బిల్లుల షాక్!
ABN, First Publish Date - 2022-05-14T06:51:09+05:30
విద్యుత్ చార్జీలతో బాదుడు ప్రభావం ఈనెలలో బాగా కనిపించింది. అసలు ఎండా కాలం కావడంతోపాటు చార్జీలు బాగా పెంచడం వల్ల ఈనెల 1వ తేదీ నుంచి తీస్తున్న రీడింగ్‌నుబట్టి బిల్లులు భారీగా వస్తున్నాయి.
విద్యుత్ చార్జీల పెంపు వినియోగదారులకు ప్రత్యక్షంగా తెలిసివచ్చింది. ఈనెల ఒకటో తేదీ నుంచి తీస్తున్న రీడింగ్‌లతో బిల్లులు అందుకున్న ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గత మూడు రోజులుగా ‘గడపగడప’కు వస్తున్న ఎమ్మెల్యేలకూ దీని సెగ తగులుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడకు వెళ్లినా.. తమ కరెంటు బిల్లులు ఎన్నడూ లేనివిధంగా ఘోరంగా పెరిగిపోయాయని వారితో చెప్పి వాపోతున్నారు. ఇదేం దారుణమని ఎమ్మెల్యేలను కొందరు మహిళలు నిలదీస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలో అర్థంకాక మరోఅంశం మీదకు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
అసలే ఎండాకాలం.. దానికితోడు చార్జీల మోతతో భారం
ఉమ్మడి తూగోజీలో మార్చి నెలలో రూ.194 .48 కోట్ల ఆదాయం
ఏప్రిల్‌లో 218.85 కోట్లు.. ఈనెలలో బిల్లులు ఇంకా తీస్తున్నారు..
వస్తున్న బిల్లులు చూస్తే గుండెగుభేల్.. తుఫాన్‌తో తగ్గిన వినియోగం
ఈనెల 8న జిల్లాలో 15.79 మిలియన్ యూనిట్ల వినియోగం
12న 11.48 మిలియన్ యూనిట్ల వినియోగం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
విద్యుత్ చార్జీలతో బాదుడు ప్రభావం ఈనెలలో బాగా కనిపించింది. అసలు ఎండా కాలం కావడంతోపాటు చార్జీలు బాగా పెంచడం వల్ల ఈనెల 1వ తేదీ నుంచి తీస్తున్న రీడింగ్‌నుబట్టి బిల్లులు భారీగా వస్తున్నాయి. కొందరికి రెండు రెట్లు, కొందరికి మూడు రెట్లు చార్జీలతో బిల్లులు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఎండలతో ఒకపక్క ఎక్కువ విద్యుత్ కోతలు ఉన్నాయి. అసాని తుఫాన్ ప్రభావంతో వాతావరణం చల్లబడడం వల్ల విద్యుత్ కోతలు తగ్గాయి. కానీ తుఫాన్ వల్ల వచ్చిన గాలులు, వానల వల్ల వందలాది విద్యుత్ స్తంభాలు, చెట్లు పడిపోవడంతో కొన్ని రోజులు అంధకారం నెలకొంది. ప్రస్తుతం సరఫరా బాగానే ఉంది. గ్రామాల్లో ఇంకా అక్కడక్కడా కోతలు ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం నిజం కాదంటున్నారు. చెట్లు పడిపోవడం, వార్షిక తనిఖీల వల్ల ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది తాత్కాలికమేనని, ప్రస్తుతం వినియోగం తగ్గడం వల్ల సరఫరాకు ఇబ్బంది లేందని అంటున్నారు. గత రెండు నెలల్లో విద్యుత్ బిల్లుల ఆదాయం చూస్తే ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మార్చి నెలలో రీడింగ్ తీయడం వల్ల వచ్చిన ఆదాయం రూ.194.48 కోట్లు. అదే ఏప్రిల్‌లో ఏకంగా రూ.218.85 కోట్లకు చేరింది. అంటే సుమారు రూ.24 కోట్ల పెరిగింది. జిల్లా వినియోగదారుల మీదే ఈ భారం పడింది. మే నెలలో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా. ఈనెల 1వ తేదీ నుంచి తీస్తున్న రీడింగ్‌ల బట్టి, అందరి బిల్లులు మోత మోగుతున్నాయి. మూడు