పేదలకు మంచినీళ్లిస్తే నేరమా?
ABN, First Publish Date - 2022-05-14T05:41:50+05:30
పేదలకు అతి తక్కువ ధరకు మినరల్ వాటర్ అందించడం నేరమా? అ ని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించా రు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఎన్టీఆర్ సుజల ప్లాంటు పునఃప్రారంభాన్ని
అడ్డుకున్న పోలీసులు
పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట
గాయపడిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు
చిలకలూరిపేట, మే 13: పేదలకు అతి తక్కువ ధరకు మినరల్ వాటర్ అందించడం నేరమా? అ ని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించా రు. పట్టణంలోని చెరువుల వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.7కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల ప్లాంటు పునఃప్రారంభానికి శుక్రవారం వెళ్లిన ప్రత్తిపాటిని, టీడీపీ కార్యకర్తలను పోలీసులు, ము నిసిపల్ అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు రూ.2కు 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందించాలనే ఉద్ధేశంతో ఎన్టీఆర్ ట్రస్టును ఒప్పించి రూ.7కోట్ల వ్యయంతో పట్టణ తాగునీటి చెరువుల వద్ద ఎన్టీఆర్ సుజల ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాంటును మూసివేశారని అ న్నారు. ఎన్టీఆర్ ట్రస్టుతో 33 సంవత్సరాలపాటు ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్లాంటుకు మునిసిపాలిటీవారు నీరు ఇవ్వాలన్నారు. ఇటీవల ప్లాంటును పునరుద్ధరించడానికి సొంత నిధులు వెచ్చించి మరమ్మతులు చేయించినట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందనే దు రాలోచనతో మంత్రి రజిని అండదండలతో పోలీసు లు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. కోర్టును ఆశ్రయించి ప్లాంటును పునరుద్ధరించి పేదలకు అతితక్కువ ధరకు మినరల్ వాటర్ అందిస్తానని చెప్పారు.
కార్యకర్తలకు గాయాలు
ఎన్టీఆర్ సుజల ప్లాంటు ప్రారంభోత్సవానికి మాజీమంత్రి ప్రత్తిపాటితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. చిలకలూరిపేట అర్బన్ సీఐ జి.రాజేశ్వరరావు, రూరల్ సీఐ ఎం.సుబ్బారావుల ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, టీపీఎస్ సునీత, ఏఈ కోటేశ్వరరావు, మునిసిపల్ ఆర్వో ఫణికుమార్‌లు వారిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి పోలీసుల తీరును దుయ్యబట్టారు. తోపులాటలోనే ప్రత్తిపాటి పుల్లారావు ప్లాంటు లోపలకి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చారు. ఈ క్రమంలో పోపూరి చందు అనే టీడీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మరికొందరు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. కాగా శుక్రవారం ఎన్టీఆర్ సుజల ప్లాంటు పునఃప్రారంభం చేస్తున్నారని తెలుసుకున్న అధికారులు గురువారం రాత్రే ఎన్టీఆర్ ట్రస్టు ప్రతినిధులకు నోటీసులు అందించారు. వాల్టా చట్టం ప్రకారం అనుమతి లేకుండా అనధికారికంగా బోర్లు వేశారని, తక్షణమే తదుపరి పనులు నిలిపివేయాలని నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ కరిముల్లా, చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్‌ఖాన్, మూడు మండలాల టీడీపీ అధ్యక్షులు జవ్వాజి మదన్, ముద్దన నాగేశ్వరరావు, బండారుపల్లి సత్యనారాయణ, ఇనగంటి జగదీష్, గంగా శ్రీనివాసరావు, జవ్వాజి బుచ్చిబాబు, జరీనాసుల్తానా తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.