ఒత్తిళ్లా.. వేధింపులా..
ABN, First Publish Date - 2022-05-14T07:05:27+05:30
అతనొక ఎస్‌ఐ.. విధి నిర్వహణ లో ఒత్తిళ్లో, వేధింపులో లేక ఇంకా ఏ సమస్యలైనా ఉన్నాయో తెలియదు కానీ.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన కాకినాడ జిల్లాలో పెను సంచలనం సృష్టించింది.
- కాకినాడలో సర్పవరం ఎస్‌ఐ గోపాలకృష్ణ బలవన్మరణం
- తెల్లవారుజామున ఇంట్లో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య
- సీఎం బందోబస్తు ట్రైల్‌రన్ కోసం వెళ్లి నిన్న రాత్రి ఇంటికి రాక
- తెల్లవారుజామున గన్‌తో పేల్చుకున్న గోపాలకృష్ణ.. అక్కడికక్కడే మృతి.. కుడి కణతినుంచి ఎడమ కణితి బయటకు వచ్చిన బుల్లెట్
- సరైన పోస్టింగ్ ఇవ్వకుండా వేధించినట్లు ఆరోపణలు
- బదిలీపై వెళ్లిపోయిన ఓ సీఐ దూషణలతో తీవ్ర మనస్తాపం
- ఆ తర్వాత మరో సీఐదీ ఇదే తీరు
- అవమానాలు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం
- ఇల్లు, జీజీహెచ్ వద్ద పోలీసు వలయం
- మిస్టరీగా మారిన మృతి.. నిష్పాక్షిక దర్యాప్తుపై అనుమానం
- కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య, సోదరుడు, తండ్రి
- దర్యాప్తు అధికారిగా ఎస్‌బీ డీఎస్పీ నియామకం
అతనొక ఎస్‌ఐ.. విధి నిర్వహణ లో ఒత్తిళ్లో, వేధింపులో లేక ఇంకా ఏ సమస్యలైనా ఉన్నాయో తెలియదు కానీ.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన కాకినాడ జిల్లాలో పెను సంచలనం సృష్టించింది. పోలీస్ డిపార్టుమెంట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. డైరీలో ఎస్‌ఐ రాసుకున్న అంశాల ప్రకారం అతడికి ఉద్యోగం ఇష్టంలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)/కాకినాడక్రైం/సర్పవరం:
ఎంత కష్టం వచ్చిందో ఏమో.. మంచి ఉద్యోగం.. భార్య.. ఇద్దరు పిల్లలు.. కానీ ఏదో బాధ.. మనసులో ఆవేదన.. ఆందోళన.. విధి నిర్వహణలో మింగుడు పడని బాధలు.. ఏదో సాధించాలనే తపనకు కొందరు సామాజికవర్గ సాకు చూపించి బ్రేకులు.. వెరసి ధైర్యం కోల్పోయాడు.. మానసికంగా కుంగిపోయాడు.. చివరకు నిస్సహాయంగా మారాడు.. అంతే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ముత్తవరపు గోపాలకృష్ణ(32) రివాల్వర్‌తో కాల్చుకుని శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. కుడి కణితిపై గన్ గురిపెట్టుకుని పేల్చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా పోలీసుశాఖలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.
ఒక్కసారిగా భారీ శబ్ధం...
కాకినాడ డీసీసీబీ బ్యాంకు వెనుక ఓ అపార్టుమెంట్ మొదటి ఫ్లోర్‌లో ఎస్‌ఐ గోపాలకృష్ణ నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. సర్పవరం స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న గోపాలకృష్ణకు పోలీస్ బాస్‌లు గురువారం ముమ్మిడివరం డ్యూటీ వేశారు. శుక్రవారం సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో ముందురోజు కాన్వాయ్ ట్రయిల్ రన్‌కు పంపారు. సర్వీసు రివాల్వర్ కూడా ఇచ్చారు. దీంతో విధులు ముగించుకుని గో పాలకృష్ణ గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. తిరిగి శుక్రవారం డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఈలోపు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల స మయంలో సర్వీసు పిస్టల్‌తో కుడి కణతపై కాల్చుకున్నాడు. దీంతో అక్క డికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ శబ్ధానికి ఉలిక్కిపడి నిద్ర లేచిన భార్య పావని వరండాలోకి వచ్చిచూడగా తీవ్ర రక్తస్రావంతో కొన ఊపిరితో పడి ఉన్న భర్తను చూసి షాక్‌కు గురైంది. వెంటనే 108, పోలీసులకు సమాచారం ఇవ్వగా సమీపంలోని ఇనోదయా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే గోపాలకృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
ట్రైనీ ఎస్‌ఐగా ప్రారంభమై..
