గడపగడప ఎక్కాలా..
ABN, First Publish Date - 2022-05-14T06:56:04+05:30
‘గడపగడపకూ మన ప్రభుత్వం’ అంటూ సీఎం జగన్ బొమ్మతో ఉన్న ఓ బుక్‌లెట్ పట్టుకుని గడపగడపకూ వెళ్లాలంటే వైసీపీ కేడర్ జంకుతోంది.
వైసీపీలో గందరగోళం
కేడర్‌లో నైరాశ్యం
ప్రజావ్యతిరేకతతో ఇబ్బందులు
సీఎం బొమ్మతో ఓ బుక్‌లెట్ పంపిణీకి ఏర్పాట్లు
రాజమహేంద్రవరం సిటీలోకేడర్‌తోనేడు ఎంపీ ,ఎమ్మెల్యేల సమావేశం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
‘గడపగడపకూ మన ప్రభుత్వం’ అంటూ సీఎం జగన్ బొమ్మతో ఉన్న ఓ బుక్‌లెట్ పట్టుకుని గడపగడపకూ వెళ్లాలంటే వైసీపీ కేడర్ జంకుతోంది. కానీ వివిధ సంక్షేమ పథకాలతో ప్రభుత్వం పంపించిన బుక్‌లెట్‌ను ఇంటింటికీ కచ్చితంగా పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉండడంతో కేడర్ రాకున్నా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను కలుపుకుని ఈ పంపిణీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. సచివాలయాల్లో కేవలం డిజిటల్ అసిస్టెంట్ ఒకరు మాత్రమే ఉంటారు. వెల్ఫే ర్ అసిస్టెంట్ రైతు భరోసా కేంద్రాల్లో ఉంటారు. మిగతా సచివాలయ ఉద్యోగులంతా ఇక గడపగడప తొక్కవలసిందే. ప్రతీరోజూ ఒక నియోజకవర్గంలో ఏదొక పంచాయతీ పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించాలి. అక్కడ కనీసం 100 నుంచి 200 ఇళ్ల వరకూ తిరగాలి. ఇప్పటివరకూ ఒక్కోచోట మాత్రమే లాంఛనంగా ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జగన్ బొమ్మతో తయారుచేసిన సంక్షేమ పథకాల బుక్‌లెట్ లేకుండా ఎవరూ ఒట్టిచేతుల్తో గడపగడపకూ వెళ్లవొద్దనే ఆదే శాలు కూడా వచ్చాయి. అదే సమయంలో శుక్రవారం సా యంత్రం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు బుక్‌లెట్‌లు పంపిణీ చేశారు. కొవ్వూరులో హోంశాఖమంత్రి తానేటి వనిత బుక్‌లెట్లతో కార్యక్రమం చేశారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాత్రం మొదటిరోజు నుంచి గడపగడపకూ వెళుతున్నారు. మిగతా చోట్ల ఎమ్మెల్యేలు ఒకటీ, రెండు చోట్లకు మాత్రమే వెళ్లారు. ఇక సోమవారం నుంచి అందరూ కచ్చితంగా వెళ్లాలనే ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేడర్ చాలామంది నిర్లక్ష్యానికి గురయ్యారు. ఇసుక, కొండలు, మట్టి చెరువులు తదితర అంశాలు ఉన్న చోట్ల కొంతమందికి లబ్ధి ఉంది కానీ, మిగతాచోట్ల ఎవరినీ పట్టించుకోలేదు. దీంతో వైసీపీలో గ్రామస్థాయి నుంచి గ్రూపు లు మొదలయ్యాయి. నియోజకవర్గస్థాయి నేతలకో, ఎమ్మెల్యే లు, ఎంపీలకో దగ్గరగా ఉన్నవారిమాట మాత్రమే కొంత చెల్లుబాటు అవుతోంది. ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో నూ, వార్డుల్లోనూ ఒకరితోనో ఇద్దరితోనూ సంబంధాలు పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. దీంతో కేడర్ పట్టించుకోవడంలేదు. ఈ పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది. అందుకే గడపగడప కార్యక్రమానికి ఉత్సాహంగా కార్యకర్తలెవరూ రావడంలేదు. దాంతో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతోపాటు ఎమ్మెల్యే, ఎంపీల వెంట ఇతర చైర్మన్ల అనుచరులు కొంతమంది వస్తు న్నారు. లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని, నేతలు ముందుకు వెళ్లవలసి వస్తోంది. ప్రస్తుతం గడప తొక్కిన చోటల్లా మొహమాటంతో మాట్లాడుతున్నారు. కొందరు మహిళలు అయితే ముఖం మీదే కడిగేస్తున్నారు. ఏమి సాధించారని, వస్తున్నారని అడుగుతున్నారు. జగనన్న పేరుతో పెట్టిన సంక్షేమ పథకాల కోసం వివరిస్తే ఆ పథకాల్లో తమ పేరు తీసేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఏదొక విధంగా ఈ గండం గట్టెక్కితే బావుండననే భావనలో నేతలు ఉన్నారు.
రాజమహేంద్రవరంలో గ్రూపులే..
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో మొదటి నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల గ్రూపులు ఉన్నాయి. ఇటీవల గట్టిగా అఽధిష్ఠానం నుంచి హెచ్చరికలు రావడం, ఇద్దరికీ జిల్లా స్థాయిలో బాధ్యతలుండడం వల్ల ఇటీవల రీజినల్ కోఆర్డినేటర్లు మిథున్‌రెడ్డి, బోసు వచ్చినప్పుడు కలిసి ఉన్నారు. ఇక రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి సాహసం చేసిన తన వార్డులో ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం మొద లుపెట్టారు. దానికి ఎంపీ భరత్ హాజరయ్యారు. కానీ ఎమ్మె ల్యే రాజా రాలేదు. ఆయన అనుచరులూ హాజరుకాలేదు. సిటీ లో ఇంకా ముఖ్యనేతలైన ఏపీఐఐసీ మాజీ చైర్మన్, మాజీ కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం చాలాకాలం నుంచి దూరంగా ఉన్నారు. మిఽథున్‌రెడ్డి, బోసు వచ్చినప్పుడు ఆయన కలవలేదు. సిటీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కార్యక్రమాల కు రావడం లేదు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అప్పుడప్పుడూ వస్తూ ఉంటారు. ఆయనకూ సరైన గుర్తింపు లేదు. సిటీ ప్రెసిడెంట్ నందెపు శ్రీను మీరంతా ఐక్యంగా ఉం టే, నేనూ మీ వెంటే అన్నట్టు ఉంటారు. ఈ పరిస్థితుల్లో చెరుకూరి కల్యాణ మండపంలో శనివారం సిటీ కార్యకర్తల సమావేశం ఉంది. దానికి ఎంపీ, ఎమ్మెల్యే హాజరవుతున్నారు. మిగ తా నేతలకు కూడా ఆహ్వానం పంపినట్టు సిటీ ప్రెసిడెంట్ నందెపు శ్రీనివాస్ తెలిపారు. కానీ ఈ సమావేశానికి ఎవరు వస్తారు, ఎవరురారు, ఎవరు కలిసి ఉంటారో తేలుతుంది.