భక్తజన సంద్రం.. అమరేశ్వరుని రథోత్సవం
ABN, First Publish Date - 2022-03-03T05:22:25+05:30
పంచారామాల్లో ప్రథమ ఆరామంగా విరాజిల్లుతున్న అమరావతిలో బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్యరథోత్సవం బుధవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది.
అమరావతి, మార్చి 2: పంచారామాల్లో ప్రథమ ఆరామంగా విరాజిల్లుతున్న అమరావతిలో బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్యరథోత్సవం బుధవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన దివ్యరథంపై స్వామివారు కొలువు దీరగా సాయంత్రం వరకు ప్రధాన వీధిలో రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రారంభానికి ముందుగా నిత్యఔపోసన, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. రహదారికి ఇరు వైపుల వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకిస్తూ శివనామస్మరణ చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కొలువుదీరిని బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వార్లను భక్తులు తిలకించి తన్మయత్వం పొందారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు టెంకాయ కొట్టి రథాన్ని ప్రారంభించారు. ఈవో సునీల్‌కుమార్, డీఎస్పీ పోతురాజు ఉత్సవాలను పర్యవేక్షించారు.