రెట్లు కూడా వస్తున్నట్టు చెబుతున్నారు. ఈసారి ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎండకాలం కాబట్టి వినియోగం ఎక్కువ ఉంటుంది. దానికి తోడు శ్లాబ్‌ల విధానంలో విద్యుత్ చార్జీలు బాదేస్తే, ఎలా బతకాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైసీసీ గడపగడపకు కార్యక్రమంలో ఈ సమస్యలు అధికంగా ఎదురవుతుండడంతో నాయకులు నీళ్లు నములుతున్నారు. వానల వల్ల వాతావరణం చల్లబడింది. ఎండలు మాయమయ్యాయి. దీంతో జనం కూడా విద్యుత్ వాడకం తగ్గించారు. ఏసీలు చాలావరకూ ఆపేశారు. ఈనెల 8వ తేదీన జిల్లాలో 15.70 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. అదే 12వ తేదీన 11.48 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగించా రు. అంటే సుమారు 4 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. కానీ ఇది తా త్కాలికమే. వానలు తగ్గిపోవడంతో ఎండలు పెరుగుతున్నాయి. జూన్ నెలలో కూడా కొంతవరకూ ఎండలు ఉండే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో మరింత విద్యుత్ వినియోగం ఉంటుంది. అసలే చార్జీలు పెరగడం వల్ల ఇబ్బందిపడుతున్న ప్రజలకు, వినియోగం పెరగడంతో శ్లాబ్ తేడాల వల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోనున్నాయి.
రూ.200లోపు కట్టేవాళ్లం..
ఇప్పుడు రూ.860 బిల్లు వేశారు
గతంలో ఎప్పుడూ లేనివిధంగా కరెంట్ బిల్లు వచ్చింది. మా ఇంట్లో ప్రిజ్ కానీ, ఏసీగానీ లేదు. ఇప్పటివరకు రూ.160 నుంచి రూ.200 లోపు కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పుడు మాత్రం ఏకంగా రూ.860 బిల్లు వచ్చింది. అదేమంటే చార్జీలు పెంచారని రీటింగ్ తీసేవాళ్లు చెప్తుతున్నారు. కూలీ పనిచేసుకునే మాలాంటి వాళ్లకు ఒకేసారి ఇంతంత బిల్లులు వస్తే ఎలా బతకాలి. వైసీపీకి ఓట్లేసి గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాలాంటి సామాన్యులకు బతకడం కష్టంగా మారింది.
- ఎ.వీరబాబు, తూర్పుగోనగూడెం (రాజానగరం)
400లోపు వచ్చేది.. రూ.907 వచ్చింది..
నా పేరు అల్లక సుబ్రహ్మణ్యం. చేనేత కుటుంబం. మాది డియం మండలం వీరవరం. ప్రస్తుతం చేనేత పరిశ్రమ అంతంత మాత్రంగా ఉంది. పెరిగిన పప్పులు, నూనెలు వంటి నిత్యావసరాల సరుకుల ధరలతో జీవనం సాగించడం కష్టంగా ఉంది. దీనికితోడు విద్యుత్ చార్జీలు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో మాకు విద్యుత్ బిల్లు రూ.400లోపు వచ్చేది. ప్రస్తుతం రూ.907 వచ్చింది. ఎలా ఈ బిల్లులు కట్టాలి? ఎలా జీవనం సాగించాలి? విద్యుత్ బిల్లుల పెంపు సామాన్యులకు పెనుభారంగా మారింది.
- అల్లక సుబ్రహ్మణ్యం, వీరవరం (కడియం)
పెరిగిన బిల్లులు ఎలా కట్టగలం?
నిత్యావసరాల ధరలు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యుత్ చార్జీల భారం వేయడం అన్యాయం. గత నెలలో రూ.800 వచ్చిన విద్యుత్ బిల్లు ఈనెలలో 1280 రూపాయలు వచ్చింది. నెలకు నాలుగు 480 రూపాయల అదనపు భారం పడితే ఎలా చెల్లించగలం. పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలి.
- వెంటూరి సురేష్,
అనపర్తి భవన నిర్మాణ కార్మికుడు