడులకు దిగి భయానక వాతావరణాన్ని సృష్టించిన వారిపైన నామమాత్రపు కేసులతో అధికార పార్టీకి స్వామిభక్తిని చాటుకున్నారని వైసీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు.
పోలీసుల ఫ్రెండ్లీ వ్యవహారం ఏంటో..
లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వర్గీయుడు, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, చిన్నమండెం మండలానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి (ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్‌రెడ్డికి స్వయానా సోదరుడు) మధ్య ఓ స్థల వివాదంలో ఘర్షణ జరిగింది. దాదాపు పది నిమిషాల పాటు యథేచ్ఛగా ఇరువర్గాల వారు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో శ్రీనివాసులరెడ్డి వర్గీయులు పలువురు గాయపడ్డారు. ఇతడికి చెందిన వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. శ్రీనివాసులరెడ్డి తన లైసెన్స్డ్ రివాల్వర్‌ను అందరికీ కనిపించేలా నడుముకు కట్టుకుని హల్చల్ చేశాడు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి వందలాది మంది అనుచరులతో దాడికి దిగాడు. మొత్తం ఈ ఘర్షణ లక్కిరెడ్డిపల్లె పోలీసుల సమక్షంలోనే జరిగినా ఘర్షణను సద్దుమణిగించేలా పోలీసులు గట్టి చర్యలు తీసుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు.

ఘర్షణ ఎందుకు జరిగిందంటే.?
లక్కిరెడ్డిపల్లెలో సర్వే నెంబరు 718లో 1..28 సెంట్ల భూమిని షాజహాన్‌బాష, మహబూబ్‌బాషలు ఽహైదరాబాదులో ఉండే అహ్మద్‌బాషా దగ్గర 2011లో జీపీఏ చేయించుకున్నారు. ఈ స్థలాన్ని వీళ్లిద్దరూ 2012లో షకీల్ అహ్మద్‌కు అమ్మారు. అందులో నుంచి 23 సెంట్లను షకీల్ అహ్మద్ వేరే వారికి 2015లో అమ్మాడు. 2019లో మిగిలిన 1.05 ఎకరాలను శ్రీనివాసులరెడ్డికి అమ్మాడు. అయితే 2012లోనే అహ్మద్‌బాష జీపీఏను రద్దు చేయాలని, ఆ స్థలంలో ఎటువంటి రిజిస్ర్టేషన్లు కాకుండా అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. అయితే ఎందుకనో ఆ కేసును ఉపసంహరించుకున్నాడు. అదే అహ్మద్‌బాష 2022లో ఈ స్థలాన్ని ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి అనుచరులు నరసింహరాజు, సభాపతినాయుడులకు అమ్మాడు. వీరు ఆ వివాదాస్పద స్థలాన్ని చదును చేసి ప్లాట్లు వేసేందుకు సిద్ధం చేశారు.

ఈ విషయమై షాజహాన్ ఫిర్యాదు మేరకు లక్కిరెడ్డిపల్లె పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో అహ్మద్బాషపై కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో ఈనెల 4న లక్కిరెడ్డిపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో.. ఈనెల 9న జిల్లా ఐదవ అదనపు కోర్టులోనూ శ్రీనివాసులరెడ్డికి అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారమే శ్రీనివాసులరెడ్డి లక్కిరెడ్డిపల్లె పోలీసులకు తెలియజేసి శనివారం స్థలంలోకి వెళ్లి తన అనుచరులతో కలిసి స్థలాన్ని చదును చేస్తుండగా ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి వచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు సుమారు పది నిమిషాల పాటు రాళ్ల దాడి చేసుకున్నాయి. శ్రీనివాసులరెడ్డి ఆయుధాలు, అనుచరులతో వచ్చి స్థలంలో పనిచేస్తుండగా.. అడగడానికి వచ్చిన తమపై దాడి చేశారని సుదర్శనరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే కోర్టు ఉత్తర్వులు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ సుదర్శనరెడ్డి తన అనుచరులతో వచ్చి.. దాడి చేశాడని, తమ కార్లలో వాళ్లే ఆయుధాలు పెట్టారని శ్రీనివాసులరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు.. ఐపీసీ 146, 147, 427, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ రాజు తెలిపారు. అయితే పట్టపగలు ఇంత పెద్ద ఎత్తున రాళ్లు, ఆయుధాలతో దాడులు జరిగితే.. పోలీసులు బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టడం విశేషం. ఏది ఏమైనా అధికార పార్టీ నాయకులు స్థల వివాదంలో రోడ్డెక్కి దాడుల దాకా రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