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన ము త్తవరపు గోపాలకృష్ణది 2014 ఎస్‌ఐ బ్యాచ్. ట్రైనీ ఎస్‌ఐగా తొలుత గొల్లప్రోలులో పనిచేశారు. ఆ తర్వాత డొంకరాయి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐగా తొలి పోస్టింగ్ పొందారు. అక్కడినుంచి బదిలీపై సర్పవరం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ గా, రాజోలు ఎస్‌ఐగా పనిచేశారు. తిరిగి బదిలీపై కాకినాడ ఎస్‌ఈబీలో పనిచేసి అక్కడినుంచి కాకినాడ ట్రాఫిక్-2 ఎస్‌ఐగా పనిచేశారు. అనం తరం గతేడాది సెప్టెంబరులో సర్పవరం ఎస్‌ఐగా విధుల్లోచేరారు. 2017లో ఖమ్మం జిల్లా కొంగరకు చెందిన పావనితో ఆయనకు వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల పాప భవిష్య, రెండేళ్ల బాలుడు శర్వన్‌లు ఉన్నారు.
ఆత్మహత్యకు కారణం ఎవరు..?
గోపాలకృష్ణ పనిచేస్తున్న స్టేషన్‌లో విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి, కొందరు ఉన్నతాధికారుల వేధింపులు, కోరుకున్న పోలీస్‌స్టేషన్‌కి బదిలీ కాకపోవడం వంటి కారణాలతో కొంతకాలంగా మనస్తాపానికి లోనయ్యా రు. తనకంటే జూనియర్లకు కోరుకున్న స్టేషన్‌కు పోస్టింగ్‌లు వస్తున్నాయని, తనను వేరే ఎస్‌హెచ్‌వో కింద ఎస్‌ఐగా ఉంచడంపై తరచూ ఆవేదన వ్యక్తం చేసేవారని సన్నిహితులు తెలిపారు. జిల్లాకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారికి సన్నిహితంగా ఉండి ఇటీ వల బదిలీపై వెళ్లిన ఓ సీఐ గోపాలకృష్ణతో దురుసుగా వ్యవ హరించడం, మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడంపై ఎస్‌ఐ మనస్తాపానికి గురైనట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. సున్నిత మనస్తత్వంగల గోపాలకృష్ణను అకారణంగా ఆ సీఐ దూషించడంతో తట్టుకోలేకపోయారని, తరచూ ఇదే విషయాన్ని పదే పదే సహచరులు, సన్నిహితులు, కుటుంబసభ్యుల వద్ద చెప్పి బాధపడేవారని పలువురు పేర్కొంటున్నారు. మరో సీఐ కూడా ఇదే తరహా ఇబ్బందులకు గురిచేయడంతో తట్టు కోలేక ఇలా చేశాడని పోలీసువర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెలవు కావాలని కోరినా ఉన్నతాధికారులు ఇవ్వకుండా వేధించడం, తీవ్ర పనిభారంతో బాధపడుతున్నానని గోపాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేసేవాడని సన్నిహితులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మానసిక వ్యధ, ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.
మీడియాను అడ్డుకున్న పోలీసులు
ఆత్మహత్య సమాచారం తెలిసిన వెంటనే మీడియా సంఘటనా స్థలానికి చేరుకుని ఫోటోలు తీయడం, కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ప్ర యత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటికి బయట గడియ పెట్టే శా రు. మృతుడి భార్య, కుటుంబసభ్యులతో ఏం జరిగిందనే దాని పై తెలుసుకునేందుకు ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు. జీజీ హెచ్‌వద్ద కూడా పోలీసు పహారాతో ఎవరినీ లోపలకు పంపలేదు. దీంతో ఆత్మహత్య వెనుక బాస్‌ల ఒత్తిళ్లు, వేధింపులు ఎక్కడ బయట పడిపోతాయోనన్న భయంతోనే ఇలా చేస్తున్నారనే అనుమానాలకు తావిచ్చినట్లయింది.
పోలీసులు అలా.. కుటుంబీకులు ఇలా..
సంఘటనా స్థలానికి వచ్చిన ఏఎస్పీ(అడ్మిన్) పి.శ్రీనివాస్, డీఎస్పీ వి.భీ మారావు సైతం ఎస్‌ఐ ఆత్మహత్యకుగల కారణాలను వెల్లడించేందుకు తొ లుత అంగీకరించలేదు. చివరకు మీడియా ఒత్తిడితో ఎస్‌ఐ ఎంసీఏ చదువుకున్నాడని, సున్నిత మనస్తత్వం కలిగిన ఆయన తనకు ఎస్‌ఐ ఉద్యోగం పనికిరాదు, కుటుంబం, పిల్లల నేపథ్యంలో పోలీసు ఉద్యోగం చేయాల్సి వ స్తోందని సూసైడ్ నోట్‌లో రాసినట్లు విలేకరులకు వివరించారు. జీజీహెచ్ వద్ద ఎస్పీ మాట్లాడుతూ ఎంసీఏ విద్యనభ్యసించిన గోపాలకృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, వ్యాపారం చేయాలని భావించేవారని, సున్నిత మనస్తత్వం కలిగిన తనకు పోలీసు జాబ్ సరిపోదని ఆ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు డైరీలో పేర్కొన్నారని వివరించారు. ఆ రాత ఆయనదా కాదా నిర్ధా రిస్తామన్నారు. ఎస్‌ఐ రాసినట్లు చెప్పిన సూసైడ్ నోట్ చూపించాలని కోరి తే కుదరదన్నారు. పోలీసులు చెప్పిన కారణాలకు భిన్నంగా గోపాలకృష్ణ కుటుంబసభ్యులు స్పందించారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. గోపాలకృష్ణ చిన్నప్పటినుంచి పోలీసు ఉద్యోగం కావాలనే కోరికతో కష్టపడి చదివి ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడని సోదరుడు వెంకటేశ్వరరావు రోధిస్తూ వివరించారు.
వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య : ఎస్పీ రవీంద్రనాథ్
గోపాలకృష్ణ ఆత్మహత్య వెనుక వ్యక్తిగత కారణాలే తప్ప అధికారులనుంచి ఎటువంటి ఒత్తిడి, వేధింపులు లేవని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు విలేకరులకు తెలిపారు. వేధింపులు ఉన్నాయని పేర్కొనడం అవాస్తవమన్నారు. మృతుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయ్యాలన్న ఆకాంక్ష మొదటినుంచి ఉండడంవల్ల ఎస్‌ఐ ఉద్యోగం ఇష్టం లేక మనస్తాపానికి గురవ్వడంతో ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. విధినిర్వహణలో గోపాలకృష్ణ పారదర్శకంగా పనిచేసేవాడని, సౌమ్యుడిగా పేరు ఉందన్నారు. అతడి మృతి పోలీస్‌శాఖకు తీరని లోటన్నారు. బాఽధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని, పారదర్శక దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఎస్‌బీ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావును నియమించినట్లు తెలిపారు.
పోలీసు కావాలని కష్టపడ్డాడు: తండ్రి
తన రెండో కుమారుడు ఎస్‌ఐ ఉద్యోగం చేయా లన్న లక్ష్యంతో కష్టించి ఎంసీఏ వరకు చదివినట్లు తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు ఉద్యోగమంటే తన కుమారుడికి ప్రాణమన్నారు. తొలుత కానిస్టేబుల్ పోస్ట్ వచ్చినా అది చేరకుండా ఎస్‌ఐ అవ్వాలని ప్రయత్నించాడన్నారు. వీఆర్వో పోస్ట్‌కు మంచి ర్యాంకు వచ్చిందని, ఈ ఉద్యోగం ఏడాది చేసి ఎస్‌ఐగా ఎంపికవడంతో వీఆర్వో ఉద్యోగం వదిలేసి ఎస్‌ఐ గా పోలీసుశాఖలో చేరాడన్నారు. ఉద్యోగ రీత్యా కొన్ని ఒత్తిళ్లు ఉన్నట్లు చెప్పేవాడన్నా రు. పోలీసులు ఎస్‌ఐ ఉద్యోగం ఇష్టంలేదని చెప్పడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలకృష్ణ నెలరోజులుగా మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీసులు చెప్పడం తమకు తెలియదని, తన కుమారుడి ఆత్మహత్యపై పోలీసు అధికారులు ఎందుకు ఇలా చెబుతున్నారో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
పోలీసు పహారా మధ్య పోస్టుమార్టం పూర్తి
కాకినాడ క్రైం, మే 13: సర్పవరం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ గోపాలకృష్ణ(32) ఆత్మహత్యకు సంఘటనపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన జరిగిన కొద్దినిమిషాల్లోనే పోలీస్ అధికారులు మృతదేహాన్ని హుటాహుటిన జీజీహెచ్ మా ర్చురీకి తరలించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పోస్ట్‌మార్టం పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు ఫోరెన్సిక్ విభాగంవద్ద హైడ్రామా కొనసాగింది. ప్రత్యేక బలగాల మోహరింపు మధ్య అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మీడియాను అనుమతించకపోవడంతో మీడియా ప్రతినిధులు ఉదయం నుంచి శవపంచనామా పూర్తయ్యే వరకు ఎండలో వేచి ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు గోప్యత పాటించడడం అనుమానాలకు తావిస్తోంది. మార్చురీ వద్దకు ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజు, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వచ్చి ఉదయం నుంచి పోస్ట్‌మార్టమ్ పూర్తి చేసే వరకు నిరీక్షించడం కొసమెరుపు.
మృతదేహం కృష్ణాజిల్లా నవాబ్‌పేట తరలింపు
కాకినాడ క్రైం, మే 13: గోపాలకృష్ణ కుటుంబసభ్యులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన ఎస్‌ఐ ఎం.గోపాలకృష్ణ మృతదేహానికి ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజుతో కలసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కృష్ణా జిల్లా నవాబ్‌పేట గ్రామానికి ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాస్, కొంతమంది సహచర ఎస్‌ఐల ఆధ్వర్యంలో తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గోపాలకృష్ణ మృతి ఘటనలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావును ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించామన్నారు. మృతుడి భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని కోణాల్లో కేసును విచారిస్తామన్నారు. ఆత్మహత్య వ్యవహారంలో తప్పుడు ప్రచారం నిర్వహించరాదనితెలిపారు. అంత్యక్రియల నిమిత్తం రూ.25వేలను తండ్రికి అందజేశామన్నారు.