ముంపువాసుల సమస్యలు తక్షణం పరిష్కరించకుంటే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-05-14T05:47:15+05:30 IST

రాజంపేట మండలంలోని చెయ్యేరు వరద బాధిత ప్రాంతాలైన పులపత్తూరు, మందపల్లె తదితర ముంపు గ్రామస్తుల సమస్యలను తక్షణం పరిష్కరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ గిరీషా హెచ్చరించారు.

ముంపువాసుల సమస్యలు తక్షణం పరిష్కరించకుంటే చర్యలు తప్పవు
మందపల్లె, పులపత్తూరు జగనన్న ఇంటి నిర్మాణాల లేఅవుట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌

అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ గిరీషా హెచ్చరిక 


రాజంపేట, మే 13 : రాజంపేట మండలంలోని చెయ్యేరు వరద బాధిత ప్రాంతాలైన పులపత్తూరు, మందపల్లె తదితర ముంపు గ్రామస్తుల సమస్యలను తక్షణం పరిష్కరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ గిరీషా హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం మందపల్లె, పులపత్తూరు జగనన్న కాలనీని పరిశీలించారు. తదనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మండల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఆర్డీవో కోదండరామిరెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులపత్తూరు, మందపల్లె తదితర గ్రామాల్లో చేపట్టనున్న జగనన్న ఇంటి నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా, తక్షణం అక్కడ నీరు, విద్యుత్‌ లాంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ముంపు గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద వచ్చి ఆరు నెలలు అవుతోందని, వెంటనే మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. తాగునీటి బోర్లు, విద్యుత్‌ కనెక్షన్లు, ఇంటి నిర్మాణాలకు కావాల్సిన స్టీలు, సిమెంటు, ఇసుక, ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులు ఎప్పటికప్పుడు వారి ఖాతాలో జమ అయ్యే లా చర్యలు తీసుకోవాలన్నారు. మండల తహసీల్దారు, ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. 

 

 


 

 

Read more