మత్స్యకారులకు అండగా ఉంటా
ABN, First Publish Date - 2022-05-14T05:53:42+05:30
అమలాపురం/ముమ్మిడివరం మే 13(ఆంధ్రజ్యోతి):మత్స్య కారులకు అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో శుక్రవారం ఆయన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ నాలుగో విడత సాయం పంపిణీని ప్రారంభించారు.
సీఎం జగన్
అమలాపురం/ముమ్మిడివరం మే 13(ఆంధ్రజ్యోతి):మత్స్య కారులకు అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో శుక్రవారం ఆయన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ నాలుగో విడత సాయం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు తాము ఎల్ల వేళలా అండగా ఉంటామన్నారు. 1,08,057 మత్స్యకారుల కుటుంబాలకు రూ.109 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. మత్స్యకారులకు నాలుగు విడతల్లో రూ.419 కోట్లు ఇచ్చామన్నారు. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కార్యకలాపాల వల్ల కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలోని 69 గ్రామాల్లో 6178 బోట్లకు సంబంధించి 23,458 కుటుంబాలకు నెలకు రూ.11,500 చొప్పున నాలుగు నెలల పాటు ఒక్కో కుటుంబానికి రూ.46 వేలను అందిస్తున్నామన్నారు. ఈ ఒక్కరోజే మత్స్యకార భరోసా కింద రూ.109 కోట్లు, ఓఎన్జీసీ పరిహారం కింద రూ.108 కోట్లు... వెరసి రూ.217 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో జీఎస్పీఎస్ సంస్థ డ్రిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహించినప్పుడు 14,824 కుటుంబాలకు ఏడు నెలల కాలానికి రూ.70 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మొత్తాన్ని మత్స్యకార కుటుంబాలకు అందించామన్నారు. ‘180 ఏళ్ల క్రితం మల్లాడి సత్యలింగం నాయకర్ సముద్రాన్నే నమ్ముకుని రంగూన్ వెళ్లి అపర కుబేరుడిగా మారారు. ఆ సమయంలో ఈ జిల్లాలో భూములు కొని ట్రస్టు పెట్టి వేల మంది పేదలకు దానధర్మాలు చేశారు. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి’ అని యువతకు పిలుపునిచ్చారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, నాలుగు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బరు ఆధునికీకరణతో పాటు ఈ పనులన్నింటికీ రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం, ఉప్పాడ వంటిచోట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలను చూసి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చేలా మత్స్యకార భరోసా పథకాన్ని తీసుకువచ్చారన్నారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల ఓట్లతో గెలిచి ఆ తర్వాత వారిని విస్మరించాయన్నారు. సభకు అధ్యక్షత వహించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంతో పాటు మరో 8 మండలాల్లో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు నాలుగు నెలలపాటు నెలకు రూ.11,500 వంతున విడుదల చేయించారన్నారు. చేతివృత్తుల వారిని ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ముందుందన్నారు. సభలో మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, ఎంపీలు చింతా అనురాధ, వంగా గీత, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాదరావు, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ పాల్గొన్నారు.