ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో క్రికెట్‌ స్టేడియం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-14T06:58:41+05:30 IST

నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల క్రీడామైదానంలో క్రికెట్‌ స్టేడియం నిర్మించాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం, కాంగ్రెస్‌, జనసేన, బీజేపీ, సీపీఎం, ఇతర ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో  క్రికెట్‌ స్టేడియం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ హర్షకుమార్‌, పక్కన గన్ని కృష్ణ, కందుల దుర్గేష్‌

 వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకుల డిమాండు

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 13 : నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల క్రీడామైదానంలో క్రికెట్‌ స్టేడియం నిర్మించాలనే  నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం, కాంగ్రెస్‌, జనసేన, బీజేపీ, సీపీఎం, ఇతర ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సిటీ బయట, ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బంది లేని ప్రాంతంలో స్టేడియం నిర్మించాలని, కేవలం రూ.12 కోట్లతో స్టేడియం కట్టేస్తామంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఆర్ట్స్‌ కళాశాల ఆస్తులు పరిరక్షించాలని కోరుతూ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నాయకుడు జీవీ హర్షకుమార్‌ మాట్లాడుతూ చరిత్రకల్గిన, ఎందరో మహానుభావులు చదివిన ఆర్ట్స్‌ కళాశాల అభివృద్ధికి అడ్డుపడుతూ క్రికెట్‌ స్టేడియం నిర్మించాలనే ఆలోచన చేయడం దురదృష్టకరమన్నారు. స్టేడియంలు ఊరికి దూరంగా ఉంటే ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండదని, చిన్న స్థలంలో స్టేడియం నిర్మిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఎయిర్‌పోర్టు, రిజర్వు ఫారెస్టుకు చెందిన వందల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ భూములు లేకపోతే కొనుగోలు చేసి అక్కడ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టేడియం నిర్మించవచ్చన్నారు. వారం రోజుల్లో స్టేడియం నిర్మాణం ఆలోచన వెనక్కి తీసుకోకపోతే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరం అభివృద్ధి చేస్తున్నామంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గొప్పలకు పోతున్నారని, ఊరికి మధ్య క్రికెట్‌ స్టేడియం నిర్మించాలనే ఆలోచన తెలివి తక్కువతనమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాసు (వాసు) మాట్లాడుతూ కాలేజ్‌ గ్రౌండు పరిరక్షించుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తామని, పోలీసు కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మించాలనే ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఆర్ట్స్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముళ్ల మాధవ్‌ మాట్లాడుతూ కళాశాలలో క్రికెట్‌ స్టేడియం వద్దని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగిందని తెలిపారు. శాప్‌ మాజీ డైరెక్టర్‌, టీడీపీ నేత యర్రా వేణు, బీజేపీ నాయకులు ఎనుముల రంగబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, జీవీ శ్రీరాజ్‌, కృష్ణకుమార్‌, బి.పవన్‌, పూర్వవిద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. సంఘం ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్‌ఆర్‌ భార్గవ్‌, ప్రధాన కార్యదర్శి గద్దే సుధాకర్‌, పి.రాజ్‌కుమార్‌బాబు, ఎస్‌.నాగరాజు, ఎస్‌.సుబ్రహ్మణ్యం, కె.గౌరీశంకర్‌, ఎస్‌.ఆనంద్‌కుమార్‌, అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు.



Read more