పాస్టర్ల గౌరవ వేతనాలకు మార్గదర్శకాలు
ABN, First Publish Date - 2022-05-15T05:20:35+05:30
క్రైస్తవ ప్రార్థనా మందిరాల పాస్టర్లకు ప్రతినెల గౌరవ వేతనం ఇచ్చేందుకు ఆయా గ్రామ, వార్డు అసిస్టెంట్లకు అందజేయాల్సిన పత్రాల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తూ సూచనలు జారీ చేసింది.
కాకినాడ సిటీ, మే 14: క్రైస్తవ ప్రార్థనా మందిరాల పాస్టర్లకు ప్రతినెల గౌరవ వేతనం ఇచ్చేందుకు ఆయా గ్రామ, వార్డు అసిస్టెంట్లకు అందజేయాల్సిన పత్రాల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తూ సూచనలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి షేక్ ఇమ్రాన్ శనివారం ఒక ప్రకటనలో వివరాలు తెలియజేశారు. పాస్టర్లు సంబంధిత పత్రాలు గ్రామ, వార్డు అసిస్టెంట్లకు అందజేసి వారి దరఖాస్తును ఈబీసీ-నేస్తం పోర్టల్‌లో ఈనెల 25వతేదీ నాటికి ముందుగానే నమోదు చేసుకోవాలి. చర్చి సొసైటీ కింద లేదా ట్రస్ట్ యాక్ట్ కింద నమోదై ఉండాలి. చర్చి స్థలం తప్పనిసరిగా సొసైటీ పేరుతో లేని పక్షంలో ట్రస్ట్ పేరుతో ఉండాలి. తహసీల్దార్ జారీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్, గ్రామ రెవెన్యూ అధికారి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు సంక్షేమ అభివృద్ధి అధికారితో జారీ చేయబడిన వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఉండాలి. సొసైటీకి లేదా ట్రస్ట్‌కు దాతలు ఇచ్చిన భూమికి సంబంధించిన రిజిస్టర్డ్, నోటరీ గిఫ్ట్ డీడ్ ఉండాలి. చర్చికి ఆదాయ వనరులు లేవని చర్చి నిర్వహణ/పాస్టర్ ద్వారా స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. చర్చి సొసైటీ/ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఒకే నెంబరు కలిగి ఉండవచ్చు కానీ ప్రతి చర్చికి ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాలి. అద్దె భవనాల్లో నడుస్తున్న చర్చి సొసైటీ/ట్రస్ట్‌లకు, రిజిస్టర్డ్ అద్దె లీజు అగ్రిమెంట్ గానీ, నోటరీ చేసిన ఒప్పంద పత్రం గానీ సమర్పించాలి.