-
-
Home » Andhra Pradesh » Guntur » guntur-NGTS-AndhraPradesh
-
కొలువుకు.. మెలిక!
ABN , First Publish Date - 2022-05-14T05:49:14+05:30 IST
నేషనల్ హెల్త్‌మిషన్ కింద వైద్యసేవలు అందించేందుకుగాను మిడ్ లెవెల్ హెల్త్ ప్రమోటర్స్(ఎంఎల్‌హెచ్‌పీ)ను ఎంపిక చేస్తారు.
సీనియారిటీ శాపానికి గురైన నర్సింగ్ గ్రాడ్యుయేట్లు
రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో అనర్హత వేటు
సీపీసీఎస్ కోర్సు ఉండాలంటూ ప్రభుత్వం షాక్!
2020కి ముందు పాసైనవారికి మొండిచేయి
నేషనల్ హెల్త్ మిషన్ పోస్టుల ఎంపికకు నిరాకరణ
గుంటూరు జోన్లో 1,650 మందిపై అనర్హత వేటు
967 పోస్టులకు 735 మందికే అవకాశం
ఒక్కో వర్గానికి ఒక్కో రూపంలో షాకులు ఇస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ నిరుద్యోగులకు కూడా షాక్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాల భర్తీలో పాత విధానాన్ని రద్దు చేసి, కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చి రాష్ట్రంలో వేలాది మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్ల తలరాతను మార్చేసింది. పాత నర్సింగ్ సిలబస్‌లో లేని సీపీసీఎస్ కోర్సు చేసి ఉండాలన్న అర్థరహిత నిబంధనతో సీనియర్ నర్సింగ్ అభ్యర్థులందరినీ ఉద్యోగావకాశాలకు దూరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సీనియర్లందరూ నేషనల్ హెల్త్ మిషన్ పోస్టుల ఎంపికకు అనర్హులుగా మిగిలిపోయారు. ఇలా ఒకరు.. ఇద్దరూ కాదు.. దరఖాస్తు చేసుకున్నవారిలో మూడొంతుల మంది ఈ నిర్ణయం కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఆవేదన చెందుతున్నారు.
గుంటూరు, మే 13(ఆంధ్రజ్యోతి): నేషనల్ హెల్త్‌మిషన్ కింద వైద్యసేవలు అందించేందుకుగాను మిడ్ లెవెల్ హెల్త్ ప్రమోటర్స్(ఎంఎల్‌హెచ్‌పీ)ను ఎంపిక చేస్తారు. వీరంతా గ్రామస్థాయిల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో నర్సింగ్ సేవలు అందిస్తుంటారు. 2018 నుంచి వీరి ఎంపిక జరుగుతుండగా అప్పటి టీడీపీ ప్రభుత్వం 3 సార్లు ఈ పోస్టులు భర్తీ చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కామన్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఆరునెలలపాటు సీపీసీఎస్ కోర్సును అందించి విధుల్లోకి తీసుకునేవారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి చెప్పింది. ప్రవేశ పరీక్షను కూడా రద్దు చేసింది. సీపీసీఎస్ కోర్సును తప్పనిసరి చేసి ఆ కోర్సు పూర్తి చేసినవారికి మాత్రమే ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించింది. ఈ విధానం కారణంగా కారణంగా 2020 సంవత్సరానికి ముందు బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థుల జీవితాలు తలకిందులైపోయాయి. 2020కి ముందు నర్సింగ్ కోర్సు సిలబస్‌లో సీపీసీఎస్ కోర్సు లేకపోవడంతో సీనియర్లంతా అనర్హులుగా మిగిలిపోయారు. 2019నుంచి నర్సింగ్ సిలబస్‌లో భాగంగా ఈ సీపీసీఎస్ కోర్సును పూర్తిచేసిన 2021, 2022 సంవత్సరాల ఫ్రెష్ అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్టులు దక్కుతున్నాయి.
జోన్- 3లో 1,650 మందికి అనర్హత
ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి 950 పోస్టులకుగానూ మూడు జిల్లాల నుంచి 2,400 మంది బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వీరిలో 1,650 మంది అభ్యర్థులు అనర్హులుగా మారారు. వీరికి ఎన్ని మంచి మార్కులు వచ్చినా.. ఎంత మెరిట్ ఉన్నా వీరంతా 2019కి ముదు నర్సింగ్ చేసినవారేనన్న ఒకే ఒక కారణంగా అనర్హుల జాబితాలోకి వెళ్లిపోయారు. వీరిలో 2012నాటికి నర్సింగ్ పూర్తయి అప్పటి నుంచి ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిర్భాగ్యులూ ఉన్నారు. కాగా 2020 తరువాత నర్సింగ్ చేసుకున్న అభ్యర్థి దరఖాస్తు చేసుకుంటే చాలు. ఉద్యోగం వచ్చేస్తోంది. జోన్- 3లోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న 967 పోస్టులకు 735 మంది మాత్రమే తొలి జాబితాలో అర్హత సాధించారు. ఒక వైపు పోస్టులు మిగిలిపోతున్నా, తమకు ఉద్యోగాలు రాకపోవడంతో సీనియర్ నర్సింగ్ గ్రాడ్యుయేట్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 2021 ఎంపికలోనూ ఈ విధానం కారణంగా వేలాదిమంది అనర్హత బారినపడ్డారు. దీంతో దరఖాస్తు చేసుకున్న అందరికీ అవకాశం కల్పించేలా ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజనీని నర్సింగ్ అభ్యర్థులు కలిసి విన్నవించుకున్నారు. కానీ ప్రయోజనం కనిపంచలేదు. దీంతో వారంతా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరుతున్నారు. నర్సింగ్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో పోరాటానికి సిద్ధమవుతున్నారు.
మేమేం పాపం చేశాం?
మేమేం పాపం చేశామని ఈ పోస్టులకు మేము అర్హులం కాకుండా పోయాం? సీనియారిటీ ఎవరికైనా వరమవుతుంది. కానీ మాకు శాపంగా మారింది. 2020కి ముందు నర్సింగ్ చేయడమే మేం చేసిన పాపమేమో! ఇప్పటికిప్పుడు కాలేజీ నుంచి బయటికి వచ్చిన వారికి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ మాకు రావడం లేదు.
- చిరుపల్లి రవీంద్ర, నర్సింగ్ అభ్యర్థి
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్తి తీసుకోవాలి..
ప్రభుత్వం అందరికీ మేలు చేయాలి. ప్రధానంగా సీనియర్లను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మేం అవకాశం కోల్పోయాం. కొన్ని వేలమందికి అన్యాయం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందరికీ అర్హత ప్రకటించి కొత్త జాబితా సిద్ధం చేయాలి.
- సాలన గురుమూర్తి, నర్సింగ్ అభ్యర్థి

